మేయో క్లినిక్‌తో ఏఐజీ ఒప్పందం

25 Oct, 2019 01:11 IST|Sakshi
ఒప్పంద పత్రాలతో నాగేశ్వర్‌రెడ్డి, డేవిడ్‌ హేస్‌

తక్కువ ధరలో అందుబాటులోకి అంతర్జాతీయ వైద్యం

దేశంలో తొలిసారి మేయోతో జట్టు: డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డి

సాక్షి, హైదరాబాద్‌: అంతర్జాతీయ స్థాయి వైద్యాన్ని అతి తక్కువ ధరల్లో భారతీయులకు అందుబాటులోకి తెచ్చేందుకు అమెరికాలోని మేయో క్లినిక్‌తో ఏసియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ గ్యాస్ట్రో ఎంట్రాలజీ(ఏఐజీ) ఒప్పందం కుదుర్చుకుంది. మేయో క్లినిక్‌ కేర్‌ నెట్‌వర్క్‌లో భాగమైన తొలి భారతీయ ఆస్పత్రి ఏఐజీనే అని సంస్థ చైర్మన్, మేనేజింగ్‌ డైరెక్టర్‌ డాక్టర్‌ డి.నాగేశ్వర్‌రెడ్డి తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ.. తాజా ఒప్పందంతో సంక్లిష్టమైన కేసులకు సంబంధించి రెండో అభిప్రాయం తీసుకోవడం మొదలుకొని.. పలు అంశాల్లో మేయో క్లినిక్‌ పరిశోధనల వివరాలు ఏఐజీకి అందుబాటులోకి వస్తాయని అన్నారు. అయితే దీని వల్ల రోగులపై అదనపు భారమేదీ పడకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని తెలిపారు.

సుమారు 155 ఏళ్లుగా వైద్య రంగంలో లాభాపేక్ష లేకుండా సేవలందిస్తున్న మేయో క్లినిక్‌లో 5 వేల మంది నిపుణులైన వైద్యులు ఉన్నారని చెప్పారు. దీంతోపాటు అంతర్జాతీయ స్థాయిలో 9 ఆస్పత్రులున్న మేయో నెట్‌వర్క్‌ అనుభవాలను కూడా ఉపయోగించుకుంటామని అన్నారు. వైద్యంతోపాటు పరిశోధన రంగంలోనూ ఇరు సంస్థలు కలసి పనిచేస్తాయని తెలిపారు. కాలేయ మూలకణ పరిశోధనల్లో ఏఐజీకి ఎంతో ప్రావీణ్యముంటే.. గుండె మూలకణాలపై మేయో క్లినిక్‌ ఎన్నో పరిశోధనలు చేపట్టిందన్నారు. ఈ ఒప్పందం ద్వారా ఇరు సంస్థలు ఈ సమాచారాన్ని ఇచ్చిపుచ్చుకునే పరిస్థితి కలగనుందని చెప్పారు.

ఆరోగ్యం, వ్యాధుల విషయం లో శరీరంలోని సూక్ష్మజీవావరణం కీలకపాత్ర పోషిస్తుందని తాజా పరిశోధనలు చెబుతున్న నేపథ్యం లో ఏఐజీ వీటిపై కూడా పరిశోధనలు చేపట్టిందని తెలిపారు. కాలేయ సంబంధిత సమస్యలు ఉన్న వారిలో కొందరికి మధుమేహం ఉంటూ.. ఇంకొందరికి లేకపోవడం వెనుక బ్యాక్టీరియా వైవిధ్యతలో ఉన్న తేడాలే కారణమని తాము గుర్తించామని చెప్పారు. మేయో క్లినిక్‌ కేర్‌ నెట్‌వర్క్‌ డైరెక్టర్, ప్రఖ్యాత కార్డియాలజిస్ట్‌ డాక్టర్‌ డేవిడ్‌ హేస్‌ మాట్లాడుతూ.. అందరికీ మెరుగైన వైద్యం అందించే ఏకైక లక్ష్యంతో ఈ నెట్‌వర్క్‌ పనిచేస్తుందని స్పష్టం చేశారు. మేయో క్లినిక్‌ పేరును మార్కెటింగ్‌కు వాడుకునే ఏ సంస్థకూ నెట్‌వర్క్‌లో భాగస్వామ్యం కల్పించబోమని తెలిపారు.

మూల కణాలపై పరిశోధనలు 
ఏఐజీ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి మాత్రమే కాకుండా.. అత్యున్నత ప్రమాణాలతో పరిశోధనలు చేసే సంస్థ కూడా అని నాగేశ్వర్‌రెడ్డి స్పష్టం చేశారు. గచ్చిబౌలిలోని ఆస్పత్రిలో మూలకణాలపై విస్తృత స్థాయిలో పరిశోధనలు జరుగుతున్నాయని చెప్పారు. ఎముక మజ్జ నుంచి సేకరించిన మూలకణాలను ఇతర అవయవాలకు సంబంధించిన కణాలుగా మార్చి ఎన్నో సత్ఫలితాలు సాధించామని వివరించారు. ఈ నేపథ్యంలో పేగుల్లోకి ఆరోగ్యకరమైన బ్యాక్టీరియాను జొప్పించేందుకు కొన్ని కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న ఆలోచనలో ఉన్నట్లు తెలిపారు.

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు
సినిమా