కాంగ్రెస్‌లో గెలిచి బీజేపీలోకి జంప్‌ అవుతారు: కేటీఆర్‌ వ్యాఖ్యలు

5 Oct, 2023 15:17 IST|Sakshi

సాక్షి, షాద్‌నగర్‌: తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు సమయం సమీపిస్తున్న కొద్దీ మాటల యుద్ధం పెరుగుతోంది. తాజాగా కాంగ్రెస్‌ పార్టీపై మంత్రి కేటీఆర్‌ సంచలన ఆరోపణలు చేశారు. అధికారం ఇచ్చినపుడు ప్రజలకు ఏమీ చేయని కాంగ్రెస్‌ పార్టీ.. ఇవాళ ఆచరణ సాధ్యం కాని హామీలు ఇస్తోందని ఎద్దేవా చేశారు.  

కాగా, మంత్రి కేటీఆర్‌ గురువారం రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా కేటీఆర్‌ మాట్లాడుతూ.. అమలు చేయలేని హామీలతో ప్రజలను ప్రలోభపెట్టాలని కాంగ్రెస్‌ పార్టీ చూస్తోంది. మోసాన్ని మోసంతోనే జయించి.. ఓటు బీఆర్‌ఎస్‌ అభ్యర్థులకు వేయాలన్నారు. బీజేపీ వాళ్లకు అదానీ నుంచి బాగా పైసలు వస్తున్నాయట. కాంగ్రెస్‌, బీజేపీ వాళ్లను దబాయించి పైసలు అడగండి. రైతుబంధు అందితేనే.. కల్యాణలక్ష్మి, షాదీ ముబారక్‌ చెక్కులు వస్తేనే మాకు ఓటేయండి. 

తొమ్మిదేళ్లలో ఎన్నో మంచి పనులు చేసుకున్నాం. షాద్‌నగర్‌కు నీళ్లు ఇచ్చేది కేసీఆర్‌.. తెచ్చేది అంజయ్య యాదవ్‌. రేవంత్‌ రెడ్డి ఒక గాడ్సే. కాంగ్రెస్‌ నేతలు కడుపులో గుద్ది.. నోట్లో చాక్లెట్‌ పెడతారు. బీజేపీ నేతలు నీళ్ల వాటా తేల్చరు.. కాంగ్రెస్‌ వాళ్లు ప్రాజెక్టులపై కేసులేసి ఇబ్బంది పెడతారు. రేవంత్‌రెడ్డి ఆర్‌ఎస్‌ఎస్‌ మనిషి అని కాంగ్రెస్‌ నేతలే చెప్పారు. ఈ విషయంపై పంజాబ్‌ మాజీ సీఎం కెప్టెన్‌ అమరీందర్‌సింగ్‌ సోనియాగాంధీకి లేఖ రాశారు. రేవంత్ రెడ్డి‌ బీజేపీతో కలిసి పోయారు. కాంగ్రెస్‌ నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వాళ్లు బీజేపీలోకి జంప్‌ అవుతారు అని ఘాటు వ్యాఖ్యలు చేశారు. 

ఇది కూడా చదవండి: బీజేపీ నుంచి కాంగ్రెస్‌లోకి.. క్లారిటీ ఇచ్చిన వివేక్‌

మరిన్ని వార్తలు