బుగ్గ జాతరలో జనసంద్రోహం

14 Feb, 2018 15:30 IST|Sakshi
స్వామివారి దర్శనానికి క్యూలైన్‌లో బారులుతీరిన భక్తులు      

బారులు తీరిన భక్తులు

మొక్కులు చెల్లించుకున్న ప్రముఖులు  

బెల్లంపల్లిరూరల్‌ : మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని మండలంలోని కన్నాల పంచాయతీ బుగ్గ రాజరాజేశ్వరస్వామి జాతర మంగళవారం అత్యంత వైభవంగా జరిగింది. భక్తులు వేకువజాము నుంచే జాతరకు తరలివచ్చారు. మహిమాన్విత క్షేత్రంగా ప్రసిద్ధిగాంచిన బుగ్గ జాతరకు వచ్చిన భక్తులు రాజరాజేశ్వర స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. గుట్టపై స్వయంభుగా వెలిసిన గంగాజలాన్ని తలపై చల్లుకుని దైవ దర్శనం కోసం క్యూలైన్లలో బారులు తీరారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఆలయ కమిటీ ఆధ్వర్యంలో బారీకేడ్లు నిర్మించారు. ఆలయ కమిటీ సభ్యులు కొందరు ఇష్టారాజ్యంగా గర్భ గుడిలోకి బంధువులు, అనుయాయులను తీసుకెళ్లడంతో సాధారణ భక్తులు చాలా ఇబ్బందులు పడాల్సి వచ్చింది. క్యూలైన్లలో చిన్నారులు, వృద్ధులు అసౌకర్యానికి గురై నీరసించిపోయారు. జాతరకు లక్షకు పైగా భక్తులు విచ్చేసినట్లు అధికారులు అంచనా వేశారు. భక్తులు సాయంత్రం పూట జాతరకు హాజరై దైవ సన్నిధిలో జాగారం చేశారు. బెల్లంపల్లి పాత బస్టాండ్‌ నుంచి బుగ్గ దేవాలయం వరకు ఆసిఫాబాద్‌ ఆర్టీసీ డిపో నుంచి పది బస్సులను నడిపించారు. 


ప్రముఖుల రాక..


బుగ్గ జాతరకు పలువురు ప్రముఖులు వచ్చి పూజలు చేశారు. ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య, జాయింట్‌ కలెక్టర్‌ సురేందర్‌రావు, సబ్‌ కలెక్టర్‌ పీఎస్‌.రాహుల్‌ రాజ్,  గ్రంథాలయ సంస్థ జిల్లా చైర్మన్‌ ఆర్‌.ప్రవీణ్, మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ పి.సునీతారాణి, ఎంపీపీ సుభాష్‌రావు, తహసీల్దార్‌ కె.సురేష్‌ తదితర ప్రముఖులు జాతరకు వచ్చి పూజలు నిర్వహించారు.


స్వచ్ఛంద సంస్థల ఉదారత..


జాతరను పురస్కరించుకుని స్వచ్ఛంద సంస్థలు సేవా కార్యక్రమాలు నిర్వహించాయి. పురగిరి క్షత్రియ(పెర్క) సంఘం ఆధ్వర్యంలో భక్తులకు మజ్జిగ, మంచినీరు సరఫరా చేశారు. భవిత డిగ్రీ కళాశాల యాజమాన్యం పాలు, మంచినీటిని అందించింది. ఆర్యవైశ్య సంఘం, యువజన సంఘం ఆధ్యర్యంలో ద్రాక్ష పళ్లను పంపిణీ చేశారు. జనహిత సేవా సమితి నిర్వహకులు మజ్జిగ ప్రదానం చేసి ఉదారతను చాటుకున్నారు.


ట్రాఫిక్‌కు అంతరాయం..


జాతరకు భక్తులు అధిక సంఖ్యలో రావడంతో ట్రాఫిక్‌ సమస్యలు ఉత్పన్నమయ్యాయి. ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్‌ వాహనాల రద్దీ పెరగడంతో రోడ్డుపై ట్రాఫిక్‌ ఏర్పడింది. గంట సేపు వరకు ఎక్కడి వాహనాలు అక్కడే నిలిచిపోవడంతో భక్తులు అసౌకర్యానికి గురయ్యారు. చాలాసేపు పోలీసులు శ్రమిస్తే కానీ వాహనాల పునఃరుద్దరణ జరగలేదు. 

     

మరిన్ని వార్తలు