‘నమోదు, సవరణ’కు సహకరించండి

14 Nov, 2014 03:58 IST|Sakshi

ప్రగతినగర్: ఓటర్ల జాబితా సవరణ, కొత్త ఓటర్ల నమోదు ప్రకియ సజావుగా జరిగేందుకు అన్ని రాజకీయ పార్టీలు, ప్రజలు సహకరించాలని జిల్లా అదనపు జేసీ  శేషాద్రి కోరారు.గురువారం  కలెక్టరేట్‌లోని తన చాంబర్‌లో ఓటర్ల సవరణపై వివిధ రాజకీయ ప్రతినిధులు, నాయకులతో ఆయన మాట్లాడారు. ముసాయిదా ఓటర్ల జాబితాలో డిసెంబర్ 8వ తేదీ వరకు ఓటర్లు జాబితాలో మార్పులు, చేర్పులు, తొలగింపునకు సంబంధించి దరఖాస్తులు  స్వీకరిస్తారన్నారు.

నవంబర్ 16,23,30 తేదీల్లో, డిసెంబర్ 7వ తేదీన రాజకీయ పార్టీల నుంచి బూత్‌స్థాయి ఏజెంట్ల ద్వారా బూత్‌లెవల్ అధికారులు స్వీకరిస్తారన్నారు. స్వీకరించిన దరఖాస్తులను డిసెంబర్ 22వ తేదీలోగా విచారణ చేసి పరిష్కరిస్తామని తెలిపారు. జనవరి 2015, 5వ తేదీన తుది పరిశీలన కోసం ఓటర్ల జాబితాను సిద్ధం చేస్తామన్నారు. జాబితాలో పేర్ల నమోదుకు ఆధార్ తప్పనిసరిగా నమోదు చేయాల్సి ఉంటుందన్నారు.

  జాబితాలో పేర్లులేని అర్హులైన ఓటర్లు డిసెంబర్ 8వ తేదీ వరకు నిర్ణీత ఫారంతో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ప్రత్యేక నమోదు తేదీలో సంబంధిత పోలింగ్ కేంద్రాల్లో బూత్‌లెవల్ అధికారులు తప్పనిసరిగా ఉండాలని ఆదేశించారు. ఓటర్ల జాబితా సవరణ, నమోదుపై ప్రజల్లో చైతన్యం కల్పించాలని అన్ని రాజకీయ పార్టీ ప్రతినిధులను కోరారు. సమావేశంలో డీఆర్వో యాదిరెడ్డి, ఏఈ గంగాధర్, వివిధ పార్టీల ప్రతినిధులు పాల్గొన్నారు.

>
మరిన్ని వార్తలు