ఎంఐఎం పార్టీ ఉగ్రవాదులకు నీడనిస్తోంది: బీజేపీ

18 May, 2017 13:30 IST|Sakshi
ఎంఐఎం పార్టీ ఉగ్రవాదులకు నీడనిస్తోంది: బీజేపీ

హైదరాబాద్‌: తెలంగాణలో రాష్ట్ర పరిపాలనను తమ కుటుంబ పరిపాలనగా భావిస్తున్న పార్టీలకు ఇక భవిష్యత్తు ఉండదని బీజేపీ అధికార ప్రతినిధి కృష్ణ సాగర్ రావు పేర్కొన్నారు. గురువారం మీడియాతో మాట్లాడుతూ భారతీయ జనతాపార్టీ విస్తరణే ధ్యేయంగా పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌షా రాష్ట్రంలో మూడు రోజుల పాటు పర్యటిస్తారని చెప్పారు. అమిత్‌షా పర్యటనతో రాష్ట్రం‍లో రాజకీయ స్పష్టత రాబోతోందన్నారు. ప్రజా సమస్యలు పట్టించుకోకుండా సర్కార్‌ నిద్రపోతోందని, పాతబస్తీలో ఐఎస్‌ఐఎస్‌ ప్రచారం చేస్తుంటే తెలంగాణ పోలీసులు ధర్నా చౌక్‌లో ప్టకార్డులు పట్టుకుని ధర్నాలు చేస్తున్నారని విమర్శించారు.

టీఆర్‌ఎస్‌ ప్రభుత్వంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యమయ్యాయని, ప్రభుత్వం పోలీసులతో, అధికారులతో  డ్రామాలు వేయిస్తోందని ఘాటుగా విమర్శించారు. రైతుల విషయంలో ప్రభుత్వం అధ్వాన్నంగా వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ధాన్యానికి మద్దతు ధర ఉన్నా ప్రభుత్వం ఎందుకు కొనుగోలు చేయడంలేదని ప్రశ్నించారు. రాజకీయ ప్రయోజనాల కోసం సీఎం పాతబస్తీని ఎంఐఎంకు తాకట్టు పెట్టారని ఒవైసీ బ్రదర్స్‌కు , ఉగ్రవాదులకు నీడనిచ్చే పార్టీకి కేసీఆర్‌ మద్దతు ఇస్తున్నారని దుయ్యబట్టారు. భవిష్యత్తులో యోగిలాంటి నాయకులు రాష్ట్రానికి వస్తారని అన్నారు.

మరిన్ని వార్తలు