సీఎం కేసీఆర్‌కు బీజేపీ భయం పట్టుకుంది

12 Jul, 2020 19:31 IST|Sakshi

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలు కరోనాకు భయపడితే, ముఖ్యమంత్రి కేసీఆర్‌కు బీజేపీ భయం పట్టుకుందని ఆ పార్టీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్‌ విమర్శించారు. బీజేపీ కార్యాలయంపై టీఆర్‌ఎస్‌ నేతల దాడిని ఆయన ఖండించారు. బీజేపీ నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టినా బీజేపీ ఎప్పుడు రాజ్యాంగాన్ని అతిక్రమించలేదన్నారు. కేసీఆర్‌,కవితపై ఎన్ని కేసులున్నాయో ప్రజలందరికీ తెలుసునన్నారు. సిద్ధాంతం కలిగిన పార్టీ బీజేపీ అని, టీఆర్‌ఎస్‌కు ఎలాంటి సిద్ధాంతాలు లేవని ధ్వజమెత్తారు. బీజేపీపై దాడులకు పాల్పడితే సరైన సమాధాన చెబుతాం. ఆ పరిస్థితి తెచ్చుకోవద్దని ఆయన హెచ్చరించారు. దాడులతో ప్రతిపక్షాలను కట్టడి చేద్దామని ప్రయత్నించడం మూర్ఖత్వం అన్నారు.

‘‘ప్రజాస్వామ్యబద్ధంగా శాంతియుతంగా రాష్ట్రం ఉండాలని బీజేపీ కోరుకుంటుంది. పక్కా ముందస్తు ప్లాన్ ప్రకారమే దాడికి పాల్పడ్డారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాల్సిన బాధ్యత పోలీసులపై ఉంది. కేంద్రంలో బీజేపీ అధికారంలో ఉందనే విషయం టీఆర్‌ఎస్‌ మరిచిపోవద్దు. కేసీఆర్ అనుమతి ఇస్తే ఆయన్ని కలుస్తాం. టీఆర్‌ఎస్‌ నేతల దాడిపై కేంద్ర మంత్రులకు ఫిర్యాదు చేస్తాం. టీఆర్‌ఎస్‌ నేతలు అవినీతికి పాల్పడలేదని నిరూపించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందని’’ బండి సంజయ్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్ర అభివృద్ధి కోసం కేంద్ర ప్రభుత్వ వాటా లేని పథకాలు ఎన్నో చెప్పాలని ఆయన డిమాండ్‌ చేశారు. కరోనా దృష్టిని ప్రజల నుంచి మళ్లించడానికి సెక్రటేరియట్ కూల్చుతున్నారని బండి సంజయ్‌ విమర్శలు గుప్పించారు.


 

మరిన్ని వార్తలు