రైల్వే స్టేషన్లలో ‘వే ఫైండింగ్ మ్యాప్’

24 Dec, 2014 23:26 IST|Sakshi

ప్రయాణికుల సౌకర్యార్థం ఏర్పాటు
సాక్షి, ముంబై : మెట్రోస్టేషన్ చుట్ట పక్కల ఉన్న ప్రాంతాలను మీరు సులువుగా తెలుసుకునేందుకు వీలుగా అంధేరి, వర్సోవ మెట్రో స్టేషన్లలో మ్యాప్‌లను ఏర్పాటు చేశారు. ఈ మ్యాప్‌ల ద్వారా ప్రయాణికులు తాము చేరుకోవాల్సిన గమ్యస్థానాలను మరింత సులువుగా తెలుసుకునే వీలు ఉంటుంది. మ్యాప్‌లలో ముఖ్యమైన ల్యాండ్ మార్కులు, అదేవిధంగా భవనాలు, కార్యాలయాలు, ఈ మెట్రో స్టేషన్లకు ఐదు కి.మీ. వరకు ఉన్న మార్గాలను ఈ మ్యాప్ సూచిస్తుంది.

ఇదిలా ఉండగా, స్టేషన్ చుట్టు పక్కల ఉన్న ప్రాంతాలకు వెళ్లేందుకు చాలా మంది ప్రయాణికులకు సరైన మార్గం తెలియక రవాణాను ఆశ్రయిస్తుంటారు. కాగా, ప్రయాణికులు రైల్వే స్టేషన్లకు దగ్గరగా ఉన్న ఆస్పత్రులు, కార్యాలయాలు, సందర్శన స్థలాలు తదితర వాటికోసం వేరే రవాణా మార్గాలపై ఆధారపడకుండా నడిచి వెళ్లే విధంగా ఈ మ్యాప్‌ను ఏర్పాటు చేశామని అధికారి తెలిపారు. అంతేకాకుండా ఈ చుట్టుపక్కల ఉన్న ప్రాంతాలను మరింత సులువుగా తెలుసుకునేందుకు ఈ మ్యాప్ ఎంతో దోహద పడుతుందన్నారు.

ద ముంబై ఎన్విరాన్‌మెంటల్ సోషల్ నెట్‌వర్క్ (ఎఈఎస్‌ఎన్) వర్సోవా, అంధేరి స్టేషన్లలో 13 ‘వే ఫైండింగ్ మ్యాప్’లను ఏర్పాటు చేశారు. ఇందుకు గాను బాంబే ఛాంబర్ ఆఫ్ కామర్స్ అండ్ ఇండస్ట్రీస్ (బీసీసీఐ) ఆర్థిక సహాయం చేసింది. ఈ మెట్రో స్టేషన్ల ఆవరణలోని ప్రాంతాల విషయమై చాలామంది ప్రయాణికులకు అవగాహన ఉండదు. వీరు ఆటో, ట్యాక్సీలను ఆశ్రయిస్తుంటారు. దీంతో ఆటోలు, ట్యాక్సీలతో మెట్రో స్టేషన్లు రద్దీగా మారుతున్నాయి.

ప్రయాణికులు వారు ఎక్కడికి వెళ్లాలనుకుంటున్నారో ఆ ప్రాంతానికి సంబంధించిన సమాచారాన్ని మ్యాప్‌ల ద్వారా తెలియజేయడం ద్వారా దగ్గర ఉన్న ప్రాంతాలకు నడిచి వెళ్లేందుకు నిర్ణయించుకుంటారని ఎంఈఎస్‌ఎన్‌కు చెందిన తృప్తి వైట్ల అభిప్రాయపడ్డారు. ఈ మ్యాప్‌లను స్టేషన్లలో అమర్చినందుకు గాను రూ.5 లక్షల వ్యయం అయిందని ఆయన తెలిపారు. స్టేషన్లకు కొంచెం దూరంలో ఉన్న ఆస్పత్రులు, ప్రార్థనా మందిరాలు, బ్యాంక్‌లకు వెళ్లాలనుకున్న ప్రయాణికులకు ఈ మ్యాప్‌లు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయనీ, ప్రయాణికులకు మార్గదర్శకాలుగా ఉపయోగపడుతాయని ముంబై మెట్రో వన్ ప్రైవేట్ లిమిటెడ్ అధికార ప్రతినిధి ఒకరు పేర్కొన్నారు.

ఇలాంటి మ్యాప్‌లనే ఘాట్కోపర్, సాకినాకా స్టేషన్లలో కూడా ఏర్పాటు చేయడానికి ఎమ్మెమ్మార్డీఏ యోచిస్తోంది. అయితే ఈ మ్యాప్‌ల పట్ల ప్రయాణికుల నుంచి మంచి స్పందన వచ్చిన తర్వాతనే మిగతా స్టేషన్లలో కూడా అమర్చనున్నట్లు అధికారి వెల్లడించారు. అంతేకాకుండా ముఖ్య రైల్వే స్టేషన్లలో, బెస్ట్ బస్టాపుల్లో కూడా ఈ మ్యాప్‌లను ఏర్పాటు చేయడానికి అధికారులు యోచిస్తున్నారు.

మరిన్ని వార్తలు