మార్పు కోసమే బీసీ కమిషన్: ఈటల

27 Oct, 2016 16:59 IST|Sakshi
మార్పు కోసమే బీసీ కమిషన్: ఈటల

కొన్ని వర్గాలు అధర్మ పద్దతిలో అటుఇటు అయ్యాయి
బీఎస్ రాములు కమిషన్ వాటన్నిటినీ క్రమ పద్ధతిలోకి మార్చాలి
బీసీ కులాలపై పూర్తిస్థాయిలో అద్యయనం చేయాలి
అన్ని వర్గాల ప్రజల అభివద్ధే ప్రభుత్వ లక్ష్యం: మంత్రి ఈటల


హైదరాబాద్: వెనుకబడిన వర్గాల స్థితిగతులు మార్చేందుకే రాష్ట్ర ప్రభుత్వం బీసీ కమిషన్ ఏర్పాటు చేసిందని ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేందర్ పేర్కొన్నారు. బీసీ కమిషన్ చైర్మన్‌గా బీఎస్ రాములు, సభ్యులుగా వకుళాభరణం కృష్ణమోహన్‌రావు, ఈడిగ ఆంజనేయులుగౌడ్, గౌరీశకంర్ గురువారం రవీంద్రభారతిలో శాసనసభ స్పీకర్ మధుసూధనాచారి, మండలి చైర్మన్ స్వామిగౌడ్ ఆధ్వర్యంలో బాధ్యతలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి ఈటల మాట్లాడుతూ.. కొత్త రాష్ట్రంలో బీసీ కులాల పరిస్థితులను అధ్యయనం చేసి, అన్ని వర్గాలు అభివృద్ధి చెందేలా నివేదిక సమర్పించాలని కమిషన్ బృందానికి సూచించారు.

రాష్ట్రంలో బీసీల జనాభా అధికంగా ఉందని, కానీ ఇప్పటివరకు ఈ జనాభాపై స్పష్టమైన అంకెను తేల్చలేకపోవడం దురదృష్టకరమన్నారు. గత ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన కమిషన్‌లను మాజీ న్యాయమూర్తులచే ఏర్పాటు చేసినప్పటికీ.. అవి ఇచ్చిన నివేదికలతో ఇప్పటికీ బీసీల్లో మార్పులు రాలేదన్నారు. బీఎస్ రాములు కమిషన్ ద్వారా బీసీ కులాలకు న్యాయం జరగాలని, కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టాలని ఆకాంక్షించారు. మార్కెట్ కమిటీల్లో 33శాతం రిజర్వేషన్లు అమలు చేస్తున్నామని,  స్థానిక సంస్థలతో పాటు చట్టసభల్లోనూ రిజర్వేషన్లు అమలు చేసేలా అసెంబ్లీ తీర్మాణం చేసి కేంద్రానికి పంపినట్లు పేర్కొన్నారు. కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాల్సిందిగా ప్రధానిని కోరినట్లు తెలిపారు. యువతను స్వయం ఉపాధివైపు ప్రోత్సహించేందుకు ఏకంగా 80శాతం రాయితీలు ఇస్తున్నట్లు చెప్పారు.

కొత్తగా ఏర్పాటైన తెలంగాణలో టీఆర్‌ఎస్ ప్రభుత్వం సమస్యల్ని వీలైనంత త్వరగా అధిగమించేందుకు కృషి చేస్తుందన్నారు. ఎస్సీ, ఎస్టీలకే కాకుండా బీసీలకు కూడా కళ్యాణలక్ష్మి పథకాన్ని వర్తింపజేస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్రంలో కొత్తగా 119 బీసీ గురుకుల పాఠశాలలను వచ్చే ఏడాది నుంచి అందుబాటులోకి తెస్తామని, ఒక్కో పాఠశాలలో 6 వందలకు పైగా పిల్లలు చదువుకునేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. బీసీ కమిషన్లో ఇతర అణగారిన కులాలకు సైతం ప్రాతినిధ్యం కల్పించాలని ఎంపీ వివేక్ మంత్రులను కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ సోమారపు సత్యనారాయణ, సాంస్కృతిక మండలి చైర్మన్ రసమయి బాలకిషన్, ఎంపీ బాల్కసుమన్, ఎమ్మెల్సీ నారదాసు, ఎమ్మెల్యే మధు తదితరులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు