అవి అనువైన భవనాలు కావు

14 Dec, 2019 01:10 IST|Sakshi

ఎన్‌సీడీసీ ఏర్పాటుకు రెండెకరాలు కేటాయించాలని కేంద్ర బృందం వినతి

సాక్షి, హైదరాబాద్‌: హైదరాబాద్‌లోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనరేట్‌ ప్రాంగణంలోని పాత భవనాలు జాతీయ అంటు వ్యాధులని యంత్రణ సంస్థ (ఎన్‌సీడీసీ) ఏర్పాటు చేసే పరిశోధన కేంద్రానికి అనువైనవి కావని కేంద్రం స్పష్టం చేసింది. తమకు అనువైనచోట రెండెకరాలు కేటాయిస్తే అందులో భవనాలు నిర్మించుకుంటా మని కోరింది. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ పరిధిలోని ఎన్‌సీడీసీ అధికారులు రెండ్రోజులుగా హైదరాబాద్‌లో తమ పరిశోధన కేంద్రానికి అనువైన స్థలాన్ని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు.

కోఠిలోని వైద్య ఆరోగ్యశాఖకు చెందిన భవనాలను పరిశీలించారు. అవి పరిశోధన సంస్థకు యోగ్యంకావని నిర్ధారించారు. ఇటు యాచారం, శామీర్‌పేట, మానసిక చికిత్సాలయంలలో ఉన్న స్థలాలనూ పరిశీలించారు. అనంతరం వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌తో శుక్రవారం సమావేశమయ్యారు. స్థలం గుర్తించే వరకు కోఠిలోని ఆరోగ్య కుటుం బ సంక్షేమ కమిషనరేట్‌లోని భవనాలను ఉపయోగించుకోవాలని వారిని ఆయన కోరారు. కేంద్ర బృందంతో భేటీ అనంతరం ప్రజారోగ్య సంచాలకుడు డాక్టర్‌ గడల శ్రీనివాసరావుతో కలసి మంత్రి ఈటల రాజేందర్‌ మీడియాతో మాట్లాడారు. అన్ని రకాల వైరస్‌లను గుర్తించడం, వాటిపై పరిశోధన చేసేందుకు రాష్ట్రంలో ఎన్‌సీడీసీ ఏర్పాటవుతోందన్నారు.

కాగా, కేంద్ర బృందంతో భేటీ కోసం మంత్రి ఈటల రాజేందర్‌ కోఠిలోని ఆరోగ్య కుటుంబ సంక్షేమ కార్యా లయానికి వచ్చారు. ఆ సమయంలో వైద్య ఆరోగ్యశాఖకు చెందిన ఉన్నతాధికారులు ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో మరో సమావేశంలో ఉం డిపోయారు. కీలక సమావేశానికి ఉన్నతాధికారులెవ రూ హాజరుకాకపోవడంపై మీడియా ముందే ఈటల అసహనం వ్యక్తం చేశారు. ‘మిగతా అధికారులంతా ఏమయ్యారు’అని ఆయన అక్కడి అధికారులను ప్రశ్నించారు. కోఠిలో నిత్యం ఉండే కీలక అధికారులు ఒకరిద్దరు మినహా ఎవరూ మంత్రి సమావేశానికి రాకపోవడంపై విమర్శలు వస్తున్నాయి.

మరిన్ని వార్తలు