కరప్షన్‌ ఫ్రీ కామారెడ్డి

6 Dec, 2023 01:38 IST|Sakshi

ఇదే లక్ష్యంతో ముందుకు సాగుతున్నానంటున్న ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి 

కార్యకర్తల బలం, ప్రజల నమ్మకమే నన్ను గెలిపించాయి... ఏడాదిన్నరలో సొంత మేనిఫెస్టో అమలు చేస్తా 

ప్రధాని సహకారంతో 40 వేల ఇళ్లు నిర్మించి ఇస్తా 

‘‘ఎన్నికల్లో డబ్బు..మద్యం పంచకుండా గెలిచి చూపాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. కార్యకర్తలు అండగా నిలవడం, జనం నన్ను నమ్మి ఓటేయడంతో  నా లక్ష్యం నెరవేరింది. ఇక కామారెడ్డిలో పెరిగిన రాజకీయ అవినీతిని రూపుమాపి కరప్షన్‌ ఫ్రీ కామారెడ్డి అన్న పేరు తేవడానికి కృషి చేస్తా’’అని ఇద్దరు  రాజకీయ ఉద్ధండులను ఓడించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి  వెంకటరమణారెడ్డి(కేవీఆర్‌) అంటున్నారు. 

సాక్షి, కామారెడ్డి: ‘‘ఎన్నికల్లో డబ్బు..మద్యం పంచకుండా గెలిచి చూపాలని లక్ష్యంగా పెట్టుకున్నాను. కార్యకర్తలు అండగా నిలవడం, జనం నన్ను నమ్మి ఓటేయడంతో నా లక్ష్యం నెరవేరింది. ఇక కామారెడ్డిలో పెరిగిన రాజకీయ అవినీతిని రూపుమాపి కరప్షన్‌ ఫ్రీ కామారెడ్డి అన్న పేరు తేవడానికి కృషి చేస్తా’’అని ఇద్దరు రాజకీయ ఉద్ధండులను ఓడించిన కామారెడ్డి ఎమ్మెల్యే కాటిపల్లి వెంకటరమణారెడ్డి(కేవీఆర్‌) అంటున్నారు. ‘‘దేమె రాజిరెడ్డి కొడుకు తండ్రిలా నిజాయితీపరుడు అన్న పేరు రావాలి. నేను చనిపోయినప్పుడు లక్షలాది మంది ప్రజలు ఆఖరి చూపునకు రావాలి. అదే నా కోరిక’’అంటు న్న కేవీఆర్‌ను మంగళవారం ‘సాక్షి’పలకరించింది.  

జెయింట్‌ కిల్లర్‌ అవుతాననుకున్నారా ? 
కార్యకర్తల సమావేశంలో మాట్లాడుతున్నపుడు కామారెడ్డిలో సీఎం కేసీఆర్‌ పోటీ చేసినా, టీపీసీసీ ప్రెసిడెంట్‌ రేవంత్‌రెడ్డి పోటీ చేసినా ఇక్కడ బీజేపీ జెండా ఎగరాలని, అందుకు మనం కష్టపడా లని కార్యకర్తలతో మాటవరుసకు అన్న. దైవ నిర్ణయమో ఏమోగానీ, ఆ రోజు నా నోటి నుంచి వచ్చి నట్టే నామీద కేసీఆర్, రేవంత్‌రెడ్డి పోటీకి వచ్చారు. ఆ ఇద్దరితో తలపడి ఓడించే అవకాశాన్ని ప్రజలు నాకిచ్చారు. అందుకే రాష్ట్రం, దేశం మొత్తం కామా రెడ్డి ఎన్నికల ఫలితం కోసం ఎదురుచూసింది.  

ఆ ఇద్దరితో పోటీ అని తెలియగానే ఎలా ఫీల్‌ అయ్యారు ? 
దేశంలో ఎవరికీ రాని అవకాశం నాకు దక్కింది. సీఎం, కాబోయే సీఎంలిద్దరూ కామారెడ్డిలో నిలబడుతున్నారని తెలియడంతో ఇద్దరినీ ఓడిస్తానని, ఓడించకుంటే రాజకీయాల నుంచి తప్పుకుంటానని ప్రకటించిన. ఇద్దరితో పోటీపడడం అంటే మామూలు విషయం కాదు. వాళ్ల దగ్గర డబ్బు, అధికారం, బలం, బలగం అన్నీ ఉన్నాయి. నా దగ్గర ఆత్మస్థైర్యం ఉంది. నా కోసం దేనికైనా తెగించే కార్యకర్తల బలం ఉంది. అన్నింటికి మించి ప్రజల్లో నామీద నమ్మకం ఉంది. ఆ నమ్మకం, ఆ ధైర్యంతోనే వాళ్లను ఓడిస్తానని శపథం చేసిన. ఒకేసారి ఇద్దరు రాజకీయ ఉద్ధండులను కొట్టే అవకాశం రావడం అదృష్టంగానే భావిస్తున్నా.
 
ప్రజల నుంచి స్పందన ఎలా ఉంది? 
ఇక్కడి ప్రజలు తమ సొంత ఇంటి వ్యక్తిగా భావించి నన్ను గెలిపించారు. ఎన్ని ప్రలోభాలు పెట్టినా, ఎంత మందిని లొంగదీసుకున్నా, ప్రజలు మాత్రం నావైపు నిలిచారు. ఏ ఊరికి వెళ్లినా మహిళలు ఎంతో ఆదరించారు. వారికి రావాల్సిన వడ్డీ రాయితీ డబ్బుల కోసం చేసిన పోరాటం, భూముల కోసం చేసిన ఉద్యమాలతో నన్ను సొంత అన్నలా, తమ్ముడిలా భావించారు. పోయిన ప్రతిచోటా నువ్వే గెలుస్తావంటూ దీవించి పంపించారు.  

మీకు రాజకీయ ప్రేరణ ఎవరు? 
నా చిన్నతనంలో మా నాన్న రాజిరెడ్డి సమితి అధ్యక్షుడిగా పనిచేశారు. చదువుకునేరోజుల్లో, ఆ తర్వాత ఎక్కడకు వెళ్లినా ఆయన గురించి మాట్లాడుతుంటే ఆసక్తిగా వినేవాన్ని. దేమె రాజిరెడ్డి ఉద్యోగం ఇప్పించాడని చెబుతుండేవారు. వారితో మాట్లాడుతున్నపుడు తాను రాజిరెడ్డి కొడుకునని వారికి తెలియదు.

ఆ రాజిరెడ్డి కొడుకును నేనే అన్నప్పుడు వారు నాకు ఇచ్చిన మర్యాద ఇప్పటికీ కళ్లముందు కదలాడుతుంది. ఇంటికి వెళ్లిన తర్వాత అన్నీ నాన్నతో చర్చించేవాడిని. నీతి, నిజాయితీగా పనిచేసినపుడు ప్రజలు చిరకాలం గుర్తుంచుకుంటారని ఆయన చెప్పిన మాటలు నా మనసులో నిండిపోయాయి. మా నాన్నలాగా గొప్ప పేరు తెచ్చుకోవాలని ఆ రోజే అనుకున్నాను. 

హామీలు నెరవేర్చడానికి ఎంత సమయం తీసుకుంటారు? 
కామారెడ్డి నియోజకవర్గంలో ఇల్లు లేని వారందరికీ ఇల్లు కట్టించి ఇవ్వడమే నా ముందున్న అతి పెద్ద లక్ష్యం. ప్రధాని మోదీ సహకారంతో కేంద్రం నుంచి 40 వేల ఇళ్లు మంజూరు చేయించుకొని, వాటిని నిర్మించి ఇస్తా. సొంత మేనిఫెస్టోలో పేర్కొన్న కార్యక్రమాలన్నీ ఏడాదిన్నరలో పూర్తి చేయాలని అనుకుంటున్న. ముందుగా రైతులు ఎదుర్కొంటున్న కల్లాల సమస్యను పరిష్కరించేందుకు నెల, రెండు నెలల్లో కార్యాచరణ మొదలుపెడతా. ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తా.  

>
మరిన్ని వార్తలు