ఆలేరును పునర్నిర్మాణం చేస్తా : బూడిద భిక్షమయ్యగౌడ్‌  

30 Nov, 2018 10:10 IST|Sakshi
ఆలేరు ప్రజాకూటమి అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్‌  

సాగు, తాగునీరు ప్రధాన ఎజెండా 

గుండాల మండలాన్ని యాదాద్రి భువనగిరి జిల్లాలోకి తీసుకువస్తా

 ఆలేరును రెవెన్యూ డివిజన్‌ కేంద్రంగా మారుస్తా

 అన్ని వర్గాల అభ్యున్నతికి కృషి కూటమి పక్షాల సహకారంతో విజయం సాధిస్తా

‘సాక్షి’ఇంటర్వ్యూలో ఆలేరు ప్రజాకూటమి అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్‌  

సాక్షి, యాదాద్రి : ఆలేరు నియోజకవర్గం ధ్వంసమైంది. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటీ నెరవేరలేదు. ప్రజలు కోరుకున్న ఫలాలు అందలేదు. సాగు, తాగునీటికి ఇంకా ఇబ్బందులు పడుతున్నారు. ప్రచారానికి వెళ్లినప్పుడు సమస్యలపై ప్రజలనుంచి అనేక ఫిర్యాదులు అందుతున్నాయి.ఎమ్మెల్యేగా గెలిస్తే  సాగు, తాగునీటికి పెద్దపీట వేస్తాను. చేనేత కార్మికుల అభ్యున్నతికి కృషి చేయడంతోపాటు అన్ని వర్గాల సంక్షేమం, అభివృద్ధితో ఆలేరు పునర్నిర్మాణానికి కృషి చేస్తానంటున్నారు.. ఆలేరు ప్రజాకూటమి అభ్యర్థి బూడిద భిక్షమయ్యగౌడ్‌. ‘సాక్షి’కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆయన పలు విషయాలు వెల్లడించారు.  

సాక్షి: ఎన్నికల ప్రచారం ఎలా సాగుతోంది?
భిక్షమయ్యగౌడ్‌ :  ప్రజల నుంచి మంచి స్పందన లభిస్తుంది. రెండేళ్లుగా గడపగడపకూ కాంగ్రెస్‌ పేరుతో ప్రజల మధ్యనే ఉన్నా. గ్రామాల్లో ఎక్కడకు వెళ్లినా ప్రజాకూటమి అభ్యర్థిగా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. గెలిపిస్తామని హామీ ఇస్తున్నారు. కూటమి భాగస్వామ్య పక్షాల సహకారంతో ప్రచారం ఉధృతంగా సాగుతోంది. ప్రతిపక్షాల అంచనాలను మించి భారీ మెజార్టీతో విజయం సాధిస్తా. 
సాక్షి: నియోజకవర్గంలో ప్రధాన సమస్యలేమిటి?
భిక్షమయ్యగౌడ్‌:  సాగు, తాగునీరు ప్రధాన సమస్య. తపాస్‌పల్లి రిజర్వాయర్‌ నుంచి రాజాపేట, ఆలేరు మండలాలకు, నవాబ్‌పేట రిజర్వాయర్‌ నుంచి గుండాల మండలానికి, బునాదిగాని కాల్వ నుంచి ఆత్మకూరు మండలాలకు సాగునీరు రావడం లేదు. పూర్తి చేయడంలో పాలకులు విఫలమయ్యారు. ఒక్క పరిశ్రమను కూడా ఏర్పాటు కాలేదు. ఇంటింటికీ తాగునీరు ఇస్తామన్నారు.. కానీ ఇవ్వలేదు. ఇందిరమ్మ ఇళ్లు నిర్మించుకున్న వారు బిల్లుల కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఉపాధి లేక రైతులు, యువత వలసపోతున్నారు. 
సాక్షి: మీరు గెలిస్తే ఏమి చేస్తారు?
భిక్షమయ్యగౌడ్‌: ప్రధానంగా సాగు నీటి సాధన కోసం కృషి చేస్తాను. తపాస్‌పల్లి, నవాబ్‌పేట రిజర్వాయర్లు, బునాదిగాని కాల్వల ద్వారా రైతాంగానికి సాగు నీరందించడమే లక్ష్యం. పాడి రైతుల కోసం వెటర్నరీ యూనివర్సిటీ ఏర్పాటు చేయిస్తా. యాదగిరిగుట్ట పట్టణంతోపాటు పరిసర ప్రాంతాల అభివృద్ధికి పాటుపడుతా. ప్రతి మండలంలో జూనియర్‌ కళాశాల ఏర్పాటు చేయించేందుకు చర్యలు చేపడుతా. ఆలేరు నియోజకవర్గ కేంద్రాన్ని రెవెన్యూ డివిజన్‌గా ఏర్పాటు చేయిస్తా. జనగామ జిల్లాలో ఉన్న గుండాల మండలాన్ని యాదాద్రిభువనగిరి జిల్లాలోకి తీసుకువస్తా. చేనేత కార్మికులకు సిరిసిల్ల ప్యాకేజీ ఇప్పిస్తాం. ప్రతి 500 జనాభాకు ఒక వాటర్‌ప్లాంట్‌ ఏర్పాటు చేసి ఇంటింటికీ తాగునీరు అందిస్తాం.  

                                                                                                  మరిన్ని వార్తాలు...

>
మరిన్ని వార్తలు