అందని ‘అభయం’

12 Nov, 2018 15:53 IST|Sakshi

11 నెలలుగా నిలిచిన అభయహస్తం పింఛన్లు

ఎదురుచూస్తున్న 8 వేల మంది లబ్ధిదారులు

నిరాదరణకు గురవుతున్న పథకం   

పాల్వంచరూరల్‌:  స్వయం సహాయక సంఘాల మహిళలు ఆర్థిక సాధికారత సాధించడమే లక్ష్యంగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్‌ రాజశేఖర రెడ్డి హయాంలోప్రవేశపెట్టిన అభయహస్తం పథకం ప్రస్తుతం నిరాదరణకు గురవుతోంది. 60 ఏళ్లు పైబడిన మహిళలకు ఈ పథకం ద్వారా అందించే పింఛన్లు గత 11 నెలలుగా నిలిచిపోయాయి. జిల్లాలో అభయహస్తం లబ్ధిదారులు 8 వేల మంది  ఉన్నట్లు అధికారులు ధ్రువీకరించారు. ఒక్కొక్కరికి రూ.500 చొప్పున జిల్లాలో నెలకు రూ.40 లక్షల పింఛన్లు చెల్లించాల్సి ఉంది. 2017 నవంబర్‌ వరకు తర్వాత ఇంతవరకు తమకు రూపాయి కూడా ఇవ్వలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
అభయహస్తంతో ఎంతో ప్రయోజనం.. 
అభయహస్తం పథకం మహిళలకు ఎంతో ప్రయోజనకరంగా ఉండేంది. స్వయం సహాయక సంఘాల్లోని నిరుపేద మహిళలకు నెలకు రూ.500 వస్తే కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉండేది. 18 నుంచి 59 సంవత్సరాల మహిళలు ఈ పథకంలో సభ్యులుగా చేరవచ్చు. వారు రోజుకు ఒక రూపాయి చొప్పున ఏడాదికి రూ.365 ప్రీమియం చెల్లిస్తే, ప్రభుత్వం ద్వారా మరో రూ. 365 జమ చేసి జనశ్రీ బీమా పథకంలో లబ్ధిదారులుగా చేరుస్తారు. ఆ తర్వాత 60 ఏళ్లు నిండిన మహిళలకు నెలకు రూ.500 పింఛన్‌ చెల్లిస్తారు.

అంతేకాక గ్రూపులోని మహిళలకు 9 నుంచి ఇంటర్‌ వరకు చదివే పిల్లలు ఉంటే ఏడాదికి రూ.1200 చొప్పున ఒక్కో కుటుంబంలో ఇద్దరికి ఉపకార వేతనాలు అందిస్తారు. సభ్యులు అకాల మరణం పొందితే కుటుంబసభ్యులకు బీమా కంపెనీ ద్వారా రూ.30 వేలు చెల్లిస్తారు. ప్రమాదంలో మరణిస్తే రూ.75 వేలు, అంగవైకల్యం కలిగితే రూ.37, 500 చొప్పున పరిహారం చెల్లిస్తారు. అయితే ఇటీవల ఈ పరిహారాన్ని రెండు లక్షలకు పెంచారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి తమకు రావాల్సిన అభయహస్తం పింఛన్‌ డబ్బును వెంటనే ఇప్పించాలని లబ్ధిదారులు కోరుతున్నారు.
  
11 నెలలుగా ఇబ్బంది పడుతున్నాం 

అభయహస్తం పింఛన్‌ గత 11 నెలలుగా రావడం లేదు. దీంతో ఇబ్బందులు పడుతున్నాం. ప్రభుత్వం ఇచ్చే రూ.500 అయినా నెలనెలా సక్రమంగా ఇవ్వాలి.లేకుంటే తమ జీవితం ఇబ్బందికరంగా మారుతుంది. అసరా పింఛన్‌లోనైనా చేర్చి ప్రతినెలా పింఛన్‌ ఇస్తే బాగుటుంది. 

నూనావత్‌ చాందిని, లబ్ధిదారురాలు


వెంటనే విడుదల చేయాలి 
ప్రభుత్వం ఇచ్చే పింఛన్‌ పైనే ఆధారపడి వృద్ధాప్యాన్ని గడుపుతున్నాం. గత 11 నెలలుగా పింఛన్లు ఇవ్వకపోవడంతో ఇల్లు గడవడం కష్టంగా మారింది. పింఛన్ల కోసం సంబంధిత అధికారులను అడిగినా పట్టించుకోవడం లేదు. నెలనెలా విధిగా పింఛన్‌ ఇవ్వాలి.  
– ధర్మసోతు మారు, లబ్ధిదారురాలు

నిధులు విడుదల కాగానే పంపిణీ చేస్తాం 
అభయహస్తం పించన్లు గత 11 నెలలుగా పెండింగ్‌లో ఉన్న మాట నిజమే. ఉన్నతాధికారులకు నివేదికలు పంపించాం. మంజూరు కాగానే లబ్ధిదారులకు పంపిణీ  చేస్తాం.
– ప్రదీప్, అభయహస్తం పింఛన్ల జిల్లా ఇన్‌చార్జి   

మరిన్ని వార్తలు