‘ట్రాఫిక్’కు రవాణా శాఖ అండ..

23 Feb, 2014 00:34 IST|Sakshi

 రోడ్డు ప్రమాదాల నివారణకు ట్రాఫిక్ పోలీస్ శాఖ ప్రణాళిక
 రాష్ట్ర రవాణా శాఖతో కలిసి  సంయుక్త కార్యాచరణ అమలు
 
 సాక్షి, ముంబై: నగరంలో నియమనిబంధనలు ఉల్లంఘిస్తూ ప్రమాదాలకు కారణమవుతున్న వాహనదారులపై కఠిన చర్యలు తీసుకోవడానికి ముంబై ట్రాఫిక్ పోలీసులు ప్రణాళిక రూపొందిస్తున్నారు. ఈ మేరకు రాష్ట్ర రవాణా శాఖతో కలిసి సంయుక్త కార్యాచరణ అమలుచేయనున్నారు. ప్రస్తుతం నగరంలో రిజిస్టర్ అయిన వాహనాల వివరాలను రవాణా శాఖనుంచి సేకరించనున్నారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాల్లో నిబంధనలు ఉల్లంఘించిన వారిని త్వరగా పట్టుకునేందుకు ఆస్కారముంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. నగరంలో నానాటికీ ‘హిట్ అండ్ రన్’ కేసులు అధికంగా నమోదవుతున్నాయి. ఈ సందర్భంగా నగర కొత్త జాయింట్ కమిషనర్ ఆఫ్ పోలీస్ (ట్రాఫిక్) బి.కె. ఉపాధ్యాయ మాట్లాడారు. సంయుక్త కార్యాచరణపై రవాణా శాఖతో కూడా చర్చలు జరుపుతున్నామన్నారు. అన్ని వాహనాలకు సంబంధించి డేటా బేస్‌ను తమతో షేర్ చేసుకోవాల్సిందిగా కోరామన్నారు. దీనివల్ల రోడ్డు ప్రమాదాల సమయంలో నిబంధనలు ఉల్లఘించి పారిపోయిన వారిని త్వరితగతిన పట్టుకునే వీలుంటుందని అభిప్రాయపడ్డారు.
 
  నియమాలు పాటించని వాహనాలను పట్టుకునేందుకు ముందుగా తాము రీజినల్ ట్రాన్స్‌పోర్ట్ కార్యాలయం (ఆర్టీవో)ను ఆశ్రయించి తర్వాత వాహన రిజిస్ట్రేషన్ నంబర్‌ను తీసుకుంటామన్నారు. అంతేకాకుండా వాహన యజమాని చిరునామా తదితర వివరాలను సేకరిస్తున్నామన్నారు. ఈ ప్రక్రియకే కనీసం రెండు రోజుల సమయం పడుతోందని తెలిపారు. కాగా, ఒకోసారి వీరు సేకరించిన చిరునామా స్పష్టంగా లేకపోవడంతో పోలీసులకు వీరిని ఛేదించడంలో చాలా సమయం వృథా అవుతోంది. కాగా, ట్రాఫిక్ విభాగంలో సిబ్బంది కొరత తీవ్రంగా ఉందని, చాలా మంది సిబ్బంది రోడ్లపైనే విధులు నిర్వహిస్తున్నారని ట్రాఫిక్ అధికారి పేర్కొన్నారు.
 ఈ సందర్భంగా ట్రాఫిక్ అధికారి ఒకరు మాట్లాడుతూ.. ‘మితిమీరిన వేగంతో వచ్చే వాహనాలను నిలిపేందుకు యత్నించినా వారు విధి నిర్వహణలో ఉన్న కానిస్టేబుల్‌ను గాయపర్చి పారిపోతుంటారు. ఇలాంటి సంఘటనలు తరచూ జరుగుతున్నాయి. మద్యం తాగి వాహనాలు నడిపేవారు ఇలా మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతూ ఇతరుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నార’ని అన్నారు. అయితే వీరెవరనేది ఛేదించడం పోలీసులకు తలనొప్పిగా మారింది. నేరానికి పాల్పడిన వాహనాన్ని, దాని యజమానిని గుర్తించడం చాలా కష్టతరంగా మారుతోంది. దీంతో రాష్ట్ర రవాణా శాఖ తమకు వాహన వివరాలను అందజేయడం ద్వారా మార్గం సుగమం అవుతుందని అధికారి ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు