నేడో.. రేపో.. జాబితా | Sakshi
Sakshi News home page

నేడో.. రేపో.. జాబితా

Published Fri, Nov 9 2018 9:36 AM

Congress Grand Alliance MLA List Release Tomorrow Karimnagar - Sakshi

సాక్షిప్రతినిధి, కరీంనగర్‌: మహాకూటమి సీట్ల సర్దుబాటు వ్యవహారం సర్దుకు వచ్చింది. రాష్ట్రంలో పొత్తులో భాగంగా 13 టీడీపీకి, 8 టీజేఎస్, 3 సీపీఐకి ఇవ్వాలని కాంగ్రెస్‌ పార్టీ అధిష్టానం నిర్ణయించింది. దీంతో ఉమ్మడి కరీంనగర్‌ జిల్లాలో 13 స్థానాలకు గాను 11 చోట్ల కాంగ్రెస్‌ అభ్యర్థులకే అవకాశం కల్పించనుంది. సీట్ల సర్దుబాటులో భాగంగా తెలంగాణ జన సమితి, టీడీపీకి తల ఒక సీటు కేటాయించాలని ప్రతిపాదన కాగా సీపీఐ కేటాయింపు స్థానంలో హుస్నాబాద్‌ కీలకంగా మారింది. హుస్నాబాద్‌ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్, సీపీఐ పార్టీలు పట్టుపడుతున్నాయి. ఆ స్థానం కాంగ్రెస్‌ కేంద్ర ఎన్నికల కమిటీలోనూ చర్చకు తావిచ్చింది. రామగుండం స్థానంలో టీజేఎస్‌ పార్టీ నుంచి ప్రొఫెసర్‌ కోదండరాంకు కేటాయించాలనే  అభిప్రాయం కాంగ్రెస్‌ వ్యక్తం చేయడంతో కాంగ్రెస్‌ టికెట్‌ ఆశిస్తున్న రాజ్‌ఠాకూర్‌ మక్కాన్‌సింగ్‌కు నిరాశే మిగలనుంది.

అలాగే ధర్మపురి స్థానం సైతం టీడీపీ కావాలని కోరుతుండగా ఆ స్థానం టీడీపీకి కేటాయింపుపై సందిగ్ధంగా మారింది. కాంగ్రెస్‌ పార్టీ కేంద్ర ఎన్నికల కమిటీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి కుంతియా చేసిన ప్రకటన మేరకు శుక్రవారం కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థులను ప్రకటించనుంది. పొత్తుల్లో భాగంగా పార్టీ సీట్ల కేటాయింపుపై కొన్నిచోట్ల తర్జనభర్జన జరుగుతోంది. హుస్నాబాద్, రామగుండం, ధర్మపురి మినహాయించి పది చోట్ల కాంగ్రెస్‌ పార్టీ అభ్యర్థుల జాబితాను శుక్ర, శనివారాల్లో ప్రకటించే అవకాశం ఉంది. ఇదిలా ఉంటే టీపీసీసీ, భగత్‌ చరణ్‌దాస్‌ స్టీరింగ్‌ కమిటీ దాదాపుగా 13 నియోజకవర్గాల్లో ఒకే పేరును ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదన మేరకు పది స్థానాల్లో మొదటి విడతగా అభ్యర్థులను ప్రకటిస్తున్నారు.

కాంగ్రెస్‌ అభ్యర్థుల జాబితాలో తాటిపర్తి జీవన్‌రెడ్డి (జగిత్యాల), పొన్నం ప్రభాకర్‌ (కరీంనగర్‌), దుద్దిళ్ల శ్రీధర్‌బాబు (మంథని), ఆరెపల్లి మోహన్‌ (మానకొండూర్‌), కేకే మహేందర్‌రెడ్డి (సిరిసిల్ల), కౌశిక్‌రెడ్డి (హుజూరాబాద్‌), ఆది శ్రీనివాస్‌ (వేములవాడ), జువ్వాడి నర్సింగరావు (కోరుట్ల), మేడిపల్లి సత్యం (చొప్పదండి), సీహెచ్‌ విజయరమణారావు (పెద్దపల్లి) పేర్లను శుక్ర లేదా శనివారాల్లో  ప్రకటించనున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదిలా ఉండగా హుస్నాబాద్‌ నియోజకవర్గంలో కాంగ్రెస్, సీపీఐ పట్టుపట్టడంతో ఆ స్థానం అభ్యర్థిని రెండో విడతలో ప్రకటించే అవకాశం ఉంది.

ధర్మపురి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ నుంచి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ పేరు ప్రతిపాదించగా పొత్తుల్లో టీడీపీకి ప్రకటిస్తే యాదిబాల్‌రెడ్డి పేరు ప్రతిపాదించనున్నారు. రామగుండం స్థానాన్ని టీజేఎస్‌ అధినేత కోదండరాంకు ప్రతిపాదించనున్నారు. సర్దుబాటు కేటాయింపులపై సీపీఐ సీరియస్‌గా పరిగణిస్తోంది. కేవలం మూడు స్థానాలే కేటాయించగా అందులో హుస్నాబాద్‌ నియోజకవర్గాన్ని మినహాయించడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇదే విషయంపై తాడోపేడో తేల్చుకునేందుకు మరోమారు శుక్రవారం రాష్ట్ర కార్యవర్గం అత్యవసర సమావేశం ఏర్పాటు చేసింది.

Advertisement
Advertisement