హోర్డింగులపై నిషేధం

14 Jul, 2018 10:35 IST|Sakshi

ఆగస్టు 14 వరకు అమలు

సాక్షి, సిటీబ్యూరో: వర్షాకాలం సీజన్‌ను దృష్టిలో ఉంచుకొని జీహెచ్‌ఎంసీ పరిధిలో అన్ని రకాల హోర్డింగ్‌లు, యూనిపోల్స్, ఆర్చిలు, ఆబ్లిగేటరీ స్పాన్‌లు, యూనిస్ట్రక్చర్స్, కాంటిలివర్స్, ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జిలపై ప్రకటలను నిషేధిస్తున్నట్లు జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ జనార్దన్‌రెడ్డి పేర్కొన్నారు. ఈమేరకు శనివారం ఆదేశాలు జారీ చేశారు. ఇటీవలివర్షాలు, ఈదురుగాలులకు పలు ప్రాంతాల్లో హోర్డింగ్‌లు కూలడం, యూనిపోల్స్‌పై వినైల్‌ ఫ్లెక్సీ బ్యానర్లు చిరిగి చెల్లాచెదురుగా వేలాడటం వంటి ఘటనలు జరిగాయని పేర్కొన్నారు. వాటి వల్ల ట్రాఫిక్‌కు తీవ్ర అంతరాయం కలగడంతోపాటు రహదారులపై ప్రయాణించే వారు ప్రమాదాలకు గురయ్యే అవకాశం ఉందని ప్రభుత్వం ఆందోళన వ్యక్తం చేసిందని కమిషనర్‌ తెలిపారు. ప్రజల ప్రాణాలకు ప్రమాదకరంగా పరిణమించిన వీటినుంచి తగిన భద్రత కల్పించేందుకు, ప్రమాదాలు జరుగకుండా నిరోధించేందుకు శుక్రవారం నుంచే నిషేధం అమల్లోకి వచ్చిందని తెలిపారు. ఈ నిషేధం ఆగస్టు 14వ తేదీ వరకు అమల్లో ఉంటుందని పేర్కొన్నారు. హోర్డింగ్‌లు, యూనిపోల్స్, ఆర్చిలు, ఫుట్‌ఓవర్‌బ్రిడ్జిలు, ఆబ్లిగేటరీ స్పాన్‌లపై ప్రస్తుతం ఉన్న ఫ్లెక్సీ బ్యానర్లను వెంటనే తొలగించాల్సిందిగా జనార్దన్‌రెడ్డి అడ్వర్టయిజింగ్‌ ఏజెన్సీలను ఆదేశించారు.

మరిన్ని వార్తలు