రేపు టికెట్లు ప్రకటించనున్న కాంగ్రెస్‌

9 Nov, 2018 09:50 IST|Sakshi
ప్రతీకాత్మక చిత్రం

నర్సాపూర్‌ టికెట్‌ సునీతారెడ్డికి ఖరారు !

మెదక్‌ నుంచి విజయశాంతికి  అవకాశం..!

స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసే యోచనలో శశిధర్‌రెడ్డి?

మెదక్‌ టికెట్‌పై ఆశలు వదులుకోని టీజేఎస్‌

కాంగ్రెస్‌ టికెట్ల ఖరారుపై రేపు స్పష్టత రానుంది. ఎప్పటినుంచో ఊహించిన విధంగానే నర్సాపూర్‌ నుంచి మాజీ మంత్రి సునీతారెడ్డికి టికెట్‌ ఖాయమైనట్లు తెలుస్తోంది. మెదక్‌ టికెట్‌పై షెడ్యూల్‌ వచ్చిన నాటి నుంచి ఉత్కంఠ కొనసాగుతూనే ఉంది. దీనికోసం 14 మంది ఆశావహులు దరఖాస్తు చేసుకున్న విషయం తెలిసిందే.  కానీ ప్రస్తుతం మెదక్‌ నుంచి మాజీ ఎంపీ విజయశాంతి పోటీ చేస్తారనే వార్తలు వినిపిస్తున్నాయి. దీంతో ఈ టికెట్‌ కోసం తీవ్రంగా కృషి చేసిన శశిధర్‌రెడ్డి రెబల్‌గా పోటీ చేసే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే మిగిలిన ఆశావహులు మాత్రం విజయశాంతి అభ్యర్థిత్వాన్ని సమర్థించినట్లు సమాచారం.

సాక్షి, మెదక్‌: నెలరోజులుగా నెలకొన్న ఉత్కంఠకు రేపటితో తెరపడనుంది. కాంగ్రెస్‌ పార్టీ శుక్రవారం ఎమ్మెల్యే అభ్యర్థులను ప్రకటించనుంది. దీంతో మెదక్, నర్సాపూర్‌ టికెట్లపై స్పష్టత రానుంది. గురువారం రోజంతా  స్క్రీనింగ్‌ కమిటీ ఎమ్మెల్యే అభ్యర్థుల పేర్లను వడకట్టింది. అన్ని అంశాలను పరిగణలోకి తీసుకున్న అనంతరం ఎమ్మెల్యే అభ్యర్థులను ఎంపిక చేసి ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్‌గాంధీకి జాబితాను అందజేసింది.   రాహుల్‌గాంధీ ఆమోదముద్ర పడినవెంటనే అభ్యర్థులను పేర్లను ప్రకటించనున్నారు. ఢిల్లీలోని కాంగ్రెస్‌ వర్గాల సమాచారం మేరకు అందరూ ఊహించిన విధంగానే నర్సాపూర్‌ ఎమ్మెల్యే టికెట్‌ సునీతారెడ్డికి ఖరారు అయినట్లు తెలుస్తోంది. మెదక్‌ సీటుపై మాత్రం చివరి వరకు ఉత్కంఠ కొనసాగుతూనే  ఉంది.

మెదక్‌ నుంచి పోటీ చేయాల్సిందిగా మాజీ ఎంపీ విజయశాంతిపై కాంగ్రెస్‌ అధిష్టానం వత్తిడి తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. అధిష్టానం సూచన మేరకు ఆమె మెదక్‌ నుంచి పోటీ చేసేందుకు అవకాశాలున్నట్లు తెలుస్తోంది. ఈ టికెట్‌ ఆశిస్తున్న ఇతర కాంగ్రెస్‌ నాయకులు సైతం విజయశాంతి పోటీ చేస్తుందని చెబుతున్నారు. మరోవైపు కాంగ్రెస్‌ స్క్రీనింగ్‌ కమిటీ ఎదుట గురువారం మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి, జిల్లా నాయకుడు తిరుపతిరెడ్డిలు హాజరయ్యారు.  వీరిద్దరిని కాంగ్రెస్‌ పెద్దలు బుజ్జిగించినట్లు సమాచారం.   విజయశాంతి విజయానికి సహకరించాలని వారికి సూచించినట్లు తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి రాగానే నామినేటెడ్‌ పదవులు ఇస్తామని రెబెల్‌గా పోటీ చేయొద్దని ఇద్దరిని బుజ్జగించినట్లు తెలుస్తోంది.


కాంగ్రెస్‌ టికెట్‌పై ఎక్కువగా ఆశలు పెట్టుకున్న మాజీ ఎమ్మెల్యే శశిధర్‌రెడ్డి మాత్రం విజయశాంతికి టికెట్‌ కట్టబెట్టడంపై అసంతృప్తి వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. మెదక్‌ టికెట్‌ తనకు ఇస్తే భారీ మెజార్టీతో గెలిచి కాంగ్రెస్, స్టార్‌ క్యాంపెయినర్‌ విజయశాంతికి బహుమానంగా ఇస్తానని చెప్పినట్లు తెలుస్తోంది. ఇదే విషయాన్ని ఢిల్లీలో మీడియాకు తెలియజేశారు. తనకు కాంగ్రెస్‌ టికెట్‌ దక్కని పక్షంలో రెబెల్‌గా పోటీచేసే యోచనలో శశిధర్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తిరుపతిరెడ్డితోపాటు ఎమ్మెల్యే టికెట్‌ ఆశించిన బట్టి జగపతి, సుప్రభాతరావు, మ్యాడం బాలకృష్ణ తదితరులు విజయశాంతి అభ్యర్థిత్వానికి మద్దతు పలుకుతున్నారు. మెదక్‌ నుంచి టీజేఎస్‌ పోటీ చేసేకంటే కాంగ్రెస్‌ నుంచి మాజీ ఎంపీ విజయశాంతి పోటీచేస్తేనే తమకు, పార్టీకి బాగుంటుందని వారు భావించటమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. 

ఒత్తిడి తీసుకురావడంతో..
ఎన్నికల షెడ్యూల్‌ విడుదలైంది మొదలు మెదక్‌ అసెంబ్లీ టికెట్‌పై  ఉత్కంఠ నెలకొంది.  దీని కోసం 14 మంది కాంగ్రెస్‌ నాయకులు దరఖాస్తు చేసుకున్నారు. వీరిలో శశిధర్‌రెడ్డి మినహా మిగితా ఆశావహులంతా విజయశాంతిని కలిసి తమలో ఎవరికి టికెట్‌ ఇప్పించినా అందరం కలిసికట్టుగా పనిచేస్తామని ఒప్పించారు. దీంతో విజయశాంతి శశిధర్‌రెడ్డిని మినహాయించి మిగితా ఆశావహుల్లో ఎవరికైనా టికెట్‌ ఇప్పించాలని అనుకున్నారు. అయితే అకస్మాత్తుగా టీజేఎస్‌ ఈ టికెట్‌ కోసం పట్టుబట్టింది. పొత్తులో భాగంగా మెదక్‌ స్థానాన్ని వదులుకునేందుకు ముందుగా కాంగ్రెస్‌ సిద్ధమైంది. దీనిని పసిగట్టిన ఆశావహులంతా మరోమారు విజయశాంతిని కలిసి మెదక్‌ టికెట్‌ టీజేఎస్‌కు వెళ్లకుండా చూడాలని, అవసరమైతే మీరే ఎమ్మెల్యేగా పోటీ చేయాలని తెలిపారు.

దీంతో  విజయశాంతి మూడు రోజుల క్రితం ఢిల్లీకి వెళ్లారు. ఏఐసీసీ పెద్దలతోపాటు స్క్రీనింగ్‌ కమిటీ చైర్మన్‌ భక్తచరణ్‌దాస్‌ను కలిసి మెదక్‌ టికెట్‌ ఎట్టిపరిస్థితుల్లో కాంగ్రెస్‌కే ఇవ్వాలని టీజేఎస్‌కు ఇవ్వొద్దని కోరారు. మెదక్‌ స్థానం టీజేఎస్‌కు ఇవ్వవద్దని అనుకుంటే మీరే పోటీ చేయాలని కాంగ్రెస్‌ అధిష్టానం విజయశాంతిపై వత్తిడి తీసుకువచ్చినట్లు సమాచారం. దీంతో విజయశాంతి మెదక్‌ నుంచి పోటీచేసేందుకు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. కాగా టీజేఎస్‌ మాత్రం మెదక్‌పై ఇంకా ఆశలు వదులుకోవడం లేదు. విజయశాంతి పక్కకు తప్పుకున్న పక్షంలో మెదక్‌ స్థానం తమకే దక్కుతుందని టీజేఎస్‌ నాయకులు ధీమాగా ఉన్నారు. కాంగ్రెస్‌ అధిష్టానం శుక్రవారం టికెట్లు ప్రకటించనున్న నేపథ్యంలో ఈ టికెట్‌పై నెలకొన్న ఉత్కంఠకు తెరపడనుంది.   

మరిన్ని వార్తలు