15 నుంచి నగదు బదిలీ

11 Nov, 2014 01:33 IST|Sakshi
15 నుంచి నగదు బదిలీ

సాక్షి, రంగారెడ్డి జిల్లా: వంటగ్యాస్ రాయితీకి సంబంధించి నగదు బదిలీ పథకం మళ్లీ తెరపైకి వచ్చింది. ఈనెల 15 నుంచి జిల్లాలో వంటగ్యాస్‌పై కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న రాయితీ డబ్బులు ఇక నేరుగా లబ్ధిదారుని ఖాతాలో జమ కానున్నాయి. ఇందుకు సంబంధించి పౌరసఫరాల శాఖ ఏర్పాట్లు వేగిరం చేసింది. వాస్తవానికి గతేడాదే ఈ పథకాన్ని యూపీఏ పథకం అమల్లోకి తెచ్చిన సంగతి తెలిసిందే.

 కానీ ఆధార్ కార్డుల జారీ ప్రక్రియ పూర్తికాకమునుపే నగదు బదిలీ అమలు చేయడంపై సర్వత్రా నిరసన వ్యక్తమైంది. దీంతో ఈ కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేసింది. తాజాగా ఎన్డీఏ ప్రభుత్వం దేశవ్యాప్తంగా 54జిల్లాల్లో ఈ పథకాన్ని అమలు చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా జిల్లాలో ఈవారం చివరినుంచి నగదు బదిలీ అమల్లోకి రానుంది.

 ఆధార్ లేకున్నా సరే..
 జిల్లాలో 13.76లక్షల వంటగ్యాస్ కనెక్షన్లున్నాయి. అయితే గత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ప్రకారం ప్రతి గ్యాస్ వినియోగదారుడికి ఆధార్ సంఖ్యను తప్పనిసరిగా పేర్కొంది. ఇందులో భాగంగా ఆధార్ కార్డు సంఖ్య, బ్యాంకు ఖాతాతో లబ్ధిదారుడి వివరాల్ని అనుసంధానం చేశారు.

 గ్యాస్ సిలిండర్ పొందిన అనంతరం రాయితీ డబ్బులు లబ్ధిదారుడి ఖాతాలో జమ అయ్యేవి. కానీ తాజాగా ఆధార్ సంఖ్య లేకుండానే నగదు బదిలీ అమలు చేయనున్నట్లు అధికారవర్గాలు చెబుతున్నాయి. అయితే లబ్ధిదారులు బ్యాంకు ఖాతా వివరాల్ని సంబంధిత డీలరుకు చేరవేయాల్సి ఉంటుంది.

 ప్రస్తుతం జిల్లాలో 88శాతం లబ్ధిదారుల వివరాలు ఆధార్ వివరాలతో అనుసంధానమయ్యాయి. మిగతా లబ్ధిదారులు ఆధార్ సంఖ్య లేకున్నా బ్యాంకు ఖాతా నంబరును డీలరుకు సమర్పించాలని జిల్లా పౌరసరఫరాల శాఖ అధికారి నర్సింహారెడ్డి తెలిపారు.

 ఇక పూర్తి ధర చెల్లించాలి..
 శనివారం నుంచి జిల్లాలో గ్యాస్ వినియోగదారులు సిలిండర్ పొందాలంటే పూర్తి సిలిండర్ ధర చెల్లించాల్సి ఉంటుంది. ప్రస్తుతం చెల్లిస్తున్న రూ.490 కాకుండా ప్రభుత్వం అందించే రాయితీని కలుపుకుని పూర్తి ధర చెల్లించాలి. సిలిండర్ పొందిన తర్వాత రాయితీ డబ్బులు నేరుగా వినియోగదారుడి ఖాతాకు ప్రభుత్వం బదలాయిస్తుంది. అక్రమాలకు కళ్లెం వేయాలనే ఉద్దేశంతో ఈ నగదు బదిలీ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టింది.

>
మరిన్ని వార్తలు