యూనివర్సిటీ యూనిట్‌గానే రిజర్వేషన్లు 

11 Feb, 2020 01:48 IST|Sakshi

యూజీసీ నిబంధనల ప్రకారమే నియామకాలు

రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌పై కమిటీ ప్రతిపాదనలు

త్వరలోనే నివేదిక

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలోని యూనివర్సిటీల్లో అధ్యాపక పోస్టుల భర్తీ ప్రక్రియలో అమలు చేయనున్న రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ విధానం దాదాపుగా ఖరారైంది. యూనివర్సిటీ యూనిట్‌గానే రిజర్వేషన్లు అమలు చేయాలన్న నిర్ణయానికి ఉన్నత విద్యామండలి నియమించిన ఏడుగురితో కూడిన అధికారుల కమిటీ నిర్ణయానికి వచ్చింది. సోమవారం ఉన్నత విద్యామండలి చైర్మన్‌ ప్రొఫెసర్‌ తుమ్మల పాపిరెడ్డి అధ్యక్షతన జరిగిన కమిటీ సమావేశం జరిగింది. త్వరలోనే దీనిపై ప్రభుత్వానికి నివేదికను అందజేయనున్నారు. అధ్యాపక నియామకాల్లో యూజీసీ నిబంధనలు కచ్చితంగా అమలయ్యేలా చూడాలని నిర్ణయించారు. అసిస్టెంట్‌ ప్రొఫెసర్ల నియామకాలకు రాష్ట్రంలో రాత పరీక్షను నిర్వహించాలన్న అంశంపైనా సమావేశంలో చర్చించారు. మరోవైపు 2021 నుంచి యూని వర్సిటీల్లో నియమితులయ్యే అసిస్టెంట్‌ ప్రొఫెసర్లకు తప్పనిసరిగా పీహెచ్‌డీ ఉండాలని యూజీసీ ఇప్పటికే నిర్ణయించింది.

ఈ నేపథ్యంలో రాష్ట్రంలో నిర్వహించబోయే నియామకాల్లో పీహెచ్‌డీని అమలు చేయాలా? వద్దా? అనేది చర్చించారు. సోమవారం జరిగిన సమావేశంలో కమిటీ ప్రతిపాదనలను సిద్ధం చేసినట్లు తెలిసింది. రిజర్వేషన్లను యూ నివర్సిటీ యూనిట్‌గా కొనసాగిస్తేనే ఎస్సీ, ఎస్టీ, బీసీలకు న్యాయం జరుగుతుందని, డిపార్ట్‌మెంట్‌ యూనిట్‌గా చేస్తే అన్యాయం జరిగే ప్రమాదం ఉందని కమిటీ అభిప్రాయపడింది. వీటిపై కమిటీ త్వరలో మరోసారి సమావేశమై ప్రతిపాదనలను ప్రభుత్వానికి అందజేయాలని నిర్ణయించింది. ఈలోగా యూనివర్సిటీల వైస్‌ ఛాన్స్‌లర్ల నియామకం జరుగుతుందని, ఆ తరువాత అసిస్టెంట్‌ ప్రొఫెసర్, అసోసియేట్‌ ప్రొఫెసర్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్లు వస్తాయని ఉన్నత విద్యా మండలి అధికారి ఒకరు పేర్కొన్నారు.

మరిన్ని వార్తలు