కొరియర్‌లో కూరగాయలు!

18 Oct, 2016 15:31 IST|Sakshi
కొరియర్‌లో కూరగాయలు!
డీడీఎస్‌ ఆధ్వర్యంలో వినియోగదారులకు పంపిణీ 
అందుబాటులో 18రకాల కూరగాయలు, ఆకుకూరలు 
నాణ్యతపై ప్రత్యేక పర్యవేక్షణ
ప్రతి మంగళవారం, శుక్రవారం సరఫరా
ప్రయోగాత్మకంగా 200 కుటుంబాలకు అందజేత 
ఆరునెలల నుంచి విజయవంతంగా సాగుతున్న పథకం 
 
నెత్తిన గంపతో వీధుల్లో కేకలు వేస్తూ తిరుగుతూ కూరగాయలు అమ్మేవారిని చూశాం. చిన్నపాటి దుకాణం ఏర్పాటు చేసుకొని అమ్మకాలు చేపట్టే పద్ధతీ చూశాం.. ప్యాకింగ్‌ చేసి షాపింగ్‌మాల్స్‌లో అమ్మడమూ చూశాం.. కానీ జహీరాబాద్‌ పట్టణంలో కూరగాయల అమ్మకంలో కొత్త పద్ధతి అమలవుతోంది. ఇంటికి కావాల్సిన వస్తువులను ఆన్ లైన్ లో బుక్‌ చేసుకున్నట్టు... కూరగాయలను కూడా ఫోన్ చేసి బుక్‌ చేసుకుంటే కొరియర్‌ సంస్థల్లాగా ఇంటికి తెచ్చి ఇచ్చే విధానం ఇక్కడ సాగుతోంది.అది కూడా సేంద్రియ కూరగాయలు కావడంతో వీటికి డిమాండ్‌ ఎక్కువగా పలుకుతోంది.  
 
జహీరాబాద్‌ : సేంద్రియ వ్యవసాయ సాగు విధానంలో పండించడంతో పాటు వాటిని వినియోగదారులకు ‘ఇంటికి సరఫరా’ పథకం విజయవంతంగా సాగుతోంది. జహీరాబాద్‌ పట్టణంలో ఆరునెలల క్రితం డెక్కన్ డెవలప్‌మెంట్‌ సొసైటీ(డీడీఎస్‌) ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమానికి వినియోగదారుల నుంచి మంచి ఆదరణ లభిస్తోంది. 2016 ఏప్రిల్‌ 7వ తేదీన ప్రారంభించిన ఈ కార్యక్రమానికి వినియోగదారుల నుంచి డిమాండ్‌ లభిస్తోంది. ప్రస్తుతం ఈ పథకం కింద 150 నుంచి 200 కుటుంబాలకు సరిపడా సేంద్రియ కూరగాయలను సేకరించి సరఫరా చేస్తోంది. ప్రతి మంగళ శుక్రవారాలలో వినియోగదారులకు ఇంటింటికీ మొబైల్‌ వాహనం ద్వారా సరఫరా చేస్తున్నారు.  
 
లోపాలు లేకుండా పర్యవేక్షణ 
ఈ పథకాన్ని విజయవంతం చేసేందుకు పలువురికి బాధ్యతలు అప్పగించారు. పొలంలో కూరగాయలను సాగుచేసే దగ్గరి నుంచి వినియోగదారులకు చేరేవరకు ఎలాంటి లోపాలు లేకుండా డీడీఎస్‌ సంస్థ పర్యవేక్షిస్తోంది. వినియోగదారుల నుంచి ఎలాంటి ఫిర్యాలు రాకుండా నాణ్యవంతమైన కూరగాయలను సేకరించి అందిస్తోంది. ప్రస్తుతం జహీరాబాద్‌ పట్టణంలోని ఆదర్శనగర్‌ కాలనీ, దత్తగిరి కాలనీ, మహీంద్రాకాలనీ, శ్రీనగర్, ఎంఆర్‌హెచ్‌ఎస్‌ కాలనీల్లోని వినియోగదారులకు సరఫరా చేస్తోంది. డీడీఎస్‌కు చెందిన వ్యవసాయ పొలంలో 18 రకాల కూరగాయలు, ఆకు కూరలను సేంద్రియ విధానంలో పండిస్తున్నారు. వీరి పొలంలో పండించే కూరగాయలు వినియోగదారులకు సరిపోనందున క్రిష్ణాపూర్, బిడకన్నె, కాశీంపూర్, పస్తాపూర్, కుప్పానగర్, బర్దీపూర్‌ గ్రామాల్లో ఎంపిక చేసిన 66 మంది రైతుల పొలాల్లో సేంద్రియ విధానంలో కూరగాయలను సాగు చేయిస్తున్నారు. సాగు చేసిన కూరగాయలను రైతుకు మార్కెట్లో లభించే ధర కన్నా ఎక్కువ ధరకు కొనుగోలు చేస్తున్నారు. దీంతో రైతులు కూడా సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
 
రైతు పొలంలో కూరగాయలు సాగు చేసేందుకు అవసరమైన విత్తనాల ఎంపిక దగ్గరి నుంచి సేంద్రియ విధానంలో వేప కషాయం, పంచగవ్య, వర్మీవాష్‌లను పిచికారీ చేయించి పురుగులు, తెగుళ్లు రాకుండా చూస్తున్నారు. వీటిని సూపర్‌వైజర్‌గా ఉన్న కిష్టయ్య ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తుంటాడు. రైతులు తీసుకువచ్చిన కూరగాయల నాణ్యతను డీడీఎస్‌ డిప్యూటీ  డైరెక్టర్‌ జయప్ప పరిశీలిస్తాడు. ఒక్కో కుటుంబానికి ఇచ్చే బుట్టలో కిలో టమాటతో పాటు 4 రకాల కూరగాయలు పావు కిలో వంతున, 4 రకాల ఆకు కూరలతో పాటు కొత్తిమీర, కరివేపాకు, పచ్చి మిర్చిని ఇస్తున్నారు. ఒక్కో బుట్టకు రూ.120 నుంచి రూ.140 ధరకు విక్రయిస్తున్నారు. అన్ని కలిపి 9 కిలోల వరకు అందిస్తున్నారు. మార్కెట్లో లభించని ఆకు కూరలైన అవిష కూర, ఓమ కూర, దొగ్గలి, మునగ ఆకు, జొన్న సించలి కూర, గునుగు ఆకు, పప్పు కూర, పాయిలి కూర, పుంటికూరలను కూడా అందిస్తున్నారు.   
 
గత ఆరు నెలల కాలంగా డీడీఎస్‌ వారు అందిస్తున్న కూరగాయలను కొంటున్నా. మంచి  నాణ్యంగా ఉంటున్నాయి. వారు ఇంటి వద్దకే తీసుకుని వచ్చి ఇస్తుండడంతో సౌకర్యంగా కూడా ఉంది. బయట లభించని ఆకు కూరలు కూడా ఇస్తున్నారు. నేను బయట కూరగాయలను కొనుగోలు చేయడం పూర్తిగా  మానేశా.  
జి.హేమశ్రీ,, గృహిణి, మహీంద్రా కాలనీ 
 
సేంద్రీయ వ్యవసాయంతో పండించిన కూరగాయలు, ఆహారం తీసుకోవడం ద్వారానే మానవుడు మనుగడ సాధిస్తాడు. ప్రస్తుతం ఏది కొనాలన్నా వినియోగదారుడు భయంతోనే కొంటున్నాడు. వాటిలో ఏ మేరకు రసాయనం, పురుగు మందుల అవశేషాలు ఉన్నాయనేది వారిని భయాందోâýæనలకు గురిచేస్తోంది. వాటి నుంచి  బయట  పడవేసేందుకే సేంద్రియ కూరగాయలను వినియోగదారులకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం తీసుకుని విజయవంతంగా  కొనసాగిస్తున్నాం. 
పీవీ సతీష్, డీడీఎస్‌ డైరెక్టర్‌ 
 
>
మరిన్ని వార్తలు