ప్రభుత్వం అంటే రోడ్లు వేయడమే కాదు

4 Sep, 2018 02:08 IST|Sakshi

అన్ని కులాలను గౌరవించాలి: మంత్రి ఈటల  

హైదరాబాద్‌: ప్రభుత్వం అంటే కేవలం రోడ్లు వేసి ప్రజల కోరికలను తీర్చడం మాత్రమే కాదని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్‌ వ్యాఖ్యానించారు. ఓట్లు వేసి గెలిపించిన ప్రజల్లో అన్ని కులాలు, మతాల వారు ఉన్నారని, వారందర్నీ గౌరవించుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై ఉందని తెలిపారు. కులాలకు భవనాలు కట్టిస్తున్న విషయంపై రాజకీయ పార్టీలు చేస్తున్న వ్యాఖ్యలను ఆయన ఖండించారు. తమ ప్రభుత్వానికి కులాలపై అభిమానం ఉంది కాబట్టి వారి ఆత్మగౌరవాన్ని కాపాడుతున్నామని వివరిం చారు. సోమవారం బషీర్‌బాగ్‌లోని దేశోద్ధారక భవన్‌లో ‘తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ’ ఆధ్వర్యంలో ‘కోర్వి కృష్ణస్వామి ముదిరాజ్‌ 125వ జయంతి’ వేడుకలు ఘనంగా జరిగాయి.

ఈ వేడుకల్లో  పాల్గొన్న మంత్రి ఈటల మాట్లాడుతూ పోరాడి సాధించుకున్న తెలంగాణలో బతుకమ్మతో పాటు అన్ని పండుగలను అధికారికంగా నిర్వహించుకుంటూ రాష్ట్ర ప్రజలను గౌరవిస్తున్నా మని చెప్పారు. ఏళ్ల తరబడి కొన్ని కులాలకు చెందిన ప్రజలు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందు లను ఎదుర్కొంటున్నారన్నారు. వారందర్నీ గుర్తించి వారి గౌరవార్థం ఆత్మగౌరవ భవనాలను నిర్మించేందుకు ప్రభుత్వం ముందుకొచ్చిందని తెలిపారు. రాజ్యసభ సభ్యుడు బండా ప్రకాశ్‌ ముదిరాజ్‌ మాట్లాడుతూ కోర్వి కృష్ణస్వామి రాసిన పుస్తకాలను తెలుగులోకి తర్జుమా చేస్తే ఎందరో విద్యార్థులకు మేలు చేసినవారవుతారని ప్రభుత్వాన్ని కోరారు. ఈ కార్యక్రమానికి తెలంగాణ ముదిరాజ్‌ మహాసభ ప్రధాన కార్యదర్శి శంకర్‌ ముదిరాజ్‌ అధ్యక్షత వహించగా, నేతలు తుల ఉమ, బాబు, మహేశ్‌ ముదిరాజ్, వరలక్ష్మి, శ్రీదేవి, భారతి, రాములు, సాంబ తదితరులు పాల్గొన్నారు.  

మరిన్ని వార్తలు