17 స్థానాలకు 320 దరఖాస్తులు!

15 Feb, 2019 06:12 IST|Sakshi

కాంగ్రెస్‌లో ‘లోక్‌సభ’ పోటీకి ముగిసిన దరఖాస్తుల గడువు

సాక్షి, హైదరాబాద్‌:  లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ తరఫున పోటీ చేసేందుకు  320 మంది ఆశావహులు దరఖా స్తు చేసుకున్నారు. రాష్ట్రంలోని 17 లోక్‌సభస్థానాలకు ఈ నెల 10 నుంచి ప్రారంభమైన దరఖాస్తుల స్వీకరణ గడువు గురువారం  ముగిసింది. రిజర్వుడ్‌ నియోజకవర్గాలైన నాగర్‌కర్నూల్, వరంగల్, పెద్దపల్లి, మహబూబాబాద్‌లలో భారీగా డిమాండ్‌ ఉందని తెలుస్తోంది. ఒక్కో నియోజకవర్గానికి 25కిపైగా దరఖా స్తులు వచ్చినట్టు సమాచారం. వీటిని ఈ నెల 17న జరిగే ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ భేటీలో పరిశీలించి ఆ తర్వాత స్క్రూటినీ కమిటీ షార్ట్‌లిస్టు చేయనుంది. ఈ నెల 20లోపు నియోజకవర్గానికి 1 లేదా 2, అనివార్యమైతే 3 పేర్లతో జాబితాను సిద్ధం చేసి అధిష్టానానికి పంపనున్నట్లు సమాచారం.

నేటి నుంచి సమీక్షలు..: లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంటరీ నియోజకవర్గ స్థాయి సమీక్షలను శుక్రవారం నుంచి మూడ్రోజులు నిర్వహిస్తోంది. గచ్చిబౌలిలోని హోటల్‌ ఎల్లాలో  తొలిరోజు ఆదిలాబాద్‌–పెద్దపల్లి, నిజామాబాద్‌–జహీరాబాద్, కరీంనగర్‌–వరంగల్, రెండోరోజు నాగర్‌కర్నూల్‌– మహబూబ్‌నగర్, ఖమ్మం– మహబూబాబాద్, నల్లగొండ–భువనగిరి నియోజకవర్గాల సమీక్షలు జరగనున్నాయి. అదేరోజు పీసీసీ సమన్వయ కమిటీ సమావేశం కూడా జరగనుంది.  మూడోరోజు చేవెళ్ల–మల్కాజ్‌గిరి, హైదరాబాద్‌–సికింద్రాబాద్, మెదక్‌ స్థానాల సమీక్షతోపాటు ప్రదేశ్‌ ఎన్నికల కమిటీ సమావేశం జరగనుంది. భేటీలకు నేతలు ఆర్సీ కుంతియా, ఉత్తమ్, భట్టి హాజరు కానున్నారు.

మరిన్ని వార్తలు