బాలికను బడిలో ఉంచి తాళం వేసుకెళ్లిన సిబ్బంది.. బాచుపల్లి ప్రభుత్వ పాఠశాలలో ఘటన

17 Nov, 2023 08:25 IST|Sakshi
తరగతి గదిలో ఉన్న చిన్నారి వేదాంజలి
Medchal: The

సాక్షి, మేడ్చల్‌: రోజూ బడికి వెళ్లే ఆరేళ్ల కూతురు స్కూల్‌ అయిపోయిన తరువాత సాయంత్రమైనా ఇంటికి రాకపోతే..ఆ తల్లిదండ్రులకు ఎంత నరకం.. ఎక్కడికెళ్లిందో.. ఏమో..ఎవరెత్తుకెళ్లారోనన్న ఆందోళన..! వెంటనే తెలిసిన వారందరినీ అడుగుతారు.. వారు తెలియదని సమాధానం చెబితే నరకం..!ఆ సమయంలో ఏం చేయాలో అర్థం కాదు.. ఎక్కడని వెతకాలి..పోలీసులకు ఫిర్యాదు చేయాలి.. ఈ టెన్షన్‌లో ఉన్న అమ్మానాన్నలకు వారి కూతురు పాఠశాలలోనే ఉందని తెలిస్తే వారి ఆనందం వర్ణనాతీతం.. అయితే ఆ  బాలికను లోపలే ఉంచి తాళం వేసుకెళ్లారని చెబితే ఇంతకంటే దారుణం మరొకరటి ఉండదేమో.

మరి.. ఇలాంటి సంఘటనే బాచుపల్లిలో చోటుచేసుకుంది. పాఠశాల సిబ్బంది బాలికను పాఠశాలలోనే ఉంచి గమనించకుండా తాళం వేసి నిర్లక్ష్యంగా వెళ్లిపోయారు. బాచుపలిలోని ఓ అపార్ట్‌మెంట్‌లో వాచ్‌మెన్‌గా పనిచేస్తున్న సుబ్రహ్మణ్యం, ప్రభావతి దంపతులకు వేదాంజలి(6) అనే కుమార్తె ఉంది. ఆ చిన్నారి స్థానికంగా ఉన్న ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 1వ తరగతి చదువుతోంది.  

►రోజూ మాదిరిగానే గురువారం పాఠశాలకు వెళ్లిన చిన్నారి సాయంత్రం 4 గంటలకు స్కూల్‌ ముగిసిన తరువాత ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన తల్లిదండ్రులు పాఠశాలకు వచ్చి చూడగా తాళం వేసి ఉండటంతో చుట్టు పక్కల ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకపోయింది.  

►మరోమారు పాఠశాల వద్ద వెతుకుతుండగా తరగతి గది నుంచి చిన్నారి ఏడుపు వినిపించింది. దీంతో తమ కుమార్తె తరగతి గదిలో ఉందని గ్రహంచిన సుబ్రహ్మణ్యం, ప్రభావతిలు చుట్టు పక్కల వారి సహాయంతో పాఠశాల తరగతి గది తాళం పగులగొట్టి లోనికి వెళ్లి చూడగా చిన్నారి రోదిస్తూ కనిపించింది. దీంతో తమ కుమార్తెను అక్కున చేర్చుకుని ఇంటికి తీసుకువెళ్లారు.  

►పాఠశాల ఆయా తప్పిదం వల్లే తమ చిన్నారి తరగతి గదిలో ఉండి పోయిందని.. పాఠశాల ముగిసిన తరువాత తరగతి గదిలో చిన్నారులు బయటకు వెళ్లారో లేదో చూసుకోకుండా తాళం వేయడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
చదవండి: Tandur: ఓ పార్టీ  నుంచి అడ్వాన్స్‌ తీసుకుని.. మరో పార్టీలోకి జంప్‌

మరిన్ని వార్తలు