బాబు, కేసీఆర్‌లవి కుటుంబ రాజకీయాలు

3 Mar, 2019 03:16 IST|Sakshi

ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలే: కె.లక్ష్మణ్‌

ఈ నెలలోనే రాష్ట్రంలో మోదీ, అమిత్‌ షాల పర్యటన 

సాక్షి, హైదరాబాద్‌: ఇటు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్, అటు  ఆంధ్రప్రదేశ్‌ సీఎం చంద్రబాబు కుటుంబ రాజకీయాలు చేస్తున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్‌ విమర్శించారు. దేశంలోని ప్రాంతీయ పార్టీలన్నీ కుటుంబ పార్టీలుగానే మిగిలిపోయాయని ఎద్దేవా చేశారు. దేశవ్యాప్తంగా చేపట్టిన విజయ్‌ సంకల్ప్‌ దివస్‌ కార్యక్రమంలో భాగంగా శనివారం రాష్ట్రవ్యాప్తంగా బైక్‌ ర్యాలీ నిర్వహించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా హైదరాబాద్‌లోని సుందరయ్య పార్క్‌ వద్ద ఆయన మాట్లాడుతూ.. గత 70 ఏళ్లలో ఏ ప్రభుత్వం కూడా చేయని అభివృద్ధి పనులను బీజేపీ ప్రభుత్వం చేసిందని చెప్పారు. మోదీ ఈ ఐదేళ్లలో ప్రవేశపెట్టిన పథకాలను ప్రచారం చేసేందుకు, కేంద్రంలో మరోసారి మోదీ ప్రభుత్వాన్ని గెలిపించుకోవాలనే ఉద్దేశంతో ‘దేశం కోసం మోదీ–మోదీ కోసం దేశం’అనే నినాదంతో బైక్‌ ర్యాలీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రైతులకు, అన్నివర్గాల ప్రజలకు మోదీ ప్రభుత్వం చేయాతనిచ్చిందన్నారు. ఈ నెలలోనే ప్రధాని నరేంద్రమోదీ, పార్టీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా రాష్ట్రంలో పర్యటించనున్నట్లు తెలిపారు.

సికింద్రాబాద్‌ ఎన్నికల  మేనేజ్‌మెంట్‌ ఇన్‌చార్జిగా ప్రదీప్‌కుమార్ 
సికింద్రాబాద్‌ లోక్‌సభ నియోజకవర్గం బీజేపీ ఎన్నికల మేనేజ్‌మెంట్‌ కమిటీ ఇన్‌చార్జ్‌గా ఆర్‌.ప్రదీప్‌కుమార్‌ను పార్టీ నియమించింది. ఈ సందర్భంగా ప్రదీప్‌ మాట్లాడుతూ.. మరోసారి సికింద్రాబాద్‌ స్థానం నుంచి బీజేపీ గెలుపు కోసం శక్తి వంచన లేకుండా కృషి చేస్తానని చెప్పారు. తనకు ఈ బాధ్యతను అప్పగించడం పట్ల పార్టీకి ఆయన కృతజ్ఞతలు తెలిపారు.

మరిన్ని వార్తలు