అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

4 May, 2015 00:42 IST|Sakshi
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి

అత్తింటి వేధింపులేనని పోలీసులకు తండ్రి ఫిర్యాదు
నల్గొండలో ఘటన జమ్మికుంటలో విషాదం..
మేడారంలో కట్నం వేధింపులతో మరో వివాహిత బలవన్మరణం

 
జమ్మికుంట రూరల్ : పట్టణంలోని చంద్రగిరి శ్రీనివాస్ - విజయ దంపతుల రెండో కూతురు హారిక(27) నల్గొండలోని అత్తవారింటిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి.. హారికను నల్గొండకు చెందిన దొంతుల కిషన్- అనసూయల కుమారుడు శ్రీకాంత్‌కు ఇచ్చి 2013 డిసెంబర్‌లో వివాహం జరిపించారు. ఆ సమయంలో రూ.6లక్షలు, 12 తులాల బంగారం, 15తులాల వెండి, ఇతర లాంఛనాలు అప్పగించారు. ఆర్నెల్ల క్రితం హారిక కూతురుకు జన్మనిచ్చింది.

అప్పట్నుంచి రూ.2లక్షల కట్నం తీసుకురావాలంటూ ఆమె అత్త అనసూయ, మామ కిషన్, బావ శ్రీనివాస్, తోడికోడలు వేధిస్తున్నారు. ఈవిషయాన్ని పలుమార్లు తన తండ్రి శ్రీనివాస్ దృష్టికి తీసుకెళ్లింది. దీంతో ఇటీవల నల్గొండలో పెద్ద మనుషుల సమక్షంలో పంచాయితీ నిర్వహించి హారికను అత్తవారింటికి పంపించారు.అప్పట్నుంచి మళ్లీ వేధింపులు మొదలయ్యూరుు.ఈ క్రమంలోనే హారిక అనుమానాస్పద స్థితిలో మృతి చెందిందని సమాచారం అందింది. దీంతో శ్రీనివాస్ వెంటనే నల్గొండకు చేరుకున్నాడు. కాగా అత్తవారింటివారే ఉరివేసి చంపారని చంద్రగిరి శ్రీనివాస్ అక్కడి పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

వివాహితను బలిగొన్న కట్నం వేధింపులు
 ధర్మారం : కట్నం వేధింపులు భరించలేక మండలంలోని మేడారం గ్రామానికి చెందిన పర్శ రజని(23) శనివారం రాత్రి పురుగుల మందుతాగి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై లక్ష్మీనారాయణ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. మేడారం గ్రామానికి చెందిన రజనిని ఏడాదిన్నర క్రితం పెద్దపల్లి మండలం కనగర్తి గ్రామానికి చెందిన పర్శ హరీష్‌కు ఇచ్చి వివాహం జరిపించారు. ఆ సమయంలో రూ.1.50లక్షల కట్నంతోపాటు ఇతర లాంఛనాలు ముట్టజెప్పారు.

వివాహమైన ఆర్నెల్లకే మరో రూ.లక్ష కట్నం కావాలని భర్త హరీష్‌తోపాటు అత్త లలిత, ఆడపడచు కంది కవిత కలిసి రజనిని వేధించడం ప్రారంభించారు. వేధింపులు తాళలేక శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి మేనత్త బొడ్డు అనిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై వివరించారు.

మరిన్ని వార్తలు