ప్రచార బాటలో.. కళాకారులు

15 Nov, 2018 11:46 IST|Sakshi

     కూలీలు, కళాకారులకు అసెంబ్లీ ఎన్నికల వేళ పెరిగిన డిమాండ్‌

     రోజుకూ పురుషులకు రూ.300, మహిళలకు రూ.200

     కళాకారులకు రూ.500, మద్యం, భోజన సౌకర్యం కూడా..

     జన బలం చూయించుకోవడానికి నాయకుల పాట్లు

     ద్వితీయ శ్రేణి నేతలకు బాధ్యతలు 

శాసనసభ ఎన్నికల నేపథ్యంలో రోజువారి కూలీలు, కళాకారులకు భలే గిరాకీ దొరుకుతోంది. ఓటర్లను ఆకట్టుకోవడానికి ప్రాధాన్యమిస్తూ జన బలం చూయించుకోవడానికి రాజకీయ పార్టీల నాయకులు నానా తంటాలు పడుతున్నారు.జనసమీకరణకు ఎక్కువ పాధాన్యమిస్తుండటంతో కూలీలు, కళాకారులకు డిమాండ్‌ పెరిగింది. ఖర్చుకు వెనుకాడకుండా కూలీలను కార్యకర్తలుగా చూపుతున్నారు. ఎక్కడ ప్రచారంలో సంఖ్య తక్కువ కాకుండా చూసుకుంటూ భోజనంతో పాటు మద్యంసైతం అందిస్తున్నారని అంటున్నారు. ఖర్చుల పేరుతో డబ్బు కూడా పంచుతున్నారు.  

సాక్షి,సూర్యాపేట : ముందస్తు ఎన్నికల పుణ్యమా అని వివిధ  రాజకీయ పార్టీలు నిర్వహిస్తున్న ప్రచార కార్యక్రమాలు చాలా మందికి ఆర్థికంగా ఉపయోగపడుతున్నాయి. కూలీలకు శాసనసభ ఎన్నికలు పని కల్పిస్తున్నాయని చెప్పవచ్చు. జిల్లాలో అన్ని రాజకీయ పార్టీలు గ్రామాలు, పట్టణాల్లో తిరుగుతూ ప్రజల నుంచి ఓట్లు అభ్యర్థిస్తున్నారు. వివిధ ప్రాంతాల్లో ప్రచారం నిర్వహిస్తున్న సందర్భంలో తమను ఆశీర్వదించాలని ప్రజలను కోరుతున్నారు. ఈ క్రమంలోతమ వెంట ఎవరూ లేరన్న పేరు రాకుండా చూసుకుంటున్నారు. పార్టీ శ్రేణులు, అభిమానులతో పాటు కార్యకర్తలను పురమాయిస్తున్నారు. ముఖ్యంగా రోజువారి కూలీలను కార్యకర్తలుగా చూపుతూ వారిని ప్రచారంలో భాగస్వాములను చేస్తున్నారు. వీరిలో రోజుకూ పురుషులకు రూ. 300, మహిళలకు రూ. 200 చొప్పున చెల్లిస్తున్నారు. భోజన సౌకర్యం, రవాణా ఖర్చులుసైతం చెల్లిస్తున్నారు. దీంతో గ్రామాల్లో కూలీలు కనిపించడం లేదు. పంటలు చేతికందే సీజన్‌ కావడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. 
ద్వితీయశ్రేణి నేతలకు జన సమీకరణ బాధ్యతలు
ఎన్నికల ప్రచారానికి జనసమీకరణ బాధ్యతలను ద్వితీయ  శ్రేణి నాయకులకు అప్పగిస్తున్నారు. ఇందుకు గ్రామాల్లో జనంతో ఎక్కువగా మమేకమైన వారిని, నమ్మకమైన వ్యక్తులను ఎంచుకుంటున్నారు. వారే దగ్గరుండి ప్రచారం ముగిసే వరకు అన్నీ చూసుకునేలా చర్యలు చేపడుతున్నారు. ప్రచారంలో కార్యకర్తలు తక్కువగా ఉంటే వచ్చే ఇబ్బందులను గుర్తించి ద్వితీయశ్రేణి నాయకులు ముందస్తుగానే పెయిడ్‌ కార్యకర్తలను సిద్ధం చేసుకుంటున్నారు.
కళాకారులకు కూడా..
డప్పు, కోలాట, జానపద కళాకారులకు కూడా భలే గిరాకీ పెరిగింది. డిజేలు, మైకులు, ఆటోలకు కూడా అదే స్థాయిలో గిరాకీ ఉంటోంది. ప్రచారంలో ఆర్భాటం లేనిది ప్రజలు బయటకు రావడం లేదు. దీంతో డప్పు కళాకారులు పల్లెల నుంచి పట్నం బాట పట్టారు. ఇక కోలాట కాళాకారులైతే గ్రామానికి ఒక గ్రూప్‌ వెలిసింది. ప్రతి కళాకారుడికి వసతులు కల్పించి రూ. 500 ఇస్తుండటంలో తీరిక లేకుండా పని చేస్తున్నారు.  ప్రచారానికి ఆటోలో మైక్‌లు వాడుతుండటంతో వాటికి కూడా గిరాకీ పెరిగింది.   

మరిన్ని వార్తలు