కాంగ్రెస్‌కు ఓటేస్తే వచ్చేది బీఆర్‌ఎస్‌ జిరాక్స్‌ సర్కారే : ప్రధాని మోదీ

25 Nov, 2023 17:17 IST|Sakshi

సాక్షి,తుక్కుగూడ : కాంగ్రెస్ గెలిస్తే  బీఆర్‌ఎస్‌కు కార్బన్ పేపర్ లాంటి సర్కారే వస్తుందని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ ఎద్దేవా చేశారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా మహేశ్వరం నియోజకవర్గం తుక్కుగూడలో నిర్వహించిన  ప్రచార సభలో మోదీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ‘కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ డ్రామాలు చేస్తున్నాయి. కేసీఆర్ రాజకీయ ప్రస్థానం కాంగ్రెస్ నుంచే ప్రారంభమయింది. బీఆర్‌ఎస్‌ గతంలో కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుంది’ అని మోదీ గుర్తు చేశారు. 

‘హుజరాబాద్, దుబ్బాక, జీహెచ్‌ఎంసీలో బీజేపీ గెలిచింది. బీజేపీ అంటే కేసీఆర్‌కు భయం. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ నాణేనికి బొమ్మ బొరుసు లాంటివి గతంలో కాంగ్రెస్ పార్టీకి ఓటు వేస్తే ఇక్కడ ఎమ్మెల్యే బీఆర్‌ఎస్‌ పార్టీలోకి వెళ్ళింది. తెలంగాణ అభివృద్ధి మోదీ సంకల్పం. మీకు నేను గ్యారంటీ ఇస్తున్నా. కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ పార్టీలు సమాజ విరోధి పార్టీలు. కాంగ్రెస్ పార్టీ సీతారాం కేసరి లాంటి బీసీ నేతను అవమానించింది. బీజేపీ అధికారంలోకి వస్తే బీసీని సీఎం చేస్తాం. ఎస్సీ వర్గీకరణపై అధికారులతో నిన్న భేటీ అయ్యాను. ఎస్సీ వర్గీకరణకు రోడ్ మ్యాప్ తయారు చేయాల్సిందిగా అధికారులకు సూచించాను. పెట్రోల్, డీజిల్ పై తెలంగాణ ప్రభుత్వం వ్యాట్ తగ్గించలేదు’ అని మోదీ విమర్శించారు. 

కాంగ్రెస్‌కు కేసీఆర్‌ ప్రాణ మిత్రుడు

‘కాంగ్రెస్‌కు కేసీఆర్‌ ప్రాణ మిత్రుడు. దళితుడిని సీఎం చేస్తానని కేసీఆర్‌ మోసం చేశారు. ఎస్సీ వర్గీకరణకు బీజేపీ మద్దతుగా నిలిచింది. మాదిగ సమాజానికి బీఆర్‌ఎస్ తీవ్ర అన్యాయం చేసింది. బీజేపీ గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసింది. కేసీఆర్‌ ప్రభుత్వం ఉద్యోగులకు కనీసం జీతాలు కూడా టైముకు ఇవ్వడం లేదు. బీఆర్‌ఎస్‌ తెలంగాణను అవినీతిలో నెంబర్‌ వన్‌ చేసింది. అభివృద్ధి అంటే బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌లకు గిట్టదు. బీజేపీతోనే తెలంగాణకు ఉజ్వల భవిష్యత్తు’ అని మోదీ తెలిపారు.

ఇదీచదవండి..‘వందమంది కేసీఆర్‌లు వచ్చినా మధిర గేటును కూడా తాకలేరు’

మరిన్ని వార్తలు