Telangana Election Results: రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ (85,576)తో గెలిచిన అభ్యర్థిగా రికార్డ్‌

4 Dec, 2023 10:38 IST|Sakshi

ఎమ్మెల్యేగా వివేకానంద్‌ ముచ్చటగా మూడోసారి ఎన్నికలో ‘హ్యాట్రిక్‌’ సాధించారు. గతంలో మేడ్చల్‌లో అంతర్భాగంగా ఉన్న కుత్బుల్లాపూర్‌ మున్సిపాలిటీ 2009లో నియోజకవర్గంగా ఏర్పడింది. ఈ క్రమంలో జరిగిన ఎన్నికల్లో స్వతంత్ర అభ్యరి్థగా కూన శ్రీశైలంగౌడ్‌ గెలుపొందారు. తర్వాత 2014, 2018, 2023 వరుసగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీ చేసిన వివేకానంద ఘన విజయం సాధిస్తూ వచ్చారు. గడచిన ఎన్నికల్లో 41,500 మెజార్టీ రాగా తాజాగా ఏకంగా 85,576 మెజారీ్టతో విజయం సాధించి చరిత్ర సృష్టించారు. రాష్ట్రంలోనే అత్యధికంగా భారీ మెజారీ్టతో గెలిచిన ఎమ్మెల్యేగా రికార్డు నెలకొల్పారు. కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గంలో అనూహ్యంగా కాంగ్రెస్, బీజేపీ బలమైన అభ్యర్థులు ఉన్నప్పటికీ బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా పోటీ చేసిన వివేకానంద్‌ తనదైన శైలిలో పాదయాత్రల ద్వారా, స్థానికంగా చేపట్టిన అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాల ద్వారా ప్రజలకు చేరువయ్యారు. ఈ క్రమంలో జరిగిన ఎన్నికల్లో ప్రజలు ఆయనకు ఘనవిజయం చేకూర్చి పెట్టారు.   

కుత్బుల్లాపూర్‌: ఎమ్మెల్యే వివేకానంద్‌ ఘనవిజయం సాధించడంతో బీఆర్‌ఎస్‌ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపింది.. గత నెల రోజులుగా విస్తృత ప్రచారంలో పాల్గొన్న నాయకులు, కార్యకర్తలు కలిసి సూరారం కట్ట మైసమ్మ ఆలయం వద్ద ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అక్కడి నుంచి ర్యాలీగా చింతల్‌ పార్టీ కార్యాలయానికి వచ్చి ఈ విజయం కుత్బుల్లాపూర్‌ ప్రజలకు అంకితం చేస్తున్నట్లు ఎమ్మెల్యే వివేకానంద ప్రకటించారు.  

హ్యాట్రిక్‌ ఇచి్చన ప్రజలకు రుణపడి ఉంటా..  
తనపై నమ్మకంతో హ్యాట్రిక్‌ విజయం చేకూర్చిన ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానని పేర్కొన్నారు. సుమారు రూ.6వేల కోట్ల నిధులతో కుత్బుల్లాపూర్‌ రూపురేఖలు మార్చానన్నారు. తద్వారా ప్రజల్లో ఉంటూ ముందుకు సాగానన్నారు. పాదయాత్ర ద్వారా ప్రజా సమస్యలు తెలుసుకుని అభివృద్ధి మౌలిక వసతులు కలి్పంచడం మూలంగానే నన్ను ఆదరించి గెలిపించారని తెలిపారు. ఈ ప్రాంత ప్రజలకు ఎప్పుడు రుణపడి ఉంటానన్నారు. రాష్ట్రంలోనే అత్యధిక మెజార్టీ ఇచి్చన తనకు మీ సహాయ సహకారాలు ఇలాగే ఉండాలని కోరారు. 

రికార్డు విజయంతో ఆనందోత్సవాలు.. 
కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం నుంచి హ్యాట్రిక్‌ ఎమ్మెల్యేగా ఎన్నికైన వివేకానంద్‌ రాష్ట్రంలోనే రికార్డు స్థాయిలో 85,576 మెజార్టీ ఓట్లు కార్యకర్తల్లో జోష్‌ పెంచింది. ఆది నుండి ఎమ్మెల్యేకు వెన్నంటి ఉండేవారి ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. ఒక టీమ్‌ స్పిరిట్‌తో ముందుకు సాగుతూ తనకంటూ ఓ వర్గాన్ని ఏర్పాటు చేసుకున్న ఎమ్మెల్యే వివేకానంద్‌కు రెండు సంవత్సరాలుగా పార్టీ కార్పొరేటర్లు దూరం ఉన్నప్పటికీ చివరికి మంత్రి కేటీఆర్‌ చొరవతో ఎట్టకేలకు ఎన్నికల్లో ఎమ్మెల్యేతో కలిసి ప్రచారం చేశారు. అంతకుముందే తనకంటూ ఒక వర్గాన్ని ద్వితీయ శ్రేణి నాయకులను ఎంపిక చేసుకొని డివిజన్ల వారీగా పక్క ప్రణాళిక రూపొందించుకొని ముందుకు సాగడంతో ఈ భారీ విజయం చేకూరిందని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. 

ఈ ఇద్దరూ హ్యాట్రిక్‌ వీరులే..
కుత్బుల్లాపూర్‌: ఆదివారం వెలువడిన తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఫలితాల్లో కుత్బుల్లాపూర్‌ నుంచి వివేకానంద్, కూకట్‌పల్లి నుంచి మాధవరం కృష్ణారావులు ముచ్చటగా మూడోసారి ఎమ్మెల్యేలుగా హ్యాట్రిక్‌ విజయం సాధించారు. దీంతో ఫలితం వెలువడిన వెంటనే ఇరువురు ఎమ్మెల్యేలు పార్టీ కార్యకర్తలు అభిమానులతో కలిసి గెలుపొందిన ఆనందాన్ని పంచుకున్నారు. ఇరువురు గతంలో టీడీపీ నుంచి గెలిచి అనంతరం బీఆర్‌ఎస్‌లో చేరారు. 

ఒకటి నుంచి 22వ రౌండ్‌ వరకు వివేకానంద్‌ ఆధిపత్యం 
కుత్బుల్లాపూర్‌: కుత్బుల్లాపూర్‌ నియోజకవర్గం అసెంబ్లీ ఎన్నికల్లో కేపీ వివేకానందగౌడ్‌ (బీఆర్‌ఎస్‌)కు 1,87, 999 ఓట్లు, కూన శ్రీశైలంగౌడ్‌(బీజేపీ)కు 1,02,423 ఓట్లు, కొలన్‌ హన్మంత్‌రెడ్డి (కాంగ్రెస్‌)కు 1,01,554 ఓట్లు రాగా 85,576 ఆదిక్యంతో బీఆర్‌ఎస్‌ అభ్యర్థి కేపీ వివేకానందగౌడ్‌ సమీప బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్‌పై ఘన విజయం సాధించారు. ఒకటో రౌండ్‌ నుంచి 22 రౌండ్‌ వరకు ఎక్కడా తగ్గకుండా ప్రతి రౌండ్‌లో ఆధిక్యత కనబరిచి వివేకానంద పట్టు నిలుపుకుని హ్యాట్రిక్‌ నమోదు చేసుకున్నారు. అయితే 20 రౌండు వరకు రెండో స్థానంలో కొనసాగిన కాంగ్రెస్‌ అభ్యర్థి హన్మంత్‌రెడ్డి చివరి రెండు రౌండ్లలో వెనక్కి తగ్గడంతో అనూహ్యంగా రెండో స్థానంలో బీజేపీ అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్‌ వచ్చారు. ఫలితం ప్రకటించే సమయానికి రెండో స్థానంతో సరిపెట్టుకున్నారు.  

>
మరిన్ని వార్తలు