సుపరిపాలనకే ప్రాధాన్యం

1 Aug, 2014 03:47 IST|Sakshi
సుపరిపాలనకే ప్రాధాన్యం

 సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ‘ప్రభుత్వ సాధారణ కార్యకలాపాలలో ఉద్యోగులు నిర్లక్ష్యం వహిస్తే ఊరుకోను. అవినీతిని ఎట్టి పరిస్థితుల్లో సహించను. ప్రజలకు ప్రభుత్వం నుంచి అందే అన్ని కార్యక్రమాలను సజావుగా అందేలా చూస్తూ, జిల్లా ప్రజలకు సుపరిపాలనను అందించడమే నా తొలి ప్రాధాన్యత.’ అని జిల్లా కొత్త కలెక్టర్ డాక్టర్. కె.ఇలంబరితి స్పష్టం చేశారు. జిల్లా కలెక్టర్‌గా నియమితులైన తర్వాత గురువారం తొలిసారి ఖమ్మం వచ్చిన ఇలంబరితి స్థానిక ఆర్‌అండ్‌బీ అతిథిగృహంలో విలేకరులతో మాట్లాడారు. ప్రభుత్వ అధికారులు, సిబ్బంది సమయపాలన పాటించాలని, టైమ్‌కు కార్యాలయానికి రాకపోతే చర్యలుంటాయని హెచ్చరించారు.

ప్రజలకు సంబంధించిన సమస్యల పరిష్కారంలో ఎక్కడ నిర్లక్ష్యం వహించినా ఊరుకునేది లేదని, ఎప్పటికప్పుడు ఫైళ్ల కదలికలను పరిశీలించి అవసరమైతే చర్యలు తీసుకునేందుకు కూడా వెనుకాడబోనని చెప్పారు. ఆకస్మిక తనిఖీలు నిర్వహించి జిల్లా పాలనను గాడిలో పెడతానని ధీమా వ్యక్తం చేశారు. అవినీతిపరులు ఎం తటి వారైనా ఉపేక్షించేది లేదని హెచ్చరించా రు. జిల్లాలో పెద్ద సంఖ్యలో ఉన్న రైతుల సమస్యల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి పెడతానని, వైద్య, విద్య సౌకర్యాల కల్పనతో పాటు వచ్చే ఏడాది పుష్కరాల నిర్వహణను కూడా ప్రాధాన్యతలుగా తీసుకుంటానని వివ రిం చారు. జిల్లాపై అవగాహన ఏర్పరుచుకుని ముందుకెళతానని, అన్ని వర్గాల సమస్యల పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానని హామీ ఇచ్చారు.
 
ఉదయం 5:30కు ముహూర్తం..
జిల్లా కలెక్టర్‌గా ఇలంబర్తి శుక్రవారం ఉదయం 5:30 గంటలకు బాధ్యతలు తీసుకోనున్నారు. వాస్తవానికి గురువారమే బాధ్యతలు తీసుకునేందుకు ఆయన జిల్లాకు వచ్చినా ఆలస్యం కారణంగా బాధ్యతలు తీసుకోలేకపోయారని అధికారవర్గాలు చెప్పారు. మధ్యాహ్నమే జిల్లాకు వస్తారని భావించినా, కలెక్టర్ వచ్చేసరికి సాయంత్రం నాలుగు గంటలయింది. నేరుగా కలెక్టర్ క్యాంపు కార్యాలయానికి చేరుకున్న ఆయన ప్రస్తుత కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేశ్ స్వాగతం అందుకున్నారు.

అనంతరం ఆయనతో కొంతసేపు ముచ్చటించి ఆర్‌అండ్‌బీ అతిథిగృహానికి చేరుకున్నారు. అక్కడ జిల్లా జాయింట్‌కలెక్టర్ సురేంద్రమోహన్, ఖమ్మం ఆర్డీవో సంజీవరెడ్డితో ప్రత్యేకంగా సమావేశమై జిల్లాకు సంబంధించిన అంశాలపై చర్చించారు. జిల్లా ప్రముఖులు, ఉన్నతాధికారుల నుంచి అభినందనలు అందుకుని రాత్రికి అక్కడే బస చేశారు. ఉదయం కలెక్టర్‌గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన హైదరాబాద్ వెళతారు. ముఖ్యమంత్రి సమక్షంలో జరిగే ‘మన ఊరు - మన ప్రణాళిక’ సమావేశంలో జేసీ, ఇతర ఉన్నతాధికారులతో కలిసి పాల్గొంటారు.

మరిన్ని వార్తలు