2030 నాటికి అతిపెద్ద ఇంటర్నెట్‌ కంపెనీ ఏదంటే..

21 Mar, 2017 21:16 IST|Sakshi
2030 నాటికి అతిపెద్ద ఇంటర్నెట్‌ కంపెనీ ఏదంటే..

న్యూయార్క్‌: 30 ఏళ్ల క్రితం స్కూళ్లకు కంప్యూటర్లు అందుబాటులోకి రావడం పెద్ద పురోగతి. ఈ రోజున విద్యార్థుల చేతుల్లోకి లాప్‌ట్యాప్‌లు రావడం పెద్ద పురోగతి. మరి రేపు? అంటే భవిష్యత్తులో సమాచార సాంకేతిక విప్లవం ఎలా ఉంటుంది? అప్పుడు అతిపెద్ద ఇంటర్నెట్‌ కంపెనీ ప్రపంచంలో ఏదై ఉంటుంది? దీనికి డావిన్సీ ఇనిస్టిట్యూట్‌లో భవిష్యత్తును అంచనావేసే మేథావిగా పనిచేస్తున్న థామస్‌ ఫ్రే చెబుతున్న అంశాలు అశ్చర్యకరంగానూ, నమ్మలేని విధంగాను ఉన్నాయి.
 
భవిష్యత్తులో ప్రపంచంలో అతిపెద్ద ఇంటర్నెట్‌ కంపెనీగా ఆన్‌లైన్‌లో విద్యను బోధించే కంపెనీయే ఆవిర్భవిస్తుందని థామస్‌ ఫ్రే అంచనా వేశారు. విద్యార్థులకు వివిధ పాఠ్యాంశాల్లో విద్యను చక్కగా విడమర్చి బోధించే టీచర్లుగా మానవులు ఉండరని, కంప్యూటర్ల ద్వారా రోబోలే టీచర్లుగా వ్యవహరిస్తాయని ఆయన చెబుతున్నారు. ఓ మానవ టీచరు తరగతి గదిలో 20 మంది విద్యార్థులకు ఒకేసారి బోధించాల్సి ఉంటుంది కనుక ఆయన విద్యార్థుల గ్రాహ్య శక్తి అంచనావేసి వేర్వేరు పద్ధతుల్లో వాళ్లకు విడమర్చి చెప్పడం సాధ్యం కాదని, అదే రోబో టీచరయితే కంప్యూటర్‌ స్క్రీన్‌ ముందు కూర్చున్న విద్యార్థి శక్తి సామర్థ్యాలను అంచనావేసి, వాటికి అనుగుణంగా బోధిస్తుందని ఆయన చెప్పారు. అవసరమైతే రోబో టీచర్లు, విద్యార్థుల వ్యక్తిగత ఇష్టాయిష్టాలను కూడా తెలుసుకొని, వారి అభిరుచులను ఉదాహరణగా తీసుకొని విద్యను బోధించే అవకాశం కూడా ఉంటుందని ఆయన అన్నారు.
 
వారాంతంలో హోం వర్క్‌ చేయడంలో ప్రతి విద్యార్థికి రోబో టీచరు చక్కగా సహకరిస్తారని, రోబో టీచర్ల రాక కారణంగా ప్రస్తుతం ఓ తరగతి సగటు విద్యార్థి ఏడాదిలో నేర్చుకుంటున్న విద్యను ఆరు నెలల్లోనే నేర్చుకోగలరని థామస్‌ చెప్పారు. రానున్న 14 ఏళ్లలోనే ఈ మార్పులన్నీ చోటు చేసుకుంటాయని ఆయన చెప్పారు. కత్రిమ మేథస్సులో శరవేగంగా వస్తున్న మార్పులు, అంటే, గూగుల్‌ కంపెనీ అభివద్ధి చేస్తున్న డీప్‌ మైండ్, ఐబీఎం అభివద్ధి చేస్తున్న వాట్సన్‌ ఇంధన శక్తితో పనిచేసే రోబోలు, అమెజాన్‌ కంపెనీ అభివద్ధి చేస్తున్న ద్రోన్‌ సర్వీసు వ్యవస్థలను దష్టిలో పెట్టుకొని థామస్‌ ఫ్రే ఈ భవిష్యతు అంచనాలను వేశారు. 2030 నాటికి తన అంచనాలు నిజమవుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు