Arunachal Pradesh: మ్యాపులతో మడతపేచీ | Sakshi
Sakshi News home page

తీయటి కబుర్లు చెప్పే చైనా.. మ్యాపులతో మడతపేచీ

Published Fri, Sep 1 2023 12:36 AM

China Official Map 2023 Includes Arunachal Pradesh Says South Tibet - Sakshi

నోటితో మాట్లాడుతూ, నొసటితో వెక్కిరించడమంటే ఇదే. భారత్‌తో స్నేహసంబంధాలకు కట్టుబడి ఉన్నట్టు తీయటి కబుర్లు చెప్పే చైనా తన వక్రబుద్ధిని మరోసారి వెల్లడించుకుంది. సోమవారం నాడు సరికొత్త అధికారిక ‘ప్రామాణిక పటం’– 2023 విడుదల చేస్తూ, అందులో భారత్‌లోని పలు ప్రాంతాల్ని తమ దేశంలో భాగమన్నట్టు చూపింది.

భారత ఈశాన్య రాష్ట్రం అరుణాచల్‌ ప్రదేశ్, అక్సాయ్‌చిన్‌లను తన భూభాగాలంటోంది. మొత్తం తైవాన్, వివాదాస్పద దక్షిణ చైనా సముద్ర ప్రాంతాన్ని కూడా ఈ కొత్త జాతీయ పటంలో తమ అంతర్భాగమనేందుకు చైనా తెగించింది. దాదాపు పొరుగు దేశాలన్నిటికీ కోపం తెప్పించడమే కాక, మరోసారి కయ్యానికి కాలు దువ్వింది. పైపెచ్చు, అంతా సవ్యంగానే ఉన్నదన్నట్టు ‘‘జాతీయ సరిహద్దులను గీయడంలో చైనాతో పాటు వివిధ దేశాలు ఉపయోగించే పద్ధతి ఆధారంగా’’నే ఈ పటాన్ని రూపొందించినట్టు డ్రాగన్‌ ప్రకటించుకోవడం విచిత్రం. 

ఈ వ్యవహారాన్ని ఢిల్లీ ఖండిస్తుంటే, బీజింగ్‌ మాత్రం మ్యాప్‌ల విడుదల నిత్య కృత్యమేననీ, దీనిపై అతి చేయద్దనీ విషయతీవ్రతను తక్కువ చేసి చెబుతుండడం మరీ విడ్డూరం. చెప్పేదొకటి చేసేదొకటి జిత్తులమారి చైనా నిత్యకృత్యం. అందుకే, ఈ వ్యవహారాన్ని భారత్‌ తీవ్రంగా తీసుకోక తప్పదు. వారం క్రితం జొహాన్నెస్‌బర్గ్‌లో ‘బ్రిక్స్‌’ సదస్సు జరిగినప్పుడు భారత ప్రధాని, చైనా అధ్యక్షుడు సమావేశమై సంభాషించుకున్నారు. సరిహద్దుల వద్ద పరిస్థితిని చక్కదిద్ది, సత్సంబంధాలకు కృషి చేయాలని చర్చించుకున్నారు.

మరోపక్క ఈ 9, 10 తేదీల్లో ఢిల్లీలో జరిగే ‘జీ–20’ శిఖరాగ్ర సదస్సుకూ చైనా అధినేత హాజరు కావాల్సి ఉంది. సరిగ్గా ఈ సమయంలో ఉరుము లేని పిడుగులా డ్రాగన్‌ దేశ సరిహద్దులు ఈ ‘వక్రీకరించిన’ పటంతో బాంబు పేల్చింది. గమనిస్తే మన ప్రాంతాలకు చైనీస్‌ పేర్లు పెడుతూ, మునుపటి పటంలోనూ చైనా ఇదే తెంపరితనం చూపింది. ఆ దేశ పశ్చిమ హద్దుల్లో ఉన్న ప్రాంతాలను తనవిగా చెప్పుకొంది. అక్సాయ్‌చిన్‌ 1950–60ల నుంచి మన కేంద్రపాలిత ప్రాంతం లద్దాఖ్‌లో భాగం. 1962 యుద్ధంలో చైనా దాన్ని ఆక్రమించుకుంది. అరుణాచల్‌నేమో దశాబ్దాలుగా తమ దక్షిణ టిబెట్‌లోది అంటోంది. ఆ రెండూ భారత అంతర్భాగాలని మన ప్రభుత్వం పదేపదే ప్రకటిస్తున్నా, తన మూర్ఖవాదన కొనసాగిస్తోంది. 

పటంలోని అంశాలు అంతర్జాతీయ అంగీకృత సరిహద్దులను పూర్తిగా ఉల్లంఘిస్తున్నాయి. అరుణాచల్‌ ప్రదేశ్‌ను ‘జంగ్నాన్‌’ (దక్షిణ టిబెట్‌) అని పిలుస్తూ, అది తమదేననడం బీజింగ్‌ సిగ్గు మాలినతనం. చరిత్ర చూస్తే టిబెట్‌కూ, బ్రిటీషు ఇండియాకు మధ్య 1914లో సిమ్లా సమావేశం జరిగింది. అప్పుడే సరిహద్దుగా మెక్‌మోహన్‌ రేఖను అంగీకరించాయి. చైనా చేస్తున్న ప్రకటనలు, చూపుతున్న పటం ఆ అంగీకరించిన సరిహద్దు రేఖ చట్టబద్ధతను ఉల్లంఘించడమే! అలాగే, ద్వీప దేశమైన తైవాన్‌ ఏడాదిపైగా తీవ్రంగా ప్రతిఘటిస్తున్నా, పట్టువదలని బీజింగ్‌ ‘వన్‌ చైనా విధానం’ అంటూ దాన్ని తమ పటంలో చూపడం దురహంకారం.

ఇక, పసిఫిక్, హిందూ మహాసముద్రాలకు ప్రధాన నౌకాయాన అనుసంధానమైన దక్షిణ చైనా సముద్ర ప్రాంతం సైనిక, వాణిజ్యపరంగా అతి కీలకం. వివాదాస్పద ద్వీపాలతో సహా ఈ ప్రాంతమంతా చైనా తమ పటంలో కలిపేసుకుంటోంది. ఈ ప్రాంతంలో డ్రాగన్‌ సామ్రాజ్యవాద విస్తరణ వైఖరిని ఫిలిప్పీన్స్, వియత్నామ్, మలేసియా, జపాన్‌ తదితర దేశాలు పదే పదే ఎత్తిచూపుతున్నాయి. అయినా అది తన తీరు మార్చుకోలేదు. 

భౌతికంగా తన అధీనంలో లేకున్నా ఈ ప్రాంతాలు తనవేననడం చిరకాలంగా చైనా చూపుతున్న మొండివైఖరే. తాజా పటం జారీ వల్ల దానికి కొత్తగా కలిసొచ్చేదేమీ లేదు. పైగా, మిగతా ప్రపంచపు సహాయం, సానుభూతి కూడా దక్కవు. అయినా సరే, డ్రాగన్‌ తన దురహంకారాన్ని చాటుకోవడం గమనార్హం. ఒక్కమాటలో చైనా అధినేత షీ జిన్‌పింగ్‌ సామ్రాజ్యవాద విస్తరణ వైఖరికి ఈ కొత్త మ్యాప్‌ ప్రతీక.

అధికారిక జాతీయ పటాల జారీ చైనాలో దాదాపు ఏటా జరిగే తంతు అయినా... భారత్‌ వరకు తీసుకుంటే చంద్రయాన్‌–3 విజయం, రానున్న జీ–20 సదస్సు నేపథ్యంలో ఇప్పుడీ పటాన్ని ఎందుకు విడుదల చేసినట్టు? ఇరుదేశాల మధ్య ఇలాంటి సరిహద్దు వివాదాలే గతంలోనూ సైనిక ప్రతిష్టంభనకు దారితీశాయి. 2017లో తలెత్తిన డోక్లామ్‌ సంక్షోభం, 2020లో గల్వాన్‌ లోయలో సైనిక ఘర్షణలే తాజా ఉదాహరణలు. దీంతో దౌత్య సంబంధాలూ దెబ్బతింటున్నాయి. బలగాల్ని వెనక్కి పిలిచి, ఉద్రిక్త వాతావరణాన్ని తగ్గించుకోవాల్సిన వేళ ఇలాంటి తప్పుడు పటం సాధారణ పరిస్థితుల పునరుద్ధరణకు ఏ రకంగానూ దోహదపడదు. 

ఇప్పటికే లద్దాఖ్‌లోని కొంత భాగాన్ని చైనా ఆక్రమించేసుకుందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ ఆరోపిస్తున్నారు. వివిధ విదేశీ సర్వేలు, ఉపగ్రహ ఛాయాచిత్రాలు సైతం భారత సరిహద్దులో చైనా వివాదాస్పద నిర్మాణాల్ని ధ్రువీకరిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో అనుమానాలు పోగొట్టేలా మన పాలకులు వాస్తవాలను వెల్లడించాలి. నమ్మడానికి వీల్లేని పొరుగుదేశంతో నిక్కచ్చిగానే వ్యవహరించాలి. సార్వభౌమాధికారం, సమగ్రతల్లో రాజీ లేదని మాటల్లో కన్నా చేతల్లో చూపాలి.

జీ–20 అధ్యక్షతతో విశ్వగురువులయ్యామని సంబరపడేకన్నా, అంతర్గత ఘర్షణలున్న అన్ని పక్షాలనూ అర్థవంతమైన సమగ్ర చర్చలతో ఒక తాటిపైకి తేవడమే అసలు విజయమని గ్రహించాలి. చైనాతో సంభాషణకు అన్ని మార్గాల్నీ అన్వేషిస్తూనే, మనకున్న ఆందోళనల్ని కుండబద్దలు కొట్టాలి. అవకాశాన్ని బట్టి అందుకు రానున్న జీ–20ను సైతం వేదికగా చేసుకోవాలి. దౌత్య, వాణిజ్య సంబంధాల మెరుగు దలకు సరిహద్దుల్లో సామరస్య వాతావరణం కీలకమని మరోసారి అందరికీ తలకెక్కేలా చూడాలి.  

Advertisement

తప్పక చదవండి

Advertisement