బతుకు భారం.. పండుగకు దూరం

30 Sep, 2016 01:50 IST|Sakshi
బతుకు భారం.. పండుగకు దూరం

నర్వ: బుక్కెడు బువ్వ కోసం తండ్లాడుతున్న పాలమూరు పల్లె వలసకడుతోంది.. పొట్ట చేతబట్టుకుని కూలి పనుల కోసం వెళ్లేందుకు సిద్ధమవుతోంది.. కన్నవారిని వదిలేసి, పిల్లాపాపలను విడిచేసి, ఉన్న ఊరి నుంచి పట్నాల దారి పడుతోంది.. భారమైన బతుకును ఈడ్చేందుకు 9 నెలల ‘కూలీ’వాసానికి వెళుతోంది.. ఏటా జరిగేతంతే అయినా ఈసారి దసరా పండుగకూ దూరమవుతోంది. కరువు పీడిత మహబూబ్‌నగర్ జిల్లా నుంచి ఏటా వేలాది మంది ఉపాధి కోసం వలస వెళుతుంటారు. ఏటా వర్షాకాలం ముగిశాక దాదాపుగా అక్టోబర్-నవంబర్ మధ్య సమయంలో దేశవ్యాప్తంగా వివిధ పట్టణాలు, ప్రాజెక్టుల ప్రాంతాలకు వలస వెళతారు.

అక్కడ రోజు కూలీలుగా పనిచేస్తుంటారు. దేశంలో ఎక్కడ భారీ ప్రాజెక్టులు, పరిశ్రమలు, జాతీయ రహదారులు, భారీ భవనాలు నిర్మిస్తున్నా.. అక్కడ కనిపించేది ‘పాలమూరు లేబరే’. ఇలా సంవత్సరంలో తొమ్మిది నెలల పాటు స్వగ్రామాలకు, తల్లిదండ్రులు, పిల్లలకు దూరంగా బతుకు వెళ్లదీస్తారు. గుంపు మేస్త్రీలు ఈ కూలీలను తీసుకెళ్లి.. పనులు పూర్తయ్యాక తిరిగి తీసుకొస్తారు. వర్షాకాలం ప్రారంభంలో తిరిగి స్వగ్రామాలకు చేరుకునే వారిలో చాలా మంది.. ఉన్న కాసింత భూమిని సాగు చేసుకుని, పైరు కొంత ఎదిగాక తిరిగి వలస బాట పడతారు. ఇప్పుడా కూలీలంతా మరో వలసకు సిద్ధమవుతున్నారు. దసరా ముందు పనులకు తీసుకెళ్లేందుకు గుంపు మేస్త్రీలు వారికి అడ్వాన్సుగా సొమ్ము చెల్లిస్తున్నారు.
 
వేలాది కుటుంబాలు..
మహబూబ్‌నగర్ జిల్లా వ్యాప్తంగా 20వేలకు పైగా కుటుంబాలు వలసల మీదే ఆధారపడి జీవిస్తున్నాయి. నారాయణపేట, కొడంగల్, మక్తల్, కొల్లాపూర్ నియోజకవర్గాల్లో కూలీలు ముంబై, పుణే, షోలాపూర్, నాసిక్, హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాలకు అధికంగా వలస వెళ్తుంటారు. అక్కడ మట్టి పనులు, కూలి పనులు చేస్తారు. పాలమూరు జిల్లాలోని వలస ప్రభావిత  ప్రాంతాల్లో నర్వ మండలం ప్రధానమైనది.  నర్వ మండల పరిధిలో 33 గ్రామాలున్నాయి. ఇక్కడ సాగునీటి సౌకర్యం లేక.. వ్యవసాయ భూములన్నీ బీళ్లు పడిపోయాయి. దీంతో ఆయా గ్రామాల రైతులు, రైతు కూలీలు ఉపాధి కోసం, పిల్లల చదువులు, భవిష్యత్ కోసం వలసల మార్గం పట్టారు.
 
వలస పోతేనే పొట్టనిండేది

‘‘పద్దెనిమిదేళ్ల వయసు నుంచే మట్టిపనుల కోసం వలస వెళ్లాను. ఇప్పటికి నాలుగు సార్లు భార్యాపిల్లలతో కలిసి వలస వెళ్లినా.. చేసిన అప్పులు తీర డం లేదు. ఉన్న పూరిగుడిసె కూడా కూలిపోయేలా ఉండడంతో మేస్త్రీ వద్ద అప్పుచేసి మరమ్మతు చేయించుకున్నాం..’’
- వెంకటేష్,  రాంపురం, నర్వ మండలం, మహబూబ్‌నగర్‌జిల్లా
 
అడ్వాన్సులిచ్చి తీసుకెళ్లినా..

గుంపు మేస్త్రీలు తమ పని గుంపుల (బృందాల) కోసం కూలీలను సమీకరిస్తున్నారు. పనుల కోసం వచ్చే ప్రతి జంట (భార్య, భర్త)కు రూ.80వేల నుంచి రూ.లక్ష వరకు అడ్వాన్సుగా ఇచ్చి, అప్పు పత్రాలు రాయించుకుంటారు. ఇలా సమీకరించిన కూలీలను గుంపులుగా పనులకు తీసుకువెళతారు. దాదాపు తొమ్మిది నెలల పాటు పనులు చేయించుకుని తిరిగి స్వగ్రామాలకు తీసుకువస్తారు. వచ్చాక జంటలకు రావాల్సిన కూలి సొమ్మును లెక్కించి అప్పగిస్తారు. అయితే కూలీలు తొలుత తీసుకున్న అడ్వాన్సు డబ్బులు తీరకపోగా.. ఒక్కో జంటకు ముప్పై, నలభై వేల వరకూ అప్పులే మిగులుతుండడం గమనార్హం.
 
15 ఏళ్లుగా వలస బతుకే..
‘‘మా ముగ్గురు పిల్లలను చదివించాలన్న ఉద్దేశంతో వలస వెళుతున్నాం. పిల్లలను మా అత్త, మేనమామల ఊరిలో ఉంచి చదివిస్తున్నాం. 15 ఏళ్లుగా నా భార్య, నేను వలస వెళ్తున్నా బతుకులు మారడం లేదు.. మా బతుకులు ఇలా ఉన్నాయి. పిల్లలనైనా చదివిద్దామన్న ఆశతో వలస వెళుతున్నాం..’’
- సవరన్న, రాంపురం, నర్వ మండలం

మరిన్ని వార్తలు