ఊపందుకున్న నామినేషన్లు

15 Nov, 2018 14:05 IST|Sakshi
రిటర్నింగ్‌ అధికారి సూర్యనారాయణకు నామినేషన్‌ పత్రాలు అందజేస్తున్న జోగు రామన్న  

బుధవారం ఒకే రోజు ఆరు నామినేషన్లు దాఖలు

ఆదిలాబాద్‌లో నలుగురు, బోథ్‌లో ఇద్దరు 

ఎనిమిదికి చేరిన సంఖ్య 

పత్రాలు సమర్పించిన ప్రధాన పార్టీల అభ్యర్థులు 

ఆదిలాబాద్‌అర్బన్‌: అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా నామినేషన్ల పర్వం ఊపందుకుంది. కార్తీక మాసం శ్రావణ నక్షత్రం ఉండడంతో బుధవారం ఒక్క రోజే జిల్లాలోని రెండు నియోజకవర్గాలకు ఆరు నామినేషన్లు దాఖలయ్యాయి. ఇందులో ఆదిలాబాద్‌లో నాలుగు, బోథ్‌ నియోజకవర్గంలో ఇద్దరు నామపత్రాలు సమర్పించారు. ఈనెల 12 నుంచి నామినేషన్ల దాఖలు ప్రారంభం కాగా రెండు రోజుల్లో ఇద్దరు మాత్రమే దాఖలు చేశారు. ముహూర్త బలం కలిసిరావడంతో మూడో రోజు ఏకంగా ఆరుగురు అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడం విశేషం. 
కార్తీక మాసంలో మంచి ముహూర్తాలను చూసుకొని అందుకనుగుణంగా ప్రధాన పార్టీల అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేసేందుకు ముందుకు రావడంతో జిల్లాలో నామినేషన్ల పర్వం ఊపందుకుంది. బుధవారం ఒకే రోజు ప్రధాన పార్టీలైన టీఆర్‌ఎస్, బీజేపీ, మహాకూటమి, బీఎస్పీ అభ్యర్థులు నామినేషన్లు సమర్పించారు. కాగా గడిచిన రెండు రోజుల్లో ఆదిలాబాద్‌ అసెంబ్లీ స్థానానికి ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేశారు. దీంతో జిల్లాలో మొత్తం నామినేషన్ల సంఖ్య ఎనిమిదికి చేరింది. బోథ్‌ నియోజకవర్గానికి మొదటి రెండు రోజులు నామినేషన్లు బోణీ కొట్టలేదు. బుధవారం టీఆర్‌ఎస్, బీజేపీ అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేశారు. 
ఆదిలాబాద్‌లో నలుగురు..
ఆదిలాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గ స్థానానికి పోటీ చేసేందుకు బుధవారం నాలుగు పార్టీల అభ్యర్థులు నామినేషన్లు అందజేశారు. కలెక్టరేట్‌లోని అర్బన్‌ తహసీల్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రిటర్నింగ్‌ అధికారి కార్యాలయంలో ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు నామినేషన్ల ఊపు కనిపించింది. ముందుగా ప్రతిపాదిత ఓటర్లతో రిటర్నింగ్‌ అధికారి కార్యాలయానికి వచ్చిన బీజేపీ అభ్యర్థి పాయల్‌ శంకర్‌ నామినేషన్‌ దాఖలు చేశారు. అనంతరం ఆపద్ధర్మ మంత్రి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జోగు రామన్న తన నామినేషన్‌ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి సూర్యనారాయణకు అందజేశారు. మరో అరగంట వ్యవధిలో బీఎస్పీ అభ్యర్థి ఈర్ల సత్యనారాయణ నామినేషన్‌ దాఖలు చేశారు. మధ్యాహ్నం 2:30 గంటల సమయంలో మహాకూటమి అభ్యర్థి గండ్రత్‌ సుజాత తన నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారికి అందజేశారు. కాగా టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జోగు రామన్నను ఎంపీ గోడం నగేష్, డెయిరీ డెవలప్‌మెంట్‌ చైర్మన్‌ లోకా భూమారెడ్డి, నాయకులు సాజీదొద్దీన్, మంచికట్ల ఆశమ్మ ప్రతిపాదించారు. మహాకూటమి అభ్యర్థిని టీడీపీ, సీపీఐ, కాంగ్రెస్‌ నాయకులు బలపర్చారు. బీజేపీ, బీఎస్పీ అభ్యర్థులను ఆయా పార్టీల నాయకులు ప్రతిపాదించారు. 
బోథ్‌లో ఇద్దరు నామినేషన్‌..
బోథ్‌ అసెంబ్లీ స్థానానికి నామినేషన్‌ బోణి అయ్యింది. ఈ నియోజకవర్గానికి నామినేషన్‌ ప్రారంభం నుంచి ఒక్కటి కూడా దాఖలు కాలేదు. మూడో రోజు బుధవారం రెండు నామినేషన్లు దాఖలయ్యాయి. టీఆర్‌ఎస్‌ అభ్యర్థి రాథోడ్‌ బాపూరావు మధ్యాహ్నం 12 గంటల సమయంలో తన నామినేషన్‌ పత్రాలను రిటర్నింగ్‌ అధికారి కృష్ణ ఆదిత్యకు అందజేశారు. అనంతరం బీజేపీ అభ్యర్థి మడావి రాజు నామినేషన్‌ దాఖలు చేశారు. కాగా సరైన ఫార్మట్‌లో పత్రాలు నింపకపోవడంతో రాజు నామినేషన్‌ను తిరస్కరించారు. ఈనెల 19లోగా తిరిగి నామినేషన్‌ వేయాలని ఎన్నికల రిటర్నింగ్‌ అధికారి కృష్ణాదిత్య నోటీసులు జారీ చేశారు. 
ఎవరి ధీమా వారిదే..
బుధవారం నామినేషన్లు సమర్పించిన అభ్యర్థులు గెలుపుపై ఎవరికి వారే ధీమా వ్యక్తం చేశారు. ఆదిలాబాద్‌లో వివిధ పార్టీల అభ్యర్థులు నామినేషన్‌ అనంతరం మీడియా పాయింట్‌ వద్ద మాట్లాడారు.  ఆపద్ధర్మ మంత్రి, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి జోగు రామన్న మాట్లాడుతూ గడిచిన నాలుగున్నర ఏళ్లలో ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో రూ.4,335 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామని తెలిపారు. ఇంటింటికీ నల్లా నీళ్లు ఇచ్చిన ఘనత టీఆర్‌ఎస్‌దేనని అన్నారు. ముచ్చటగా నాలుగోసారి ఎన్నికల్లో ఎమ్మెల్యేగా గెలిపించాలని ఓటర్లను కోరారు. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు, పథకాలు ప్రజలు మేలు చేశాయని, రాబోయే ఎన్నికల్లో తప్పకుండా విజయం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు. 
మహాకూటమి అభ్యర్థి గండ్రత్‌ సుజాత మాట్లాడుతూ రానున్న ఎన్నికల్లో మహాకూటమి విజయకేతనం ఎగురవేస్తుందని తెలిపారు. ఆదిలాబాద్‌ నియోజకవర్గంలో మహాకూటమి బలంగా ఉందన్నారు. ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచి తీరుతామన్న భరోసా ఉందన్నారు. రాష్ట్రంలోనూ మహాకూటమి అధికారంలోకి వస్తుందన్నారు. 
అనంతరం బీజేపీ అభ్యర్థి పాయల్‌ శంకర్‌ మాట్లాడుతూ టీఆర్‌ఎస్, కాంగ్రెస్‌ పార్టీలు నియోజకవర్గ అభివృద్ధికి చేసిందేమీ లేదన్నారు. నాలుగున్నరేళ్లలో ఎలాంటి అభివృద్ధి జరగలేదన్నారు. మూతపడిన పరిశ్రమలను తెరిపించడంలో విఫలమయ్యారని విమర్శించారు. ఈసారి ఎన్నికల్లో ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, తాను తప్పకుండా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. బీఎస్పీ అభ్యర్థి ఈర్ల సత్యనారాయణ మాట్లాడుతూ ఎన్నికల్లో తామే గెలుస్తామని అన్నారు. 

మరిన్ని వార్తలు