స్వగ్రామానికి చేరిన చిన్నారుల మృతదేహాలు

19 Jan, 2019 02:48 IST|Sakshi
కొండమల్లేపల్లికి చేరుకున్న పిల్లల మృతదేహాలను తీసుకెళ్తున్న అంబులెన్స్‌లు

25 రోజుల తర్వాత అమెరికానుంచి స్వస్థలానికి 

నేడు నల్లగొండ జిల్లా గుర్రపుతండాలో అంత్యక్రియలు

చందంపేట/హైదరాబాద్‌: అమెరికాలో గత ఏడాది డిసెంబర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో మృతిచెందిన నల్లగొండ జిల్లాకు చెందిన చిన్నారుల మృతదేహాలు శుక్రవారం వారి స్వగ్రామానికి చేరుకున్నాయి. జిల్లాలోని నేరెడుగొమ్ము మండలం గుర్రపుతండాకు చెందిన పాస్టర్‌ శ్రీనివాస్‌నాయక్, సుజాత దంపతుల పిల్లలు సాత్విక (18) సుహాస్‌నాయక్‌ (16) జైసుచిత (14) గత డిసెంబర్‌ 24న అమెరికాలోని టెన్నెసీ రాష్ట్రం కొలిరివిల్లే ప్రాంతంలో క్రిస్మస్‌ వేడుకల్లో జరిగిన అగ్ని ప్రమాదంలో చనిపోయిన విషయం తెలిసిందే. ముగ్గురు పిల్లల మృతదేహాలను స్వగ్రామానికి తీసుకురావాలని కుటుంబ సభ్యులు, గ్రామస్తులు రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడంతో శుక్రవారం ఉదయం హైదరాబాద్‌కు తీసుకువచ్చారు. అనంతరం ముగ్గురి మృతదేహాలను మూడు ప్రత్యేక అంబులెన్స్‌లలో స్వగ్రామమైన గుర్రపుతండాకు తరలించారు. పాస్టర్‌ శ్రీనివాస్‌నాయక్, సుజాత దంపతుల స్నేహితులు, వివిధ చర్చిల పాస్టర్లు, బంధువులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. శనివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నారు.  
చర్చిలో ప్రార్థనలు 
శుక్రవారం ఉదయం శంషాబాద్‌ విమానాశ్రయానికి తీసుకువచ్చిన పిల్లల మృతదేహాలను తొలుత హైదరాబాద్‌ నారాయణగూడలోని బాప్టిస్ట్‌ చర్చికి తరలించారు. నాలుగు గంటలపాటు అక్కడ ప్రత్యేక ప్రార్థనలు చేశారు. తల్లిదండ్రులు, బంధుమిత్రుల కన్నీటి నివాళి అనంతరం మృతదేహాలను స్వస్థలమైన నల్లగొండ జిల్లా గుర్రపుతండాకు అంబులెన్స్‌లలో తరలించారు.  

చలిమంటలతో ప్రమాదం.. 
స్కాలర్‌షిప్‌ కింద ఉచితంగా చదివిస్తామంటూ అమెరికాలోని ‘బైబిల్‌ మిషనరీ’సంస్థ ముందుకు రావడంతో శ్రీనివాస్‌నాయక్‌ తమ ముగ్గురు పిల్లల్ని అమెరికాలోని ‘ఫ్రెంచ్‌ కామ్‌’నగరానికి పంపారు. క్రిస్మస్‌ ముందురోజు ప్రీ క్రిస్మస్‌ వేడుకలను స్నేహితుల ఇంట ఘనంగా జరుపుకున్నారు. తీవ్రమైన చలికారణంగా డిసెంబర్‌ 24న రాత్రి కట్టెలతో చలిమంట వేసుకున్నారు. అర్ధరాత్రి నిద్రలో ఉన్న సమయంలో మంటలు పెద్దవై అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఈ దుర్ఘటనలో ముగ్గురు పిల్లలు ప్రాణాలు కోల్పోయారు. 

ఎంబామింగ్‌ ఆలస్యం కావడం వల్లే.. 
‘విషయం తెలుసుకున్న మరుసటి రోజు మేం అక్కడకు చేరుకున్నాం. మృతదేహాలను ఇండియాకు తీసుకురావడం కష్టమని, ఈ నెల 12న అక్కడే అంత్యక్రియలు చేయాలని నిశ్చయించుకున్నాం. అదే సమయంలో ‘కొలియర్‌ విల్‌ బైబిల్‌ మిషన్‌’వాళ్లు మృతదేహాలకు ఎంబామింగ్‌ చేసి ఇక్కడకు వచ్చేలా సహకరించారు. మొత్తం రూ.30 లక్షల వరకు ఖర్చు అయింది. దీనికి మా బంధువులు, శ్రేయోభిలాషులు సహకరించారు. ఎంబామింగ్‌ త్వరగా అయిఉంటే పదిరోజుల ముందే పిల్లల మృతదేహాలను ఇక్కడకు తీసుకువచ్చేవాళ్లం’అని పిల్లల తల్లిదండ్రులు విలపించారు. శనివారం మధ్యాహ్నం గుర్రపుతండాలో అంత్యక్రియలు చేయనున్నట్లు శ్రీనివాస్‌ నాయక్‌ తెలిపారు. కాగా, శ్రీనివాస్‌ నాయక్‌ కుటుంబానికి అండగా ఉంటామని ఎమ్మెల్యే రవీంద్రకుమార్‌ నాయక్, ఎమ్మెల్సీ రాజేశ్వరరెడ్డి భరోసా ఇచ్చారు.   

మరిన్ని వార్తలు