ఆయకట్టు ఎకరా పెరగలేదు

15 Dec, 2023 04:37 IST|Sakshi

రీఇంజనీరింగ్‌తో ప్రాజెక్టుల వ్యయం మాత్రమే పెరిగింది 

నల్లగొండ, ఖమ్మం జిల్లాల ప్రాజెక్టులపై సమీక్షలో డిప్యూటీ సీఎం, మంత్రులు

సాక్షి, హైదరాబాద్‌: ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయడంలో గత ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని రాష్ట్ర మంత్రులు ఆరోపించారు. గత ప్రభుత్వ హయాంలో చేపట్టిన ప్రాజెక్టుల రీఇంజనీరింగ్‌ వల్ల ఎకరా ఆయకట్టు అదనంగా పెరగలేదని, కేవలం వ్యయం మాత్రమే పెరిగిందని విమర్శించారు.

రాష్ట్ర సచివాలయంలోని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క చాంబర్‌లో గురువారం ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం జిల్లాల సాగునీటి ప్రాజెక్టులపై ఇరిగేషన్‌ అధికారులతో భట్టి, నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి సమీక్ష నిర్వహించారు. మండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌ రెడ్డి, మంత్రులు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు, పొంగులేటి శ్రీనివాస్‌ రెడ్డి, దుద్దిళ్ల శ్రీధర్‌బాబు, పొన్నం ప్రభాకర్‌ పాల్గొన్నారు. 

సీతారామకు పర్యావరణ అనుమతులు రావాలి 
కాంగ్రెస్‌ ప్రభుత్వ హయాంలో రూ.2,400 కోట్లతో చేపట్టిన ఇందిరా, రాజీవ్‌సాగర్‌ ప్రాజెక్టుల అంచ నా వ్యయాన్ని రీ డిజైనింగ్‌ పేరిట రూ.13 వేల కో ట్లకు ఎందుకు పెంచాల్సి వచ్చిందని భట్టి విక్రమా ర్క అధికారులను ప్రశ్నించారు. అదనంగా ఆయక ట్టు పెరిగిందా? అని ప్రశ్నించగా, పెరగలేదని అధికారులు బదులిచ్చారు. గత ప్రభుత్వం తీసుకున్న  నిర్ణయం మేరకు ఇందిరా సాగర్‌ ప్రాజెక్టును రీ డిజైనింగ్‌ చేశామని చెప్పారు. సీతారామ ప్రాజెక్టు పనుల పురోగతిని పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ద్వారా వివరించారు. బ్యారేజీ నిర్మాణానికి ఇంకా పర్యావరణ అనుమతులు రావాల్సి ఉందని, రెండు నెలల్లో వచ్చే అవకాశం ఉందని తెలిపారు.  

ప్రాజెక్టులపై నివేదికలు ఇవ్వండి గత ప్రభుత్వం రూ.వేల కోట్లతో కొత్త ప్రాజెక్టులను ప్రారంభించడంతో ప్రజలపై భారం పడిందని మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి విమర్శించారు. ఆరు నెలల్లో పూర్తయ్యే ప్రాజెక్టులు, ఏడాదిలోగా పూర్తయ్యేవి, 18 నెలల్లోగా పూర్తయ్యేవి, 24 నెలల్లో పూర్తయ్యే ప్రాజెక్టులు గుర్తించి, వాటి కావాల్సిన బడ్జెట్‌ అంచనా వ్యయాన్ని రూపొందించి వెంటనే నివేదికలు ఇవ్వాలని ఆదేశించారు.

ఇరిగేషన్‌ శాఖలో ఎన్నికలకు ముందు పిలిచిన టెండర్లను వెంటనే నిలిపివేయాలని, వర్క్‌ అలాట్‌మెంట్‌ చేసిన వాటిని కూడా ఆపి వేయాలని ఆదేశించారు. గత ప్రభుత్వం రీడిజైనింగ్‌ చేసిన సీతారామ ప్రాజెక్టు విషయంలో వెనక్కి పోలేము, ముందుకు పోలేమన్నట్టుగా ఉందని ఉత్తమ్‌ అన్నారు. బ్యారేజీ హెడ్‌ వర్క్‌ నుంచి చివరి కెనాల్‌ వరకు ఫేజ్‌ల వారీగా జరిగిన పనుల గురించి మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి ఆరా తీశారు.  

అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలి 
గత ప్రభుత్వ హయాంలో నల్లగొండ జిల్లా రైతులకు సాగునీటిని అందించేందుకు కనీస ప్రయత్నం కూడా జరగలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి ఆరోపించారు. ఎస్‌ఎల్‌బీసీ సొరంగం పనులు, ఉదయ సముద్రం ప్రాజెక్టు ఎందుకు పూర్తి కాలేదని ఈఎన్‌సీ మురళీధర్‌ను ప్రశ్నించారు. డిండి బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్, సింగరాజుపల్లి రిజర్వాయర్, పాకాల బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్, గొట్టెముక్కుల రిజర్వాయర్, పిల్లాయిపల్లి కెనాల్, నెల్లికల్‌ లిఫ్ట్‌ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండిపోయాయని అన్నారు.

నల్లగొండ జిల్లా ప్రాజెక్టుల పూర్తికి కావాల్సిన అనుమతులు, నిధులు తీసుకొస్తానని, అధికారులు చిత్తశుద్ధితో పనిచేయాలని ఆదేశించారు. ఉమ్మడి నల్లగొండ జిల్లా సస్యశ్యామలం కావాలంటే గత ప్రభుత్వం మొదలుపెట్టిన ప్రాజెక్టుల పనులు ఆపకుండా త్వరగా పూర్తి చేయాలని గుత్తా సుఖేందర్‌ రెడ్డి సూచించారు.  

>
మరిన్ని వార్తలు