ప్లయింగ్‌ కారు

23 Apr, 2017 17:44 IST|Sakshi

నేల మీద కార్ల తరహాలో తిరుగుతూ.. నడవడానికి అసాధ్యమయ్యే ప్రాంతాల్లో పక్షిలా ఎగిరే వాహనాల గురించి సినిమాల్లోనో.. కార్టూన్లలోనో చూసుంటాం. కానీ పీఏఎల్‌–వి సంస్థ అచ్చం అలాంటి వాహనాలనే తయారు చేసింది. ఇవి నేల మీద ప్రయాణించడంతోపాటు అవసరమైనప్పుడు గాల్లో కూడా ఎగరగలవు. ఈ ఎగిరే కారులోని ప్రత్యేకతలు..

ప్రత్యేక ఫీచర్లు

 • ఇద్దరు కూర్చుని ప్రయాణించే ఈ వాహనాన్ని హైబ్రిడ్‌ కారు లేదా గైరో ప్లేన్‌ అంటారు.
 • డచ్‌కు చెందిన పీఏఎల్‌–వి, యూరోప్‌ ఎన్‌వి సంస్థలు ఈ మూడు చక్రాల ఫ్లయింగ్‌ కారును అభివృద్ధి చేశాయి.
 • ఇది చూడటానికి బైక్‌ తరహాలో ఉన్నప్పటికీ సౌకర్యం పరంగా కారును పోలి ఉంటుంది.
 • నేల మీద నడవడానికి, గాల్లో ఎగరడానికి అనుకూలంగా ‘టిల్టింగ్‌’ వ్యవస్థ ఉంటుంది.
 • ఇది నేల మీద ప్రయాణిస్తున్నప్పుడు గాల్లోకి ఎగరాలంటే విమానం తరహాలో కొద్ది దూరం సమతలం మీద ప్రయాణిస్తే నిర్దిష్ట వేగం పొందిన తర్వాత గాల్లోకి ఎగురుతుంది. అయితే టేకాఫ్‌ కోసం టచ్‌ ప్యాడ్‌ మీదున్న టేకాఫ్‌ బటన్‌ ప్రెస్‌ చేయాల్సి ఉంటుంది.
 • ఈ ఫ్లయింగ్‌ కారులో ఉన్న సింగిల్‌ రోటార్, ప్రొపెల్లర్‌ కేవలం రెండు నిమిషాల వ్యవధిలోనే విచ్చుకుంటుంది. ఆ తర్వాత పూర్తిస్థాయిలో గాల్లో ఎగరడానికి అనుకూలంగా సిద్ధమవుతుంది.
 • ఈ వాహనం గరిష్టంగా 4000 అడుగుల ఎత్తు వరకు గాల్లో ఎగరగలదు.
 • ఇది ఎయిర్‌ అన్‌ కంట్రోల్డ్‌ (వాయు అనియంత్రిత) విజువల్‌ ఫ్లైట్‌ రూల్స్‌ ట్రాఫిక్‌ విభాగంలోకి రావడం వల్ల వాణిజ్య విమానం తరహాలో అనుమతులు పొందాల్సి ఉంటుంది.
 • ఇందులో ఫ్లైట్‌ సర్టిఫైడ్‌ ఎయిర్‌ క్రాఫ్ట్‌ పెట్రోల్‌ ఇంజన్‌ను కలిగి ఉంటుంది. ఇది నేల మీద, వాయు మార్గాల్లో గరిష్టంగా గంటకు 180 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంటుంది.
 • ఆకృతి పరంగా హెలికాఫ్టర్‌ని పోలి ఉన్నప్పటికీ హెలికాఫ్టర్‌లోని మెయిన్‌ రోటార్‌తో పోల్చితే.. ఇందులోని మెయిన్‌ రోటార్‌ వేగం తక్కువగా ఉంటుంది.
 • ఇందులో ఇంజన్‌ ఫెయిలయితే దిగులు చెందాల్సిన పనిలేదు. ఎందుకంటే ఇందులోని గైరోప్లేన్‌ టెక్నాలజీ రోటార్‌ను తిప్పడానికి సహాయపడుతుంది. తద్వారా తక్కువ వేగం వద్ద ప్రమాదానికి గురికాకుండా సురక్షితంగా ల్యాండ్‌ చేయవచ్చు.
 • ఈ ప్లయింగ్‌ కారులో సీసం, మిశ్రమ రహిత పెట్రోల్‌ను వినియోగిస్తారు. ఇది గగన తలంలో ఉన్నప్పుడు లీటర్‌కు 28 కి.మీల మైలేజ్, నేల మీద ప్రయాణిస్తున్నప్పుడు లీటర్‌కు 12 కి.మీల మైలేజ్‌ ఇస్తుంది.

మరిన్ని వార్తలు