‘ప్రత్యేక రాష్ట్రంలో 17 వేల అక్రిడేషన్లు’

18 Jul, 2018 19:08 IST|Sakshi
తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ(పాత చిత్రం)

సాక్షి, హైదరాబాద్‌ : ఉమ్మడి రాష్ట్రంలో 12 వేల అక్రిడేషన్లు ఉండేవని.. ప్రత్యేక రాష్ట్రం ఏర్పడ్డాక 17 వేల అక్రిడేషన్లు ఇచ్చామని తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మన్‌ అల్లం నారాయణ తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ.. నాలుగు అంతస్తుల్లో 15 కోట్లతో మీడియా అకాడమీ నిర్మిస్తున్నామన్నారు. పైసా కట్టకుండా జర్నలిస్టులకు హెల్త్‌కార్డులు ఇచ్చామని.. అక్రిడేషన్‌ లేని వాళ్లకు కూడా కమిటీ వేసి హెల్త్‌ కార్డులు అందేలా చేశామని పేర్కొన్నారు. జర్నలిస్టుల సంక్షేమం కోసం 100 కోట్ల రూపాయలు ప్రకటించిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌దేనని హర్షం వ్యక్తం చేశారు. అందులో 34 కోట్ల రూపాయలను మరణించిన జర్నలిస్టుల కుటుంబాలకు అందజేసినట్టు వెల్లడించారు. ఇప్పటి వరకు మరణించిన 150 మంది జర్నలిస్టుల కుటుంబాలకు లక్ష రూపాయల చొప్పున సహాయం చేస్తున్నామని తెలిపారు.

ప్రభుత్వం కేటాయించిన 100 కోట్ల నిధులను జర్నలిస్టుల సంక్షేమం కోసమే ఖర్చు చేస్తున్నామని స్పష్టం చేశారు. హెల్త్‌ కార్డులు చెల్లడం లేదని చెప్పాడాన్నిఆయన ఖండించారు. హెల్త్‌ కార్డులు తీసుకోకపోవడం ప్రభుత్వ బాధ్యత కాదన్నారు. అసత్యపు ప్రచారాలను నమ్మవద్దని సూచించారు. జర్నలిస్టుల ఇళ్ల స్థలాలపై ప్రభుత్వం ఆలోచనలో ఉందని.. ఆటంకాల కారణంగా ఆలస్యం జరుగుతోందని తెలిపారు. సీఎం జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు కేటాయిస్తారనే నమ్మకం ఉందన్నారు. జర్నలిస్టులకు పెన్షన్‌పై కూడా ఆలోచన చేస్తున్నామని పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు