ప్రైవేటు స్కూళ్లలో ప్రవేశాలకు షెడ్యూల్‌ విడుదల

31 Dec, 2017 02:12 IST|Sakshi

జనవరి 2 నుంచి 2018–19 విద్యా సంవత్సరం అడ్మిషన్ల ప్రక్రియ

ప్రీ ప్రైమరీ, ఎల్‌కేజీ, ఫస్ట్‌క్లాస్‌ ప్రవేశాల షెడ్యూల్‌ ప్రకటించిన విద్యాశాఖ

స్టేట్, సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, కేంబ్రిడ్జి గుర్తింపు స్కూళ్లలో ఇదే పద్ధతి

జనవరి 12న ప్రవేశాల తుది జాబితా ప్రదర్శించాలన్న ప్రభుత్వం

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని ప్రైవేటు పాఠశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియకు తెరలేచింది. నర్సరీ, ప్రీ ప్రైమరీ, ఎల్‌కేజీ, ఫస్ట్‌క్లాస్‌లలో ప్రవేశాలకు విద్యాశాఖ షెడ్యూల్‌ ప్రకటించింది. 2018–19 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల ప్రక్రియ జనవరి 2 నుంచి 12వ తేదీ వరకు జరగనుంది. ఈ మేరకు విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్‌ ఆర్‌. ఆచార్య ఉత్తర్వులు జారీ చేశారు. రాష్ట్ర ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలతోపాటు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నిరభ్యంతర పత్రం పొందిన సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, ఐబీ, కేంబ్రిడ్జి గుర్తింపు పొందిన పాఠశాలల్లో ప్రభుత్వం నిర్దేశించిన ప్రవేశాలను నిబంధనలకు లోబడి నిర్వహించాలని విద్యాశాఖ స్పష్టం చేసింది.

ప్రీ ప్రైమరీ, ప్రైమరీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు ఇష్టానుసారంగా అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తున్న నేపథ్యంలో అన్ని పాఠశాలల్లో ప్రవేశాలు ఒకేసారి నిర్వహించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ షెడ్యూల్‌ ప్రకటించింది. ప్రవేశాలను పూర్తిగా ఆన్‌లైన్‌ పద్ధతిలో నిర్వహించాలని, ఆయా పాఠశాలల వెబ్‌సైట్లలో ఈ ప్రక్రియను పూర్తి చేయాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. వెబ్‌సైట్‌ సౌకర్యం లేని ప్రైవేటు స్కూళ్లు ఆఫ్‌లైన్‌లో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించొచ్చని సూచించింది. అడ్మిషన్ల విషయంలో ర్యాండమ్‌ సెలక్షన్‌ మెథడ్‌ను అనుసరించాలని ప్రభుత్వం సూచించింది. ఈ ప్రక్రియను విద్యార్థుల తల్లిదండ్రుల సమక్షంలో నిర్వహించాలని, నిర్ణీత తేదీలవారీగా ప్రక్రియను ముగించి ప్రవేశాలకు అర్హత సాధించిన విద్యార్థుల జాబితాను జనవరి 12న పాఠశాలలో ప్రదర్శించాలని పేర్కొంది. కాగా, ప్రభుత్వ స్కూళ్లలో సాధారణంగా ఏటా జూన్‌లో విద్యా సంవత్సరం ప్రారంభంలో బడిబాట పేరిట ప్రవేశాలు చేపడతారు.

మరిన్ని వార్తలు