ఫిబ్రవరి 17–19 తేదీల్లో హైదరాబాద్‌లో బయో ఏసియా 2020

9 Jan, 2020 02:29 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌ కేంద్రంగా వచ్చే నెలలో జరిగే బయో ఏసియా 17వ సదస్సులో భాగంగా ‘స్టార్టప్‌ స్టేజ్‌’వేదికగా లైఫ్‌ సైన్సెస్, హెల్త్‌కేర్‌ రంగాల్లో నూతన ఆవిష్కరణలను ప్రోత్సహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. దీనిలో భాగంగా బయో ఏసియా వేదికపై 75 స్టార్టప్‌లకు తమ ఆవిష్కరణలు ప్రదర్శించే అవకాశం కల్పిస్తుంది. ఇప్పటివరకు 300 స్టార్టప్‌లు దరఖాస్తు చేసుకోగా, దరఖాస్తు గడువును ఈ నెల 12 వరకు పొడిగించాలని నిర్వాహకులు నిర్ణయించారు. లైఫ్‌ సైన్సెస్, హెల్త్‌కేర్‌ రంగాలకు సంబంధించి ఆసియాలోనే అతిపెద్ద వేదిక ‘బయో ఏసియా 2020’సదస్సు ఫిబ్రవరి 17 నుంచి 19 వరకు హైదరాబాద్‌ వేదికగా జరగనుంది.

ఈ రెండు రంగాల్లో ప్రపంచవ్యాప్తంగా ఉన్న దిగ్గజ కంపెనీలతో స్టార్టప్‌లు భేటీ అయ్యే అవకాశాన్ని ‘స్టార్టప్‌ స్టేజ్‌’కల్పిస్తుంది. ఫార్మా, బయోటెక్, లైఫ్‌ సైన్సెస్, హెల్త్‌ టెక్నాలజీ, మెడికల్‌ టెక్నాలజీ రంగాల్లో తమ ఆవిష్కరణలను ప్రదర్శించేందుకు స్టార్టప్‌ స్టేజ్‌ అవకాశం కల్పిస్తుంది. 75 స్టార్టప్‌లకు ఈ అవకాశం దక్కనుండగా, వీటి నుంచి ఎంపిక చేసిన ఐదు అత్యుత్తమ స్టార్టప్‌లకు పెట్టుబడుదారులతో భాగస్వామ్య ఒప్పందాలు కుదుర్చుకునే అవకాశంతో పాటు నగదు బహుమతి లభిస్తుంది. బయో ఏసియా సదస్సులో భాగంగా జరిగే చర్చల్లో పాల్గొనే అవకాశం కూడా ఎంపిక చేసిన స్టార్టప్‌లకు కల్పిస్తారు.

టెక్‌ మహీంద్ర భాగస్వామ్యంతో..
బయో ఏసియా సదస్సులో భాగంగా ‘స్టార్టప్‌ స్టేజ్‌’ను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, టెక్‌ మహీంద్ర సంయుక్త భాగస్వామ్యంలో నిర్వహిస్తుండగా.. టెక్‌ మహీంద్ర లీడ్‌ స్పాన్సర్‌గా వ్యవహరిస్తుందని పరిశ్రమలు, ఐటీ శాఖ ముఖ్య కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ వెల్లడించారు. ఐదేళ్లుగా వివిధ ప్రాంతాల్లో జరుగుతున్న బయో ఏసియా సదస్సుల్లో స్టార్టప్‌లు ప్రత్యేక ఆకర్షణగా నిలవడంతో పాటు, అనేక నూతన ఆవిష్కరణలతో ముందుకు వస్తున్నాయని పేర్కొన్నారు. హైదరాబాద్‌లో జరిగే 17వ బయో ఏసియా సదస్సులో తమ ఆవిష్కరణలు ప్రదర్శించేందుకు ఇప్పటికే 300 దరఖాస్తులు రాగా, ఈ నెల 12 వరకు దరఖాస్తు గడువు ఉందని బయో ఏసియా సీఈవో శక్తి నాగప్పన్‌ వెల్లడించారు.  

మరిన్ని వార్తలు