ఇయర్‌ ఎండింగ్, న్యూఇయర్‌ జోష్‌ అక్కడే..

28 Dec, 2018 10:52 IST|Sakshi

విదేశాలకు సిటీజనుల పయనం  

ఇయర్‌ ఎండింగ్, న్యూఇయర్‌ జోష్‌ అక్కడే..  

బ్యాంకాక్, సింగపూర్, మలేసియా, దుబాయ్‌లకే డిమాండ్‌  

వారంలోనే 25శాతానికి పైగా పెరిగిన ప్రయాణాలు  

సాక్షి, సిటీబ్యూరో: న్యూఇయర్‌ జోష్‌ అప్పుడే మొదలైంది. నగరంలో ఇయర్‌ ఎండింగ్‌ వేడుకలను గ్రాండ్‌గా  సెలబ్రేట్‌ చేసేందుకు అనేక సంస్థలు పోటీ పడుతుండగా... సిటీజనులు మాత్రం ఎంచక్కా విదేశాలకు చెక్కేస్తున్నారు. నూతన సంవత్సర వేడుకలను విదేశాల్లో జరుపుకునేందుకు ఎక్కువ శాతం మంది మొగ్గు చూపుతున్నారు. సాధారణంగా ప్రతిఏటా డిసెంబర్‌ చివరి వారంలో హైదరాబాద్‌ నుంచి గోవాకు ఎక్కువ మంది వెళ్తారు. గోవాలో సరదాగా గడిపేందుకు ఆసక్తి చూపుతారు. కానీ ఈసారి చాలామంది నగరవాసులు గోవా కంటే బ్యాంకాక్‌కు పరుగులు పెడుతున్నారు. అందుబాటు చార్జీల్లోనే విదేశీ టూర్‌ ప్యాకేజీలు లభిస్తుండడంతో కొంతమంది కుటుంబాలతో సహా విదేశాలకు పయనమవుతుండగా... మరికొందరు సోలోగా ఎంజాయ్‌ చేసేందుకు ఫ్లైట్‌ ఎక్కేస్తున్నారు. గత వారం రోజులుగా సుమారు 25శాతానికి పైగా విదేశీ ప్రయాణాలు పెరిగినట్లు పలు ట్రావెల్‌ ఏజెన్సీలు తెలిపాయి. అడ్వాన్స్‌ బుకింగ్‌లు సైతం బాగా పెరిగినట్లు థామస్‌కుక్, కాక్స్‌ అండ్‌ కింగ్స్‌ తదితర సంస్థల ప్రతినిధులు పేర్కొన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా సుమారు లక్ష మంది ప్రయాణికులు అదనంగా బయలుదేరి వెళ్తున్నట్లు అంచనా.

చలో బ్యాంకాక్‌...  
హైదరాబాద్‌ నుంచి సింగపూర్, మలేసియా, మాల్దీవులు, బ్యాంకాక్, దుబాయ్‌లకు డిమాండ్‌ అనూహ్యంగా పెరిగింది. ఈ ఐదింటిలోనూ బ్యాంకాక్‌కు వెళ్లే వాళ్లే ఎక్కువ సంఖ్యలో ఉన్నారు. అందుబాటులో ఉన్న ప్యాకేజీలు, విమాన చార్జీలే ఇందుకు కారణం. సాధారణంగా హైదరాబాద్‌ నుంచి గోవా టూర్‌కు వెళ్లేందుకు రూ.25వేల నుంచి రూ.30వేల వరకు ప్యాకేజీలు ఉన్నాయి. ఇంచుమించు అదే ప్యాకేజీల్లో బ్యాంకాక్‌ టూర్‌లు  లభిస్తుండడంతో ఎక్కువ మంది గోవాకు ప్రత్యామ్నాయంగా బ్యాంకాక్‌ను ఎంపిక చేసుకుంటున్నారు. గోవాలో సందర్శించే స్థలాలు తక్కువ. బ్యాంకాక్‌లో ఎక్కువ పర్యాటక స్థలాలను సందర్శించవచ్చు. పైగా విదేశీ టూర్‌ చేసిన అనుభూతి కూడా ఉంటుంది. రూ.40వేల నుంచి రూ.50వేల వరకు నాలుగు రోజుల టూర్‌ ప్యాకేజీలు ప్రస్తుతం అందుబాటులో ఉన్నాయి. దీంతో నూతన సంవత్సర వేడుకలను విదేశాల్లో సెలబ్రేట్‌ చేసుకునేందుకు వెళ్తున్న వాళ్లలో 50శాతం బ్యాంకాక్‌నే ఎంపిక చేసుకుంటున్నారు. ఆ తర్వాత కుటుంబసభ్యులతో కలిసి వెళ్తున్న పర్యాటకులు సింగపూర్, మలేసియాలను ఎంచుకుంటున్నారు. ఒకే ప్యాకేజీలో రెండు దేశాలను సందర్శించే అవకాశాన్ని వినియోగించుకుంటున్నారు. ఈ రెండు దేశాల తర్వాత మాల్దీవులకు వెళ్తున్న వారి సంఖ్య కూడా బాగానే ఉంది. ప్రత్యేకంగా నూతన సంవత్సర వేడుకల కోసమే కాకపోయినా దుబాయ్‌కు వెళ్లే పర్యాటకుల సంఖ్య కూడా ఇతోధికంగా పెరిగినట్లు ట్రావెల్‌ ఏజెన్సీలు తెలిపాయి. దుబాయ్‌లో షాపింగ్‌కు ఇది అనుకూలమైన సమయం కావడంతోఎక్కువ మంది దుబాయ్‌ను కూడా ఎంపిక చేసుకుంటున్నారు. 

సోలో.. సో బెటర్‌  
మరోవైపు హైదరాబాద్‌ నుంచి వివిధ దేశాలకు వెళ్లే ఒంటరి పర్యాటకుల సంఖ్య కూడా ఈ ఏడాది బాగా పెరిగింది. సుమారు 28శాతం ఇలా ఒంటరిగా విదేశీ టూర్‌లకు వెళ్తున్నట్లు అంచనా. తమకు నచ్చిన  పర్యాటక స్థలాల్లో ఏకాంతంగా గడపాలనే కోరిక, ఎలాంటి బాదరాబందీల్లేకుండా ఎక్కడి నుంచి ఎక్కడికైనా  తేలిగ్గా ప్రయాణించేందుకు అవకాశం ఉండడం వల్ల  చాలా మంది సోలో జర్నీయే సో బెటర్‌ అనుకుంటున్నారు. సోలోగా వెళ్తున్న వారిలోనూ ఎక్కువ మంది బ్యాంకాక్, సింగపూర్, దుబాయ్‌లతో పాటు శ్రీలంకకు వెళ్తున్నారు. విదేశాలతో పాటు దేశంలోని బెంగళూర్, గోవా, జైపూర్, కొచ్చిన్, గౌహతి, విశాఖ నగరాలకు సైతం సోలో టూరిస్టుల తాకిడి ఎక్కువగా ఉండడం గమనార్హం. గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం హైదరాబాద్‌ నుంచి జాతీయ, అంతర్జాతీయ ప్రయాణాలు 20శాతం అదనంగా పెరిగాయి. ఇందుకు దేశంలోని వివిధ నగరాల్లో ఉడాన్‌ పథకం కింద ఎయిర్‌పోర్టులు అందుబాటులోకి రావడం, విదేశీ విమాన చార్జీలు కొంతమేర తగ్గుముఖం పట్టడం పర్యాటక ప్రియులకు చక్కటి అవకాశంగా మారింది.  

మరిన్ని వార్తలు