బాబు మైండ్ బ్లాక్ ...

19 Jul, 2014 08:23 IST|Sakshi
బాబు మైండ్ బ్లాక్ ...

హన్మకొండ: తెలంగాణ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతో ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు కండ్లు బైర్లుకమ్మాయని, మైండ్ బ్లాక్ అయిందని ఉపముఖ్యమంత్రి డాక్టర్ తాటికొండ రాజయ్య అన్నారు. శుక్రవారం రాత్రి వరంగల్‌లో ఎన్‌పీడీసీఎల్ స్థాయి తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ‘తెలంగాణ పునర్నిర్మాణంలో విద్యుత్ ఉద్యోగుల పాత్ర’ అంశంపై సదస్సు జరిగింది. ఈ సదస్సులో ఉప ముఖ్యమంత్రి డాక్టర్ రాజయ్య ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సంచలన నిర్ణయాలు తీసుకున్నారని అన్నారు. వీటి ని చూసి చంద్రబాబు ఆగమాగమైపోతున్నారని ఎద్దేవా చేశారు.
 
తెలంగాణ ఉద్యమంలో విద్యుత్ ఉద్యోగులు ముందున్నారని, తెలంగాణ పునర్నిర్మాణంలోనూ ముందుండాలని కోరారు. విద్యుత్ రంగంలో తెలంగాణ వెనుకబడి ఉందని, విద్యుత్ సరఫరాను మెరుగుపర్చడం కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ విద్యుత్ శాఖను తనవద్దనే ఉంచుకున్నారని చెప్పారు. విద్యుత్ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.

తెలంగాణలోని విద్యుత్ శాఖలో 1,600 మంది సీమాంధ్ర ఉద్యోగులు పనిచేస్తున్నారని, వారు వెళ్లిపోవడం ద్వారా తెలంగాణ ఇంజినీర్లకు పదోన్నతి లభించడంతోపాటు కొత్తవారికి ఉద్యోగాలు లభిస్తాయన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణలో చేపట్టిన విద్యుత్ ప్రాజెక్ట్‌ల పట్ల నిర్లక్ష్యం చేశారని, దీంతో అవి పెండింగ్‌లో ఉన్నాయన్నా రు. సోలార్‌సిస్టంపై రైతులను ప్రోత్సహించాలని సూచించారు. ప్రతి నియోజకవర్గంలో 100 పడకల ఆస్పత్రి ఏర్పాటు చేయనున్నట్టు రాజయ్య చెప్పారు. మనశాఖ-మన ప్రణాళిక లక్ష్యంగా విద్యుత్ ఉద్యోగులు కృషి చేయాలని సూచించారు.
 
కాంట్రాక్టు ఉద్యోగులను వీలైనంత వరకు రెగ్యులరైజ్ చేసేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని, అది వీలుకాకపోతే సమాన పనికి సమాన వేతనాలు చెల్లిస్తామన్నారు. తెలంగాణ ఎలక్ట్రిసిటీ ఇంజినీర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు శివాజీ మాట్లాడుతూ ప్రతీ సీమాంధ్ర ఉద్యోగి వారి స్వస్థలానికి వెళ్లాలని డిమాండ్ చేశారు. ఏపీ యూనియన్లు విద్యుత్ ఉద్యోగుల సభకు రాకుండా కుట్రలు పన్నడంతోపాటు ఆటంకాలు సృష్టించారని ఆరోపిం చారు.
 
విద్యుత్ సంస్థలోని హెచ్‌ఆర్‌డి సీజీఎం లుగా తెలంగాణ వారిని నియమించాలని, అప్పుడే విద్యుత్ మెరుగవుతుందని పేర్కొన్నారు. జన్మనిచ్చిన భూమి రుణం తీర్చుకోవడానికి తమ సంఘం పనిచేస్తుందని ఆయన చెప్పారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం రాజయ్యతో పాటు వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే వినయ్‌భాస్కర్‌ను సన్మానించారు. ఈ సదస్సులో 21 తీర్మానాలు ఆమోదించారు. ఈ సదస్సులో యూనియన్‌నాయకులు స్వామిరెడ్డి, మోహన్‌రెడ్డి, జానయ్య, విజేందర్‌రెడ్డి, ఎల్.సంపత్‌రావు, లింగమూర్తి, సమ్మయ్య, రాజేశ్వర్‌రావు, నాగప్రసాద్, నీలకంఠం, రామకృష్ణ, భద్రయ్య, రవి, మదుసూదన్‌రెడ్డి, సురేందర్‌రెడ్డి, మహేం దర్‌రెడ్డి, చంద్రప్రకాశ్ పాల్గొన్నారు.

మరిన్ని వార్తలు