కేంద్ర నిధులపై సర్కారు దృష్టి | Sakshi
Sakshi News home page

కేంద్ర నిధులపై సర్కారు దృష్టి

Published Fri, Nov 14 2014 4:01 AM

The central focus of government funds

  • కసరత్తు ప్రారంభించిన ఆర్థిక శాఖ
  • వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి ప్యాకేజీ కోసం యత్నాలు
  • బడ్జెట్‌లో పేర్కొన్న మేరకు నిధులు పొందే వ్యూహం
  • సాక్షి, హైదరాబాద్: బడ్జెట్‌లో ప్రతిపాదించిన మేరకు కేంద్రం నుంచి నిధులను రాబట్టేందుకు రాష్ర్ట ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. ప్రత్యేక ప్యాకేజీ కింద చూపించిన ఐదు వేల కోట్ల రూపాయలను వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి పనుల పథకం కింద అందించాలని కేంద్రాన్ని కోరేందుకు సిద్ధమైంది. తెలంగాణలోని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోసం నిధులు సమకూరుస్తామని విభజన చట్టంలో స్పష్టం చేసినందున, ఆ మేరకు నిధులను పొందడానికి ఆర్థిక శాఖ ప్రయత్నిస్తోంది.

    ఇందులో భాగంగా వెనుకబడిన ప్రాంతాల్లో చేపట్టే కార్యక్రమాలపై అన్ని శాఖలను ప్రతిపాదనలు ఇవ్వాలని కోరింది. ఈ ప్రతిపాదనలతో కూడిన నివేదికను వారం రోజుల్లో కేంద్రానికి ఇవ్వాలని నిర్ణయించింది. 13వ ఆర్థిక సంఘం నుంచి రావాల్సిన బకాయిలు చాలా ఉన్నాయని, వాటిని తెచ్చుకోవడంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు ఆర్థిక శాఖ వర్గాలు వివరించాయి.

    ఆదాయాలు సమీకరించుకోవడానికి ఉన్న మార్గాలన్నింటినీ అన్వేషిస్తున్నట్లు తెలిపాయి. అన్ని రంగాలకు నిధులు కేటాయించడం వల్ల బడ్జెట్ కేటాయింపులు పెరిగినట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. భూముల అమ్మకాలపై ప్రభుత్వం ఎక్కువ ఆశలు పెట్టుకున్నట్లు బడ్జెట్‌లో కనిపిస్తోందన్న వాదనపై ఆర్థిక శాఖ ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ... ఇదో ప్రయత్నం మాత్రమేనని, నిధులు వస్తే మంచిదే కదా అని వ్యాఖ్యానించారు.

    భారీ బడ్జెట్ నేపథ్యంలో కేంద్రం నుంచి అధిక నిధులు తెచ్చుకుంటామన్న ధీమాను ఆధికారులు వ్యక్తం చేస్తున్నారు. గతంలో వచ్చిన నిధుల ఆధారంగానే ఈసారి అంచనాలను రూపొందించినట్లు తెలిపారు. కేంద్ర ప్రభుత్వం గతంలో నేరుగా వివిధ పథకాల కింద ఆయా శాఖలకు నిధులు కేటాయించేదని, ఆ నిధులు ఏమవుతున్నాయో లెకా్కాపత్రం ఉండేది కాదని, ఇప్పుడు కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులన్నీ నేరుగా ప్రభుత్వ ఖజానాలోకి వస్తాయని వారు చెబుతున్నారు.

    ఏయే పథకానికి ఎన్ని నిధులిస్తుందన్న విషయాన్ని కేంద్రం స్పష్టంగా పేర్కొన్నందున, ఆ మేరకు నిధులు రాకలో ఇబ్బందులు ఉండవంటున్నారు. కాగా, రాష్ట్ర ప్రభుత్వం రూ. లక్ష కోట్లకుపైగా బడ్జెట్‌ను ప్రవేశపెట్టినప్పటికీ.. మొత్తం వ్యయం రూ. 50 వేల కోట్లకు మించకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. గడిచిన ఐదు నెలల్లో చేసిన వ్యయం రూ. 20 వేల కోట్లు మాత్రమేనని ఆర్థిక మంత్రి ఈటెల రాజేందర్ స్వయంగా వెల్లడించారు.
     

Advertisement
Advertisement