రూ.లక్షలోపు అప్పుంటేనే ఓటు

3 Feb, 2020 11:11 IST|Sakshi

సహకార ఎన్నికల్లో అమల్లోకి వచ్చిన నిబంధన

పంట రుణం రూ.లక్ష ఉండొద్దు,

ఒకవేళ లక్ష దాటితే నామినేషన్ల నాటికి చెల్లిస్తేనే ఓటు హక్కు

సాక్షి, మోర్తాడ్‌(బాల్కొండ): సహకార ఎన్నికల్లో పోటీ చేయడానికి, ఓటు వేయడానికి కొత్త నిబంధనలను సహకార ఎన్నికల అథారిటీ అమల్లోకి తీసుకొచ్చింది. ప్రభుత్వం రూ.లక్షలోపు పంట రుణం మాఫీ చేస్తామని ప్రకటించిన నేపథ్యంలో సహకార సంఘాల్లోని సభ్యులు అంతకుమించి అప్పు తీసుకుంటే ఆ మొత్తం చెల్లించాల్సి ఉంటుంది. పంటరుణంలో అసలు, వడ్డీ కలిపి రూ.లక్షలోపు ఉన్న వారికే ఓటు హక్కును కలి్పంచనున్నారు. సహకార ఎన్నికల అథారిటీ ఈ కొత్త నిబంధనపై ఆయా జిల్లాల సహకార శాఖ అధికారులకు ఆదేశాలను జారీ చేసింది. దీంతో అన్ని సహకార సంఘాల్లో రూ.లక్షకు మించి పంట రుణం తీసుకున్న వారికి ఉద్యోగులు సమాచారం అందిస్తున్నారు.

ఉమ్మడి జిల్లాలో 144 సహకార సంఘాలు ఉండగా కొంత మంది పాత సభ్యులు తమకు ఉన్న ఎక్కువ భూమిని చూపి రూ.రెండు లక్షల వరకు పంట రుణం తీసుకున్నారు. రూ.లక్షకు మించి రుణం తీసుకున్నవారు, నామినేషన్ల ప్రక్రియ మొదలయ్యే నాటికి రూ.లక్ష కంటే ఎక్కువ ఉన్న సొమ్మును చెల్లించాలి. ఇప్పటికే బకాయిదారులు, రెగ్యులర్‌గా రుణం చెల్లించిన సభ్యుల వివరాలతో కూడిన జాబితాలను సహకార ఉద్యోగులు సిద్ధం చేశారు. ఇప్పుడు కొత్త నిబంధన అమలులోకి రావడంతో రూ.లక్షకు మించి పంట రుణం పొందిన సభ్యులను ఓటర్ల జాబితాల నుంచి వేరు చేసి వారికి సమాచారం అందిస్తున్నారు.

ఈ నెల 6న నుంచి నామినేషన్ల ప్రక్రియ మొదలు కానుండగా ఆలోపు రూ.లక్ష కంటే ఎక్కువ ఉన్న రుణం చెల్లిస్తేనే ఓటర్ల జాబితాల్లో పేర్లు చేర్చనున్నారు. గతంలో రుణ బకాయిలు ఉన్నవారికే ఓటు హక్కును తొలగించేవారు. ఇప్పుడు రుణ పరిమితి నిబంధనను అమలులోకి తీసుకురావడంతో ఓటు హక్కు కోల్పొయే వారి సంఖ్య పెరిగే అవకాశం ఉంది.

సమాచారం ఇస్తున్నాం 
రూ.లక్షకు మించి పంట రుణం పొందిన వారికి కొత్త నిబంధనపై సమాచారం అందిస్తున్నాం. రూ.లక్షలోపు అసలు, వడ్డీ ఉంటేనే ఓటు హక్కు కలి్పంచి పోటీకి అవకాశం ఇవ్వనున్నాం. సహకార ఎన్నికల అథారిటీ సూచించిన ప్రకారం సభ్యుల జాబితాలను సిద్ధం చేస్తున్నాం.  
– సింహాచలం, జిల్లా సహకార శాఖ అధికారి  

>
మరిన్ని వార్తలు