రాష్ట్ర తలసరి అప్పు సంగతేంటి?

22 Nov, 2023 04:29 IST|Sakshi

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రశ్న

29 నెలలపాటు దేశంలో అత్యధిక ద్రవ్యోల్బణం నమోదైంది తెలంగాణలోనే..

ఐదేళ్లలో ఒక్కరోజైనా రాష్ట్రానికి రుణం ఇవ్వకుండా

ఆపామేమో కేసీఆర్‌ నిరూపించాలని సవాల్‌ 

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణలో ఆర్థిక నిర్వహణ అధ్వానంగా ఉందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ విమర్శించారు. కేసీఆర్‌ ప్రభుత్వ విధానాలతో రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ పూర్తిగా అప్పుల ఊబిలో కూరుకుపోయిందని ఆరోపించారు. ఏకంగా 29 నెలలపాటు దేశంలోనే అత్యధిక ద్రవ్యోల్బణం నమోదైన రాష్ట్రంగా నిలిచిందని విమర్శించారు. దీనివల్ల ధరాభారం పెరిగి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారని చెప్పారు. మంగళవారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో నిర్మలా సీతారామన్‌ కేసీఆర్‌ సర్కారు పాలనపై విరుచుకుపడ్డారు. 

మోటార్లకు మీటర్లు పెట్టకుండా అదనపు రుణాలు ఎలా? 
వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు బిగించేందుకు నిరాకరించినందుకే గత ఐదేళ్లలో కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇవ్వాల్సిన రూ. 25 వేల కోట్ల నిధులను నిలిపేసిందంటూ సీఎం కేసీఆర్‌ చేసిన ఆరోపణలను నిర్మలా సీతారామన్‌ తోసిపుచ్చారు. గత ఐదేళ్లలో ఒక్కరోజైనా రాష్ట్రానికి రుణం ఇవ్వకుండా కేంద్రం ఆపిందేమో నిరూపించాలని సవాలు విసిరారు. విద్యుత్‌ సంస్కరణల అమల్లో భాగంగా అదనపు రుణం కావాలంటే వ్యవసాయ పంపుసెట్లకు మీటర్లు పెట్టాలని చెప్పామే తప్ప అది తప్పనిసరని చెప్పలేదని స్పష్టం చేశారు.

రాజ్యాంగం ప్రకారం కేంద్రం ఒక్కో రాష్ట్రం అప్పుల పరిస్థితిని సమీక్షిస్తుందని... అన్నిచోట్లా విద్యుత్‌ మీటర్లు పెట్టినట్లు నివేదిస్తే ఎఫ్‌ఆర్‌బీఎం పరిమితికి అదనంగా 0.25 శాతం రుణ పరిమితి పొందే వెసులుబాటు కల్పిస్తున్నామని చెప్పారు. తెలంగాణలో మీటర్లు పెట్టకుండా, ఆ మేరకు వచ్చే అప్పులు కూడా ఇవ్వాలంటే ఎలా కుదురుతుందని నిర్మల ప్రశ్నించారు. తాము ఎక్కడా తెలంగాణ రాష్ట్రం అప్పులు లేదా బదులు తీసుకోవడాన్ని ఆపలేదని స్పష్టం చేశారు. కానీ ఈ అంశంపై బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ప్రధాని మోదీపై విమర్శలు చేస్తూ నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు. 

మిగులు బడ్జెట్‌ రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారు... 
బంగారం లాంటి మిగులు బడ్జెట్‌ రాష్ట్రాన్ని బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం అప్పుల కుప్పగా మార్చేసి రెండు తరాలపై అప్పుల భారం మోపడం వాస్తవం కాదా? అని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రశ్నించారు. తెలంగాణలో తలసరి ఆదాయం ఎక్కువంటూ గొప్పగా మాట్లాడుతున్న అధికార పార్టీ నేతలకు దమ్ముంటే తలసరి అప్పు గురించి మాట్లాడాలని సవాల్‌ విసిరారు. పెద్ద మొత్తంలో అప్పులు తీసుకున్నా వాటితో ఆస్తుల కల్పన చేయడంలో ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని నిర్మల దుయ్యబట్టారు.  

బీఆర్‌ఎస్‌ను ఎవరూ బలపరచనందుకే మళ్లీ తెలంగాణవాదం.. 
టీఆర్‌ఎస్‌ను బీఆర్‌ఎస్‌గా మార్చడం ద్వారా ఇతర విపక్షాలను కూడదీసుకొని ప్రధాని కావాలని కేసీఆర్‌ కన్న కలలు కల్లలు అయ్యాయని... ఆయన్ను ఎవరూ బలపరచకపోవడంతో గత్యంతరం లేక మళ్లీ తెలంగాణ నినాదాన్ని కేసీఆర్‌ తలకెత్తుకున్నారని నిర్మలా సీతారామన్‌ ఓ ప్రశ్నకు బదులిచ్చారు. దీన్ని తెలంగాణ ప్రజలు అర్థం చేసుకున్నారని, వచ్చే ఎన్నికల్లో అందుకు తగ్గట్లుగా తీర్పునిస్తారని చెప్పారు.  

కేసీఆర్‌ అవినీతిపై విచారణ చేయిస్తాం.. 
రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చాక కేసీఆర్‌ సర్కార్‌ అవినీతిపై సుప్రీంకోర్టు రిటైర్డ్‌ జడ్జితో విచారణ జరిస్తామని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్‌ స్పష్టం చేశారు. బీసీ నేతను సీఎంను చేయడంతోపాటు ఎస్సీ వర్గీకరణపై ప్రధాని ఇచ్చిన హామీని నిలబెట్టుకుంటామన్నారు. ఎన్నికల కోడ్‌ అమలుతోపాటు పార్లమెంట్‌ శీతాకాల సమావేశాల తేదీలు కూడా ప్రకటించినందున ఎస్సీ వర్గీకరణ కోసం ఆర్డినెన్స్‌ జారీ సాధ్యం కాదని మరో ప్రశ్నకు నిర్మల బదులిచ్చారు. 

జూబ్లీహిల్స్‌ అభ్యర్థిని భారీ మెజారిటీతో గెలిపించాలి: నిర్మల 
వెంగళరావునగర్‌: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా హైదరాబాద్‌ వెంగళరావునగర్‌ డివిజన్‌ పరిధిలోని కళ్యాణ్‌నగర్‌ కాలనీ చౌరస్తాలో ఉన్న ఓ ఫంక్షన్‌ హాల్‌లో పలువురు ముఖ్యనేతలతో కేంద్ర మంత్రి నిర్మల మంగళవారం మీట్‌ అండ్‌ గ్రీట్‌ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఎన్నికల ప్రచారంలో ఇది తన మొదటి సమావేశమన్నారు.

తెలంగాణలో ఈ ఎన్నికలు చాలా ముఖ్యమైనవన్నారు. జూబ్లీహిల్స్‌లో యువ అభ్యర్థి బీజేపీ తరఫున బరిలో ఉన్నారని, ప్రతి ఒక్కరూ ఆయనకు మద్దతిచ్చి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో జూబ్లీహిల్స్‌ బీజేపీ అభ్యర్థి లంకెల దీపక్‌రెడ్డి, ఆ పార్టీ సీనియర్‌ నేతలు గౌతంరావు, కిలారి మనోహర్, గంగరాజు, రామకృష్ణ, ప్రేమ్, కీర్తిరెడ్డి, సుప్రియా, రూప తదితరులు పాల్గొన్నారు. 

మరిన్ని వార్తలు