మొరాయిస్తున్న బయోమెట్రిక్‌

24 Sep, 2018 10:56 IST|Sakshi
నల్లబెల్లి హైస్కూల్‌లో ఇంటర్‌ నెట్‌ కనెక్షన్‌ లేదని చూపిస్తున్న బయోమెట్రిక్‌ యంత్రం

మొరాయిస్తున్న బయోమెట్రిక్‌ 

నల్లబెల్లి (వరంగల్‌):  ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరులో పారదర్శకత పెంచడంతోపాటు విద్యార్థులకు నేరుగా పథకాలు అందించేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్‌ను ప్రారంభించింది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ అధికారులు విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆయా పాఠశాలలకు బయోమెట్రిక్‌ యంత్రాలను పంపిణీ చేశారు. కానీ, ప్రభుత్వానికి ముందుచూపు లేకపోవడం, అధికారులు అప్‌డేట్‌ కాకపోవడం, నెట్‌వర్క్‌ సమస్య తలెత్తడంతో బయోమెట్రిక్‌ యంత్రాలు మొరాయిస్తున్నాయి. బయోమెట్రిక్‌ విధానం పక్కాగా అమలైతే తప్పనిసరిగా ప్రతిరోజు ఉపాధ్యాయులు, విద్యార్థుల హాజరు తెలుస్తుంది. దీంతో ప్రభుత్వ బడుల్లో కొంతైనా పరిస్థితి మెరుగుపడే అవకాశం ఉంది. విద్యార్థులకు ఆంగ్ల బోధనతోపాటు మధ్యాహ్న భోజనం, యూనిఫాం, పుస్తకాలు, హెల్త్‌ కిట్లను ఉచితంగా అందిస్తోంది. అయితే ఇవ్వన్ని విద్యార్థులకు చేరుతున్నాయా లేక దుర్వినియోగం అవుతున్నాయా అనే వివరాలు తెలుసుకునేందుకు ప్రభుత్వం బయోమెట్రిక్‌ విధానాన్ని ప్రవేశపెట్టింది.

ఇందులో భాగంగా గత నెలలో జిల్లా కేంద్రంలో ప్రభుత్వ పాఠశాలల ప్రధానోపాధ్యాయులకు యంత్రాల నిర్వహణపై రిసోర్స్‌ పర్సన్ల ద్వారా శిక్షణ ఇచ్చారు. శిక్షణ అనంతరం ప్రతి 100 మంది విద్యార్థులకు ఒక బయోమెట్రిక్‌ యంత్రం చొప్పున పాఠశాలలకు అందించారు. ఈ నెల 1వ తేదీ నుంచి అమలు చేయాలని ఆదేశించారు. ఇదిలా ఉండగా క్షేత్రస్థాయిలో నిర్వహణలో పలు సమస్యలు ఎదురవుతున్నాయి. నెట్‌వర్క్‌ సరిగా ఉండకపోవడం, యంత్రాలు వినియోగించడంలో అవగాహన లోపం వంటి కారణాలతోపాటు ఇటీవల బదిలీపై వెళ్లిన ఉపాధ్యాయుల వివరాలు తొలగిస్తూ కొత్తగా వచ్చిన ఉపాధ్యాయుల వివరాలు నమోదు చేయకపోవడం తదితర సమస్యలతో ప్రభుత్వం ఆశించిన లక్ష్యం నెరవేరకుండా పోతోందని తెలుస్తోంది. ఒకే పాఠశాలలో కొందరు ఉపాధ్యాయులు వేలిముద్ర వేస్తే, మరికొందరు ఉపాధ్యాయులు వేయలేని పరిస్థితి ఏర్పడింది. మండల కేంద్రాలకు దూరంగా ఉన్న పాఠశాలల్లో నెట్‌వర్క్‌ సమస్యతో ఇబ్బందులు తలెత్తడంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల హాజరు వేయలేని పరిస్థితి ఉందని పలువురు ప్రధానోపాధ్యాయులు పేర్కొంటున్నారు. ఇటీవల మండలానికి ఒకరు చొప్పున 15 మంది టెక్నీషియన్లను నియమించారు. కానీ, వారు విధుల్లో చేరకపోవడంతో బయోమెట్రిక్‌ యంత్రాలను మరమ్మతు చేసేవారు కరువయ్యారు.
 
సమస్యను అధిగమించేందుకు చర్యలు..
బయోమెట్రిక్‌ యంత్రంలో ఉపాధ్యాయులు, విద్యార్థుల సరైన వివరాలు నమోదు చేయాలి. యంత్రాల్లో తలెత్తే సాంకేతిక సమస్యలను ఎప్పటికప్పుడు పరిష్కరించేందుకు నిపుణుల సాయం అందేలా చూడాలి. తద్వారా ఉపాధ్యాయులు సమయపాలన పాటిస్తూ జవాబుదారీతనంగా వ్యవహరిస్తారు. మధ్యాహ్న భోజన నిర్వహణలో సత్ఫలితాలు సాధించవచ్చు.

జవాబుదారీతనం పెరుగుతుంది..
బయోమెట్రిక్‌ యంత్రాలు ఉపయోగించడంతో ప్రభుత్వ పాఠశాలలో విద్యబోధన మెరుగుపడుతుంది. ఉపాధ్యాయుల్లో జవాబుదారీతనం పెరుగుతుంది. మా పాఠశాలకు అధికారులు మూడు యంత్రలు ఇచ్చారు. పూర్తి స్థాయిలో ఉపాధ్యాయులు, విద్యార్థుల ఐడీలు ఇవ్వలేదు. త్వరలోనే ఇస్తామని అధికారులు చెప్పారు. ఇచ్చిన వెంటనే బయోమెట్రిక్‌ యంత్రాలను ఉపయోగిస్తాం.
 – రామస్వామి, హెచ్‌ఎం, జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాల, నల్లబెల్లి 

సిగ్నల్‌ సమస్యను అధిగమించేందుకు చర్యలు
జిల్లాలోని 699 ప్రభుత్వ పాఠశాలలకు 756 బయోమెట్రిక్‌ యంత్రాలను పంపిణీ చేశాం. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు బయోమెట్రిక్‌ విధానాన్ని పకడ్బందీగా అమలు చేసేందుకు కృషి చేస్తున్నాం. ఉపాధ్యాయులు పనిచేసే సమయంపై పారదర్శకతతో పాటు మధ్యాహ్న భోజన నిర్వహణలో సత్ఫలితాలు పొందేందుకు ప్రభుత్వ పాఠశాలకు వీటిని పంపిణీ చేశాం. బయోమెట్రిక్‌ యంత్రాల్లో సాంకేతిక సమస్యలు తలెత్తితే సరిచేసేందుకు ప్రభుత్వం విజన్‌టెక్‌ కంపెనీకి బాధ్యతలు అప్పగించింది. నెట్‌వర్క్‌ లేని పాఠశాలలను గుర్తించి సమస్యను అధిగమించేందుకు తగిన చర్యలు తీసుకుంటాం. – కె.నారాయణరెడ్డి, జిల్లా విద్యాశాఖాధికారి, వరంగల్‌ రూరల్‌

మరిన్ని వార్తలు