భారీ జరిమానాలు విధించిన ‘రెరా’ 

23 Sep, 2023 04:36 IST|Sakshi

సాహితీ గ్రూప్‌నకు రూ.10.74 కోట్లు, మంత్రి డెవలపర్స్‌కు రూ.6.50 కోట్లు

సాక్షి, హైదరాబాద్‌: నిబంధనల ఉల్లంఘన..షోకాజ్‌ నోటీసులకు స్పందించకపోవడం.. హియరింగ్‌కు హాజరుకాకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించిన ‘రియల్‌’ సంస్థలపై ‘రెరా’ చర్యలు చేపట్టింది.

  •  సాహితీ గ్రూప్‌నకు చెందిన సాహితీ ఇన్‌ఫ్రాటెక్‌ వెంచర్స్‌ ఇండియా ప్రైవేట్‌ లిమిటెడ్‌ సంస్థ ‘రెరా’ రిజిస్ట్రేషన్‌ లేకుండా ‘సాహితీ సితార్‌ కమర్షియల్‌’ పేరుతో రంగారెడ్డిజిల్లా గచ్చిబౌలిలో కమర్షియల్, రెసిడెన్షియల్‌ ఫ్లాట్స్‌ కోసం కొనుగోలుదారులను ఆకర్షించేందుకు ప్రకటనలు ఇచ్చి విక్రయాలు చేపట్టగా, సాహితీతో పాటు కేశినేని డెవలపర్స్‌కు అపరాధ రుసుం విధించింది. ఇదే సంస్థ ‘సిసా ఆబోడ్‌‘ పేరుతో మేడ్చల్‌ మండలం గుండ్లపోచంపల్లిలో సరైన డాక్యుమెంట్లు సమర్పించకుండా రెరా’ రిజిస్ట్రేషన్‌కు  దరఖాస్తు చేసింది. డాక్యుమెంట్లు సమర్పించాలని పలుసార్లు మెయిల్స్‌ పంపినా స్పందించలేదు. ప్రకటనల ద్వారా మార్కెటింగ్‌ చేస్తున్న కారణంగా  ’రెరా’ నోటీసులు జారీ చేసింది. ఇదే సంస్థ సాహితీ సార్వానీ ఎలైట్‌ పేరుతో  సంగారెడ్డి జిల్లా అమీన్‌పూర్‌లో అపార్ట్‌మెంట్స్‌ నిర్మాణం చేపట్టి సరైన డాక్యుమెంట్లు లేకుండా రెరా రిజిస్ట్రేషన్‌కు దరఖాస్తు చేసింది. పైగా మార్కెటింగ్‌ కార్యకలాపాల ద్వారా ప్లాట్స్‌ విక్రయించింది.ఈ ప్రాజెక్టులన్నింటికి కలిపి రూ.10.74 కోట్లు 15  రోజుల్లోగా చెల్లించాలని ఆదేశించింది.  
  • మంత్రి డెవలపర్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ పేరుతో షేక్‌పేటలో ప్రాజెక్ట్‌ చేపట్టి ఫారం– ’బి’లో తప్పుడు సమాచారం పొందుపరిచి, వార్షిక, త్రైమాసిక నివేదిక సమర్పించలేదు. దీంతో ఈ సంస్థకు రూ.6.50 కోట్ల అపరాధ రుసుము విధించింది.  
  • సాయిసూర్య డెవలపర్స్‌ సంస్థ నేచర్‌కౌంటీ పేరుతో శేరిలింగంపల్లి మండల మనసానపల్లి గ్రామంలో రెరా రిజిస్ట్రేషన్‌ లేకుండా ప్లాట్ల అభివృద్ధి పేరుతో ప్రాజెక్టు చేపట్టింది. దీనిపై ఫిర్యాదు రాగా, షోకాజ్‌ నోటీసు జారీ చేసి రూ.25లక్షలు అపరాధ రుసుం విధించింది.
మరిన్ని వార్తలు