టీటీడీ సలహామండలి చైర్మన్‌గా శ్రీకృష్ణ?

13 Mar, 2016 02:58 IST|Sakshi
టీటీడీ సలహామండలి చైర్మన్‌గా శ్రీకృష్ణ?

 టీటీడీ స్థానిక సలహా మండలి
 చైర్మన్‌గా నియామకం
 తిరుపతిలో ప్రకటించిన
 చైర్మన్ చదలవాడ
 అధికారిక సమాచారం
 లేదంటున్న టీటీడీ

 
 చెన్నై, సాక్షి ప్రతినిధి: తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) స్థానిక సలహామండలి చైర్మన్‌గా ప్రముఖ ఆడిటర్ శ్రీ కృష్ణ నియమితులైనట్లు సమాచారం. ఇటీవలి వరకు చైర్మన్‌గా వ్యహరించిన ఆనందకుమార్ రెడ్డి పదవీకాలం ముగియడంతో శ్రీకృష్ణ నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్‌లో తెలుగుదేశం పభుత్వం ఏర్పడిన నాటి నుంచి స్థానిక సలహా మండలిలో మార్పులు, చేర్పులు చోటుచేసుకుంటాయనే ప్రచారం జరిగింది. ఇలా ప్రచారం సాగుతుండగానే ఏడాది గడిచిపోయింది.
 
  గత పాలకమండలిలో సభ్యుడైన శ్రీకృష్ణను చైర్మన్‌గా నియమించడం ఖాయమనే ప్రచారం జోరుగా సాగింది. ఏపీ ప్రభుత్వం ఇదిగో అదిగో ఉంటూ నెలల తరబడి కాలం వెళ్లదీసింది. సుమారు ఆరు నెలల క్రితం శ్రీకృష్ణను నియమిస్తూ ఉత్తర్వులు సిద్ధమైనాయనే ప్రచారం జరిగింది. అయితే అంతలోనే ఆ సమాచారం సద్దుమణిగింది. కాగా, టీటీడీ చైర్మన్ చదలవాడ కృష్ణమూర్తి శనివారం తిరుపతిలో మీడియా సమావేశం నిర్వహించి చెన్నై మండలి చైర్మన్‌గా శ్రీకృష్ణ పేరు ఖరారైనట్లు ప్రకటించారు. సభ్యుల పేర్లు ప్రకటించలేదు.
 
 ఇది అనధికారికమే:
  శ్రీకృష్ణను చైర్మన్‌గా నియమిస్తూ ప్రభుత్వం ఇంతవరకు ఉత్తర్వులు ఇవ్వలేదని తెలుస్తోంది. ఉత్తర్వులు వెలువడకుండా శ్రీకృష్ణ పేరును ఎలా ప్రకటించారని చైర్మన్ చదలవాడను ప్రభుత్వం ప్రశ్నించినట్లు సమాచారం. టీటీడీ అధికార వర్గాలు సైతం శ్రీకృష్ణ పేరుతో ఉత్తర్వులు సిద్ధం కాలేదని, చదలవాడ ప్రకటన అనధికారికమేనని స్పష్టం చేశాయి. చదలవాడ చేసిన ప్రకటన ‘తొందరపడి ఒక కోయిల ముందే కూసింది, విందులు చేసింది’ అనే పాట చందంగా తయారైంది.
 

మరిన్ని వార్తలు