లేబర్‌ కోర్టు న్యాయాధికారిపై ఏసీబీ కేసు

18 Mar, 2018 01:16 IST|Sakshi

లేబర్‌ కోర్టు ప్రిసైడింగ్‌ అధికారిగా పనిచేస్తున్న మల్లంపేట గాంధీ

ఏసీజే అనుమతితో కేసు నమోదు.. సోదాలు చేపట్టిన ఏసీబీ ప్రత్యేక బృందాలు

హైదరాబాద్‌తోపాటు తూర్పు, పశ్చిమగోదావరిలలో ఏకకాలంలో తనిఖీలు

తొలిసారిగా న్యాయాధికారిపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు

సాక్షి, హైదరాబాద్‌ : న్యాయవ్యవస్థలో శనివారం సంచలనం చోటు చేసుకుంది. హైదరాబాద్‌లో లేబర్‌ కోర్టు ప్రిసైడింగ్‌ అధికారిగా పనిచేస్తున్న మల్లంపేట గాంధీపై అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) అధికారులు ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు చేశారు. ఓ న్యాయాధికారిపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదు కావడం న్యాయవ్యవస్థ చరిత్రలో ఇదే తొలి సారి కావడం గమనా ర్హం. సమీప బంధువు ఇచ్చి న ఫి ర్యాదు ఆధారంగా గాంధీపై కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు... హైదరాబాద్‌తోపాటు ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాల్లో మొత్తం ఏడు చోట్ల ఏకకాలంలో సోదాలు చేపట్టారు. నగదు, బంగారు, వెండి ఆభరణాలు, ఇళ్లు, స్థలాలకు సంబంధించిన పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. రూ.3.5 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించారు. శనివారం రాత్రి అనంతరం కూడా సో దాలు కొనసాగుతున్నాయి. 

సమీప బంధువు ఫిర్యాదుతో
గాంధీ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు ఆయన సమీప బంధువు ఒక రు ఇటీవల ఏసీబీ డీజీ పూర్ణ చంద్రరావుకు ఫిర్యాదు చేశారు. అన్ని వివరాలు, ఆధారాలు సమర్పించారు. దీనిపై ప్రాథమిక సమాచారం తెప్పించుకున్న ఏసీబీ అధికారులు.. గాంధీ ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టినట్లు నిర్ధారించుకున్నారు. ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు ఇటీవల హైకోర్టు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి (ఏసీజే) జస్టిస్‌ రమేశ్‌ రంగనాథన్‌ను కలసి.. తమకు అందిన ఫిర్యాదు, తాము సేకరించిన ఆధారాలను సమర్పించారు. పూర్తిస్థాయి ఆధారాలు ఉండటంతో గాంధీపై ఆదాయానికి మించి ఆస్తుల కేసు నమోదుకు ఏసీజే గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. దీంతో ఏసీబీ అధికారులు శనివారం గాంధీపై కేసు నమోదు చేసి... హైదరాబాద్‌తోపాటు ఏపీలోని తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లాలు, మరికొన్ని చోట్ల గాంధీ, ఆయన సమీప బంధువుల నివాసాల్లో ఏకకాలం లో సోదాలు చేపట్టారు. ఈ సందర్భంగా కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. సోదాలు శనివారం అర్ధరాత్రి వరకు కొనసాగుతూనే ఉన్నాయి.  

ఐదేళ్లకు పైగా ఒకే కోర్టులో.. 
మల్లంపేట గాంధీకి ఆంధ్రప్రదేశ్‌లోని అధికార పార్టీకి చెందిన ఓ ముఖ్య నేతతో సన్నిహిత సంబంధాలు ఉన్నట్లు న్యాయవర్గాల్లో ప్రచారం జరుగుతోంది. 2015లో హైదరాబాద్‌లోని నాగోల్‌లో జరిగిన గాంధీ కుమార్తె వివాహ వేడుకల్లో ఆ నేత చాలాసేపు గడిపారని కొందరు న్యాయాధికారులు ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు. అలాగే ఢిల్లీస్థాయిలో కీలక పదవిలో ఉన్న ఓ నేతకు సైతం గాంధీ అత్యంత సన్నిహితుడని చెబుతున్నారు. ఓ దశలో గాంధీ రంగారెడ్డి జిల్లా కోర్టులో ఏకంగా ఐదేళ్లకుపైగా కొనసాగారు. ఓ న్యాయాధికారి ఒకే కోర్టులో ఐదేళ్లకుపైగా కొనసాగడాన్ని అసాధారణ విషయంగా చెప్పుకోవచ్చు. 

దాడుల్లో ఏసీబీ గుర్తించిన ఆస్తులివీ..  
ఏసీబీ అధికారుల సోదాల్లో రూ.3.57 కోట్ల విలువైన ఆస్తులను గుర్తించినట్లు ఏసీబీ డీజీ పూర్ణచంద్రరావు పత్రికా ప్రకటనలో తెలిపారు. ఆ వివరాలివీ.. 

  • బంజారాహిల్స్‌లో రూ.10.52 లక్షల విలువైన ఫ్లాట్‌ 
  • డీడీ కాలనీలో రూ.33.51 లక్షల విలువైన ఫ్లాట్‌ 
  • వారాసిగూడలో రూ.35 లక్షల విలువైన ఇల్లు 
  • వారాసిగూడలోనే రూ.70 లక్షల విలువైన నూతన మూడు అంతస్తుల భవనం 
  • రూ.12.30 లక్షల విలువైన వెర్నా కారు 
  • రూ.17 లక్షల విలువైన కారోలా ఆల్టిస్‌ కారు 
  • రూ.3.5 లక్షల విలువైన ఆల్టో కారు 
  • రూ.60 వేల విలువైన హోండా యాక్టివా టూ వీలర్‌ 
  • ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా వెంకటాయపాలెంలో రూ.48.65 లక్షల విలువైన వ్యవసాయ భూమి 
  • ఏపీలోని పశ్చిమగోదావరి జిల్లా కరగపాడులో రూ.23 లక్షల విలువైన 8.73 ఎకరాల భూమి 
  • రూ.22 లక్షల విలువైన బంగారు ఆభరణాలు 
  • బ్యాంకు లాకర్‌లో రూ.30 లక్షల విలువైన 1.5 కేజీల బంగారం 
  • బ్యాంకు లాకర్‌లో రూ.2 లక్షల విలువగల 4 కేజీల వెండి అభరణాలు 
  • బ్యాంకు ఖాతాలో రూ.9 లక్షల నగదు నిల్వ.. ఇంట్లో రూ.89 వేల నగదు 
  • రూ.6 లక్షల విలువైన గృహోపకరణాలు 
  • రూ.33 లక్షల విలువగల చిట్టీల డబ్బు 
మరిన్ని వార్తలు