Sakshi News home page

Telangana Assembly Elections: మజ్లిస్‌ పార్టీలో ‘చార్మినార్‌ అసెంబ్లీ సీటు’ చిచ్చు

Published Thu, Oct 26 2023 8:37 AM

MIM Party Fight to Charminar Assembly seat - Sakshi

హైదరాబాద్: పాతబస్తీ రాజకీయాలను శాసిస్తున్న మజ్లిస్‌ పార్టీలో ‘చార్మినార్‌ అసెంబ్లీ సీటు’ చిచ్చు రాజేస్తోంది. మరోమారు పార్టీ అంతర్గత సంక్షోభం పునరావృతమయ్యే ప్రమాదం పొంచి ఉంది. పార్టీకి చెందిన ఇద్దరు సీనియర్‌ ఎమ్మెల్యేలను వయోభారం దృష్ట్యా ఈసారి ఎన్నికల బరి నుంచి తప్పించి కొత్తగా యువతకు అవకాశం కల్పించాలన్న  నిర్ణయం మజ్లిస్‌కు తలనొప్పిగా తయారైంది. అధిష్టానం ప్రతిపాదనల మేరకు ఇద్దరు సీనియర్‌ ఎమ్మెల్యేలు స్వచ్ఛందంగా ఎన్నికల్లో పోటీకి రిటైర్మెంట్‌ ప్రకటించేందుకు సంసిద్ధత వ్యక్తం చేస్తున్నప్పటికీ.. అందులో ఒకరు మాత్రం తన కుమారుడికి టికెట్‌ ఇవ్వాలన్న మెలిక పెట్టడం పార్టీని చిక్కుల్లో పడేసినట్లయింది.

అవకాశం ఇవ్వకున్నా.. ఎన్నికల బరిలో దిగడం ఖాయమన్న అల్టిమేటం తిరుగుబాటు సంకేతాన్ని సూచించడం పార్టీలో చర్చనీయాంశమైంది. మూడు దశాబ్దాల క్రితం మజ్లిస్‌ అధినేత సలావుద్దీన్‌ ఒవైసీతో ఏర్పడిన విభేదాలతో సీనియర్‌ ఎమ్మెల్యే అమానుల్లా ఖాన్‌ ఏకంగా పార్టీలో అంతర్గత ప్రజాస్వామ్యం లేదని ఆరోపిస్తూ బయటకు వచ్చి మజ్లిస్‌ బచావో తెహరిక్‌ను స్థాపించారు. పాతబస్తీలో ఏకపక్ష రాజకీయాలు చెల్లవని 1994లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో మజ్లిస్‌ను ఓడించి కేవలం చార్మినార్‌ అసెంబ్లీ సీటుకే పరిమితం చేసి ముచ్చెమటలు పట్టించారు. అప్పటి అమానుల్లాఖాన్‌ సహచరుడైన సీనియర్‌ ఎమ్మెల్యే  తాజాగా చార్మినార్‌కి అల్టిమేటం ఇవ్వడం ఆందోళన కలిగిస్తోంది. 

 సంప్రదింపుల్లో కాంగ్రెస్‌ .. 
మజ్లిస్‌ పార్టీని పాతబస్తీలో దెబ్బతీసేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్న కాంగ్రెస్‌..  ప్రతి అవకాశాన్ని అనుకూలంగా మల్చుకునేందుకు సిద్ధమవుతోంది. మజ్లిస్‌ తమను ప్రధాన శత్రువు పక్షంగా పరిగణించి వ్యతిరేక ప్రచారం చేయడం కాంగ్రెస్‌కు మింగుడు పడని అంశంగా తయారైంది. ఇప్పటికే చార్మినార్‌ నుంచి బలమైన ముస్లిం అఅభ్యర్థని రంగంలోని దింపేందుకు  అలీ మస్కతీ పేరును పరిశీలిస్తోంది. తాజాగా నెలకొన్న పరిస్థితులతో  కాంగ్రెస్‌ పార్టీ ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌తో సంప్రదింపుల కోసం ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రిని రంగంలోకి దింపినట్లు సమాచారం.

కాంగ్రెస్‌ పక్షాన చార్మినార్‌తో పాటు యాకుత్‌పురా అసెంబ్లీ స్థానాలు తండ్రీకొడుకులకు కేటాయిస్తామని హామీ ఇచ్చినట్లు సమాచారం. ఎన్నికల నోటిఫికేషన్‌ వరకు వేచి చూడాలనే యోచనలో ముంతాజ్‌ ఖాన్‌ ఉన్నట్లు తెలుస్తోంది. ఓటమెరుగని ముంతాజ్‌ ఖాన్‌కు చార్మినార్‌తో పాటు యాకుత్‌పురా అసెంబ్లీ సెగ్మెంట్లలో వ్యక్తిగతంగా గట్టి పట్టు ఉంది. దానిని అనుకూలంగా మల్చుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌పై ఫోకస్‌ పెట్టినట్లు తెలుస్తోంది.  

ఇదీ పరిస్థితి.. 
మారుతున్న రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా సిట్టింగ్‌ స్థానాల అభ్యర్థుల మార్పు, వయోభారం దృష్ట్యా సీనియర్‌ ఎమ్మెల్యేను పోటీ నుంచి తప్పించి కొత్తవారికి అవకాశం కల్పించాలన్న మజ్లిస్‌ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. ఈసారి ఎన్నికల్లో చార్మినార్‌ అసెంబ్లీ స్థానం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్, యాకుత్‌పురా స్థానం నుంచి సిట్టింగ్‌ ఎమ్మెల్యే అహ్మద్‌ పాషాఖాద్రీలకు బదులుగా కొత్తవారి అభ్యర్థిత్వాలను ఖరారు చేయాలని పార్టీ భావిస్తోంది. నాంపల్లి స్థానంలో రెండు పర్యాయాలుగా ప్రాతినిధ్యం వహిస్తున్న సిట్టింగ్‌ ఎమ్మెల్యే జాఫర్‌ హుస్సేన్‌ మేరాజ్‌ అభ్యర్థిత్వాన్ని ఈసారి యాకుత్‌పురా అసెంబ్లీ సెగ్మెంట్‌కు మార్చు చేసి, నాంపల్లి నుంచి మాజీ మేయర్‌ మాజీద్‌ హుస్సేన్‌ను బరిలో దింపాలని యోచిస్తోంది. చార్మినార్‌ అసెంబ్లీ స్థానం నుంచి పార్టీ ద్వితీయ అగ్రనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ కుమారుడు డాక్టర్‌ నూరుద్దీన్‌ లేదా  కూతురు  ఫాతిమాను రాజకీయ అరంగ్రేటం చేయించాలని మజ్లిస్‌ భావిస్తోంది. 

రంగంలోకి అక్బరుద్దీన్‌  
► అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ నిర్ణయం మేరకు సీనియర్‌ ఎమ్మెల్యేలతో చర్చించేందుకు పార్టీ ద్వితీయ అగ్రనేత అక్బరుద్దీన్‌ ఒవైసీ రంగంలోకి దిగారు. ఇటీవల సీనియర్‌ ఎమ్మెల్యేల ఇళ్లకు వెళ్లి పార్టీ ప్రతిపాదనలపై వారితో చర్చించారు. వయోభారం, ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా స్వచ్ఛందంగా ఎన్నికల బరి నుంచి తప్పుకునేందుకు యాకుత్‌పురా ఎమ్మెల్యే అహ్మద్‌ పాషాఖాద్రీ సంసిద్ధత వ్యక్తం చేసినట్లు తెలిసింది. చార్మినార్‌ ఎమ్మెల్యే ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌తో అక్బరుద్దీన్‌ ఓవైసీ సుదీర్ఘంగా మూడు గంటల పాటు చర్చలు జరిపినా ఫలప్రదం కానట్లు తెలుస్తోంది.  

వయోభారం దృష్ట్యా యువతకు అవకాశం కల్పించేందుకు ఎన్నికల బరి నుంచి తప్పుకోవాలని అక్బరుద్దీన్‌ సూచించగా, స్వచ్ఛందంగానే తప్పుకునేందుకు ముంతాజ్‌ ఖాన్‌ సంసిద్ధత వ్యక్తం చేస్తూనే గత ఎనిమిదేళ్లుగా రాజకీయాల్లో క్రియాశీలకంగా వ్యవహరిస్తున్న తన కుమారుడు డాక్టర్‌ ఇంతియాజ్‌ అహ్మద్‌ ఖాన్‌కు అవకాశం కల్పించాలని విజ్ఙప్తి చేశారు. మూడు దశాబ్దాల క్రితం ఎంబీటీ నుంచి ఎంఐఎంలోకి తిరిగి వచ్చేందుకు ‘జీవితకాలం సీటు ఖాయం’ అన్న అప్పటి పార్టీ అధినేత సలావుద్దీన్‌ ఒవైసీ ఇచ్చిన నోటి మాట కూడా ఈ సందర్భంగా ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌.. అక్బరుద్దీన్‌ ఒవైసీకి గుర్తు చేసినట్లు సమాచారం. ఒకవేళ కుమారుడికి సీటు ఇవ్వకుంటే చార్మినార్, యాకుత్‌పురాల నుంచి ఎన్నికల బరిలో ఉండటం ఖాయమని ముంతాజ్‌ అహ్మద్‌ ఖాన్‌ అల్టిమేటం ఇవ్వడం పార్టీలో చర్చనీయాంశంగా తయారైంది.  

Advertisement

What’s your opinion

Advertisement