పీఎంకేఎస్వైలో 11 రాష్ట్ర ప్రాజెక్టులు

12 May, 2016 02:40 IST|Sakshi
పీఎంకేఎస్వైలో 11 రాష్ట్ర ప్రాజెక్టులు

సమన్వయ కమిటీ ప్రతిపాదనల్లో చేర్చాం: హరీశ్
సాక్షి, న్యూఢిల్లీ: ప్రధాన మంత్రి కృషి సించాయి యోజన (పీఎంకేఎస్‌వై) సమన్వయ కమిటీ దేశవ్యాప్తంగా సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేసేందుకు పలు ప్రతిపాదనలను రూపొందించిందని.. త్వరలోనే వాటిని కేంద్ర మంత్రి మండలికి అందజేయనుందని నీటి పారుదల శాఖ మంత్రి టి.హరీశ్‌రావు వెల్లడించారు. బుధవారం ఢిల్లీలో పీఎంకేఎస్‌వై సమన్వయ కమిటీ సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘పీఎంకేఎస్‌వైలో తెలంగాణకు చెందిన 11 ప్రాజెక్టులు చేర్చాలని సిఫారసుల్లో చేర్చాం.

మొత్తంగా ప్రాజెక్టులపై రాష్ట్రాలు-కేంద్రం మధ్య ఎంవోయూ జరిగిన వారంలోనే నిధులు విడుదల చేయాలి, ప్రాజెక్టు వ్యయంలో 60% గ్రాంటుగా ఇవ్వాలి, ఆపైన నాబార్డు నుంచి కేంద్రం హామీదారుగా ఉంటూ రుణం ఇప్పించాలి, ఆ రుణంపై వడ్డీని 4.5 శాతానికి తగ్గించాలి, సకాలంలో పూర్తయిన ప్రాజెక్టుల రుణంపై వడ్డీని కేంద్రమే భరించాలి, అంచనా వ్యయం 200% పెరిగిన ప్రాజెక్టులను సీడబ్ల్యూసీ పునఃపరిశీలించాలని ప్రతిపాదించాం. వాటి ని కేంద్ర కేబినెట్ త్వరలోనే ఆమోదించి నిధులు విడుదల చేస్తారని ఆశిస్తున్నాం..’’ అని హరీశ్ తెలిపారు. సమావేశంలో అన్ని అంశాలపై పూర్తి స్పష్టత వచ్చిందన్నారు.

 కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ అహిర్‌తో భేటీ
తమ్మిడిహట్టి, మేడిగడ్డతోపాటు పలు ఇతర ప్రాజెక్టులకు సహకరించాలని మహారాష్ట్రకు చెందిన కేంద్ర మంత్రి హన్స్‌రాజ్ అహిర్‌కు మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. బుధవారం ఢిల్లీలో ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్, టీఆర్‌ఎస్ ఎంపీలతో కలసి హన్స్‌రాజ్ అహిర్‌తో హరీశ్‌రావు భేటీ అయ్యారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘సాగునీటి ప్రాజెక్టుల గురించి కాంగ్రెస్ విమర్శలు మాని తెలంగాణ అభివృద్ధికి సహకరిస్తే మంచిది. తెలంగాణ-మహారాష్ట్ర మధ్య నిర్మించే నీటి ప్రాజెక్టుల గురించి ఇప్పటికే మహారాష్ట్ర సీఎం, మంత్రులతో చర్చించాం. సముద్రంలో వృథాగా కలిసే నీరు రైతులకు ఉపయోగపడాలనే ఉద్దేశంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఉంది..’’ అని పేర్కొన్నారు.

>
మరిన్ని వార్తలు