కరోనాతో 2 నెలల శిశువు మృతి

31 May, 2020 02:54 IST|Sakshi

తల్లిదండ్రులకు గాంధీ ఆస్పత్రిలో పరీక్షలు

సాక్షి, నాగర్‌‌కర్నూల్ : కరోనా చాపకింద నీరులా గ్రామీణ ప్రాంతాలకు విస్తరిస్తుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. తాజాగా శనివారం నాగర్‌కర్నూల్‌ జిల్లా ఉప్పునుంతలలోని బీసీకాలనీలో 58రోజుల చిన్నారి కరోనాతో మృతి చెందింది. దీంతో బాధిత కుటుంబం నివసిస్తున్న ఇంటిని అన్ని శాఖల అధికారులు పరిశీలించారు. ఈ కాలనీలోకి కొత్తవారు ప్రవేశించకుండా పోలీసులు దిగ్బంధం చేశారు. వివరాలిలా ఉన్నాయి..గత నెల 3న నాగర్‌కర్నూల్‌ ప్రభుత్వాస్పత్రిలో మగశిశువు జన్మించాడు. పది రోజులపాటు ఆస్పత్రిలో ఉన్న తల్లి తిరిగి బాబుతో పాటు ఉప్పునుంతలలోని పుట్టింటికి వచ్చింది. కాగా ఈనెల 27న బాబు అనారోగ్యానికి గురికావడంతో తల్లిదండ్రులు అచ్చంపేటలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తర్వాత అక్కడి వైద్యుల సూచన మేరకు హైదరాబాద్‌లోని నిలోఫర్‌ ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరీక్షలు చేసిన వైద్యులు బాబుకు కరోనా పాజిటివ్‌ ఉన్నట్టు నిర్ధారించారు. అనంతరం ముగ్గురినీ గాంధీ ఆస్పత్రికి రిఫర్‌ చేయగా అక్కడికి చేర్చేలోపే బాబు మృతి చెందాడు. తల్లిదండ్రుల రక్త నమూనాలు తీసుకోగా..ఫలితాలు ఆదివారం వచ్చే అవకాశం ఉందని జిల్లా ఇమ్యునైజేషన్‌ అధికారి సాయినాథ్‌రెడ్డి తెలిపారు. బాధిత కుటుంబ సభ్యులతో ప్రైమరీ కాంటాక్టు ఉన్న 28 మందిని హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించారు.

‘రాజధాని’ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణికుడికి పాజిటివ్‌
కరీమాబాద్‌: రాజధాని ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న ఓ వ్యక్తికి కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ కావడంతో వరంగల్‌ రైల్వేస్టేషన్‌లో దింపేశారు. స్టేషన్‌ మేనేజర్‌ శ్రీనివాస్‌ కథనం ప్రకారం.. చైన్నై నుంచి న్యూఢిల్లీ వెళ్తున్న రాజధాని ఎక్స్‌ప్రెస్‌ శనివారం మధ్యాహ్నం 3.45 గంటలకు వరంగల్‌ స్టేషన్‌కు చేరుకుంది. కోచ్‌–8లో చెన్నై నుంచి వరంగల్‌ వరకు రావాల్సిన యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగి (40) ఉన్నాడు. ఆయన చెన్నైలో రైలు ఎక్కే సమయంలో పరీక్షలు నిర్వహించారు. అయితే రైలు బయలుదేరాక అతనికి పాజిటివ్‌ ఉన్నట్లు రిపోర్టు వచ్చింది. అప్పటికే రైలు విజయవాడ చేరుకుందని తెలియడంతో వారు వరంగల్‌ స్టేషన్‌కు సమాచారం అందించారు. దీంతో అప్రమత్తమైన అధికారులు.. రైలు ఇక్కడికి చేరుకోగానే సదరు వ్యక్తికి పీపీఈ కిట్‌ వేయించి అంబులెన్స్‌లో హైదరాబాద్‌ గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఇక ఇదే బోగీలో మొత్తం 41 మంది ఉండగా ఏడుగురు వరంగల్‌ స్టేషన్‌లో దిగారు. వీరందరికీ వైద్య పరీక్షలు చేయించడంతో పాటు బోగీని శానిటైజేషన్‌ చేశాక 5.20 గంటలకు రైలును పంపించారు.

>
మరిన్ని వార్తలు